కొత్త మాయ: ఓన్లీ 2 డేస్

Update: 2017-07-25 08:30 GMT
పోలవరానికి నిధులు కేటాయించే విషయంలో కేంద్ర ప్రభుత్వం కొత్త మాయ మాటలు చెప్పి, రాష్ట్రనాయకులను మభ్యపెడుతుంది. రాష్ట్రనాయకులు ఆ డొల్ల మాటలను పట్టుకుని వాటినే ప్రజలకు నివేదించి అక్కడితో తామేదో సాధించేసామని తమవంతు తాముకూడా మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఏతావతా నిర్దిష్టంగా పనులకు నిధులు విడుదల కావడంలో పురోగతి అంటూ ఏమీ కనిపించకపోయినప్పటికీ ఏదో జరిగిపోతున్నట్టుగా అందరినీ భ్రమపెట్టే ప్రయత్నాలు మాత్రం పుష్కలంగా సాగుతున్నాయి. తాజాగా వివరాల్లోకి వస్తే పోలవరం ప్రాజెక్టుకు నిధుల కొరత తలెత్తిందనేది జగమెరిగిన సత్యం. ఒకవైపు పనులు మందగమనంతో నెమ్మదిగా నడుస్తూఉండగా ఫలానా కారణం వలన పనులు నెమ్మదించాయని ఇదమిత్థంగా ప్రభుత్వం తేల్చకుండానే 2018 కల్లా ప్రాజెక్టును పూర్తి చేసేస్తాం అని ప్రగల్భాలు పలుకుతూ ప్రజలను మాయ చేసే ప్రయత్నం చేస్తొంది.

మరోవైపు పార్లమెంటులో సభ్యులు పోలవరానికి నిధులు ప్రస్తావించినప్పుడు ఇప్పటిదాకా ఇచ్చిన నిధులకు సంబంధించి పూర్తి జమా కర్చులు నివేదిస్తే తప్ప కొత్తగా నిధులు విడుదల చేసే అవకాశమే లేదంటూ కేంద్ర ప్రభుత్వం తెగేసి చెప్పేసింది. అయినా ఇప్పటిదాకా తమకు అందిన నిధులకు లెక్కలు ఇవ్వడంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నదో మనకెవ్వరకూ అర్థం కాని సంగతి. ఇదంతా ఒక ఎత్తు కాగా తాజాగా కేంద్రమంత్రి సుజనా చౌదరి - తెలుగుదేశం పార్టీ ఎంపీ మురళీ మోహన్ - బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు ముగ్గురు కలిసి ఢిల్లీలో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయి నిధుల విడుదల గురించి ప్రత్యేకంగా చర్చించారు. బయటకు వచ్చిన తరువాత ఆయన సానుకూలంగా స్పందించారంటూ ఓ మాట చెప్పి వదిలేశారు. కానీ వార్తల లోతుల్లోకి వెళ్తే పోలవరం ప్రాజెక్టుపై సవరించిన అంచనాలు వచ్చే లోగా ‘తాత్కాలిక ప్రాతిపదికన’ మాత్రమే కొంతమేరకు విడుదల చేయడానికి జైట్లీ అంగీకరించినట్టుగా తెలుస్తుంది.

సవరించిన అంచనాలను కేంద్రం తప్పుబడితే గనక అందులో నియమాలను అతిక్రమించి అంచనాలు సవరించారంటూ వేలెత్తి చూపితే గనక నిధుల విడుదల విషయం అంతా డోలాయమానంలో పడుతుందో అనే భయం కూడా చాలామందిలో వుంది. అప్పటికీ అరుణ్ జైట్లీ ఏకపక్షంగా తాము డబ్బులివ్వబోతున్నామనే సంగతి తేల్చి చెప్పలేదు. ఒకటి రెండు రోజుల్లో కేంద్ర శాఖ అధికారులు రాష్ట్రంనుంచి వచ్చిన ప్రతిపాదనను పరిశీలించి తుది నిర్ణయం తిసుకుంటారని మాత్రమే చెప్పారు. ఆ తుది నిర్ణయం నిధుల విడుదలకు ప్రతికూలంగా... సవరించిన అంచనాలు వచ్చేవరకూ ఎమీ తేల్చలేం అనే విధంగా ఉన్నా కూడా ఎలాంటి ఆశ్చర్యం లేదు.

అటు భాజపా ఇటు తెలుగుదేశం నాయకులు ఇరుపక్షాలూ కలిసి ఈ మాయమాటలనే క్యారీ ఫార్వార్డ్ గా పైనుంచి కిందికి తీసుకెళ్తూ ప్రజల్నందరినీ బురిడీ కొట్టించడానికి ప్రయత్నంచేస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఎలాగంటే తాము ఢిల్లీలో ఉన్నాం కనుక రాష్ట్రానికి ఏదో చేసేస్తునట్టుగా ఒక బిల్డప్ ఇవ్వడానికి ముగ్గురు నలుగురు ఎంపీలు కలిసి ఒక కేంద్ర మంత్రి దగ్గరకు వెళ్లి ఏదో విన్నపాలు చేసినట్టుగా బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం... సదరు కేంద్రమంత్రిగారు తమ రాష్ట్రానికి ఏదో చేసేస్తామని హామీ ఇచ్చినట్టుగా వీరు వెల్లడించడం... ఆ హామీను చూసి ప్రజలు మురిసిపోవడం మాత్రమే ఇప్పటిదాకా జరుగుతోంది. ఎంపీలు వెళ్లి కేంద్ర మంత్రిని కలిసిన ఏ సందర్భంలో కూడా సదరు కేంద్ర మంత్రి నేరుగా ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఫలానా చేయబోతున్నాం అంటూ స్వయంగా వెల్లడించిన దాఖలా ఒక్కటి కూడా లేదు. అలాంటప్పుడు మీరు చెప్పే మాయమాటలు ఏమాత్రం నమ్మశక్యంగా, ఆచరణసాధ్యంగా ఉండడం లేదనేది ప్రజలు గుర్తిస్తున్నారు. నిరంతరాయంగా ఇలాంటి మాయమాటలే చెబుతూపోతే గనుక ముందుముందు ఈ తెలుగుదేశం ఎంపీలు ప్రజల్లో చులకన అయిపోతారనే వాస్తవాన్ని వారు తెలుసుకోవాల్సివుంటుంది.
Tags:    

Similar News