సుజనాకు మరో ఛాన్స్ లేనట్లేనా?

Update: 2016-02-25 07:30 GMT
 కేంద్రమంత్రి సుజనాచౌదరికి రాజ్యసభ అవకాశం పొడిగింపు అనుమానంగానే కనిపిస్తోంది. బ్యాంకులకు అప్పులు ఎగ్గొట్టిన కేసులో సుజనా చౌదరి కంపెనీ ఉండటంతోపాటు, తాజాగా సీబీఐ మాజీ డైరక్టర్ విజయరామారావు కుమారుడు శ్రీనివాస్‌ పై సీబీఐ దాడుల నేపథ్యంలో సుజనా చౌదరి వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. మారిషన్ నుంచి సుజనా యూనివర్సల్ కంపెనీ తీసుకున్న అప్పులు చెల్లించని వైనం అప్పట్లో సంచలనం సృష్టించింది. దానిపై ఆ దేశ బ్యాంకు ప్రతినిధులు ఇక్కడి కోర్టులో కేసు కూడా దాఖలు చేశారు. అయితే తనకు ఆ అప్పులతో ఎలాంటి సంబంధం లేదని, తాను అప్పటికి సుజనా కంపెనీలో ఎలాంటి పదవిలో లేనని వాదించారు. తానెవరికీ భయపడాల్సిన పనిలేదని, ముఖ్యంగా మీడియాలో వచ్చే వార్తలకు భయపడాల్సిన అవసరం లేదని, మీడియాలో ఏం రాసినా తనకు నష్టం లేదని, ప్రధానికి కూడా సమన్లు వస్తాయని, చౌదరి తాజాగా లెక్కలేనితనంతో చేసిన ప్రకటన అటు బిజెపి వర్గాలకూ ఆగ్రహం తెప్పించింది. అయితే, సుజనా కంపెనీలతో తనకు సంబంధం లేదని చౌదరి వాదిస్తున్నప్పటికీ, మారిషస్ బ్యాంకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం చూస్తే.. ఆయన 1986 ఆగస్టు 22 నుంచి 2014 అక్టోబర్ 15 వరకూ డైరక్టర్‌ గా కొనసాగినట్లు తెలుస్తోంది. ఆ బ్యాంకు నుంచి సుజనా అనుబంధ కంపెనీ హేస్టియా హోల్డింగ్స్ 2012లో 92 కోట్ల రుణం తీసుకుంది. ఆ బ్యాంకు కంపెనీకి అప్పు ఇచ్చినప్పుడు, ఇచ్చిన అప్పు తీర్చలేదని అంతర్జాతీయ న్యాయస్థానాలను ఆశ్రయించిన సమయంలోనూ, చౌదరి కంపెనీ డైరక్టర్‌గానే ఉన్నారంటున్నారు. వీటిని దాచిపెట్టి, సుజనా కంపెనీలతో తనకెలాంటి సంబంధం లేదని వాదిస్తున్న కేంద్రమంత్రి వ్యవహారంపై.. అటు టిడిపి - ఇటు బిజెపిలోనూ చర్చనీయాంశమయింది. మళ్లీ సుజనా చౌదరికి రాజ్యసభ సీటు ఇస్తే, ఆర్ధిక నేరాలు ఎదుర్కొంటున్న వ్యక్తిని పార్టీ సమర్ధిస్తోందన్న నింద ఎదుర్కోవలసి వస్తుందని టిడిపి సీనియర్లు అంటున్నారు.

మరోవైపు సుజనా - లోకేశ్ సంబంధాలు కూడా అంతంతమాత్రంగా ఉండడంతో ఆయనకు అవకాశం ఇవ్వకపోవచ్చనే వినిపిస్తోంది.  ఇటీవల సుజనాకు కోర్టు సమన్లు వచ్చినప్పుడు ఆయన తనకే కాదు.. ప్రధానికీ సమన్లు వస్తాయంటూ చేసిన వ్యాఖ్య బిజెపి నేతలకు ఆగ్రహం తెప్పించింది. సుజనా చౌదరి తనకు తాను ఎక్కువగా ఊహించుకుంటున్నారని, ఆయన తన స్థాయిని ప్రధానితో పోల్చుకోవడం చౌదరి అతి తెలివి, అహంకారానికి నిదర్శనమని బిజెపి సీనియర్లు మండిపడుతున్నారు. ఆయనకు బదులుగా కేంద్ర మంత్రివర్గంలోకి వేరే వారి పేరు సూచించాలని చంద్రబాబును బీజేపీ అధిష్ఠానం కోరనున్నట్లు తెలుస్తోంది. సుజనా చౌదరి కంపెనీకి చెందిన ఆర్ధిక లావాదేవీల వివరాలను ఈపాటికే బిజెపికి చెందిన కొందరు ప్రముఖులు, ప్రధాని కార్యాలయానికి పంపినట్లు తెలుస్తోంది. సుజనా చౌదరికి మళ్లీ కేంద్రమంత్రి పదవి ఇస్తే, పార్టీతో పాటు మీ ఇమేజ్ కూడా దెబ్బతింటుందని బిజెపి నేతలు ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. నాకే కాదు, ప్రధానికీ నోటీసులు వస్తుంటాయన్న చౌదరి చేసిన తాజా వ్యాఖ్యల క్లిప్పింగులను పంపినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సుజనా చౌదరికి, తిరిగి పొడిగింపు ఇవ్వడం కష్టమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Tags:    

Similar News