బాబు బీజేపీలోకి వస్తానంటే..సుజనా మాట్లాడేస్తారట!

Update: 2019-10-17 10:22 GMT
ఇటీవలే టీడీపీ నుంచి బీజేపీలోకి జంప్ కొట్టిన రాజ్యసభ సభ్యుడు యలమంచిలి సుజనా చౌదరి (వై సుజనా చౌదరి) నోట వెంట తాజాగా వచ్చిన కామెంట్లు నిజంగానే సంచలనాలకే సంచలనమని చెప్పక తప్పదు. ఈ వ్యాఖ్యలు ఒక్క తెలుగు నేల రాజకీయాల్లోనే కాకుండా యావత్తు దేశ రాజకీయాల్లోనే సంచలనంగా పరిగణించక కూడా తప్పదన్న వాదన వినిపిస్తోంది. అయినా అంతగా సంచలనంగా ఉన్న ఆ కామెంట్లలో సుజనా ఏమన్నారన్న విషయానికి వస్తే... టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు బీజేపీలోకి వస్తానంటే... తాను బీజేపీ అధిష్ఠానంతో మాట్లాడి వ్యవహారాన్ని చక్కబెట్టేస్తానని సుజనా నిజంగానే సంచలనాలకే సంచలనమైన మాట అనేశారు. ఏంటేంటీ?... బీజేపీలోకి వస్తానని చంద్రబాబు అడగడమా? అలా అడిగితే...బీజేపీ అధిష్ఠానంతో సుజనా మాట్లాడి చంద్రబాబును బీజేపీలో చేర్చుకునేలా చేయడమా? వినడానికి కాస్తంత విడ్డూరంగానే ఉన్నా... చంద్రబాబు ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఈ పరిణామం జరిగినా ఆశ్చర్యపోనక్కరలేదన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

సుజనా చౌదరి ముందుగా వ్యాపారవేత్త. ఆ తర్వాతే ఆయన రాజకీయ నాయకుడు. రాజకీయ ఓనమాలు కూడా ఆయన చంద్రబాబు వద్దే దిద్దుకున్నారని కూడా చెప్పాలి. అంతేనా... సుజనాకు రాజకీయ గురువు ఎవరు ఔనన్నా కాదన్నా చంద్రబాబే. ఈ మాటలో ఇంకెవరూ వేలు పెట్టడానికి కూడా లేదు. సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ గా ఉన్న సుజనా... ఆది నుంచి టీడీపీ అనుకూలంగా - ప్రత్యేకించి చంద్రబాబు కోటరీలో ముఖ్యుడిగా కొనసాగుతున్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. సూజనా చౌదరి సహా సీఎం రమేశ్ - నారాయణ తదితరులే టీడీపీ సంబంధించిన జమా ఖర్చులను చూసుకున్న పరిస్థితినీ మనం మరువలేం. అలాంటి బలమైన బంధాన్ని తెంచేసుకున్న సుజనా... మొన్నటి ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైన వెంటనే చంద్రబాబుకు హ్యాండిచ్చేసి బీజేపీలోకి చేరిపోయారు. ఇలా తానొక్కడే కాకుండా తన వెంట మరో ముగ్గురు టీడీపీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేశ్ - గరికపాటి మోహన్ రావు, టీజీ వెంకటేశ్ లను కూడా సుజనా బీజేపీలోకి తీసుకెళ్లిపోయారు.

సుజనా పార్టీ మార్పే సంచలనం అనుకుంటే... ఇప్పుడు ఆయన నోటి వెంట చంద్రబాబు పార్టీ మార్పు గురించి కామెంట్ రావడం నిజంగానే పెను సంచలనమేనని చెప్పక తప్పదు. చంద్రబాబు గనుక బీజేపీలోకి చేరతానని వస్తే... తాను బీజేపీ అధిష్ఠానంతో మాట్లాడి చంద్రబాబుకు రెడ్ కార్పెట్ వెల్ కమ్ దక్కేలా చేస్తానని సుజనా చెప్పడం చూస్తుంటే... నిజంగానే అలా జరుగుతుందా? అన్న దిశగా ఆసక్తికర విశ్లేషణలు మొదలయ్యాయి. చంద్రబాబు టీడీపీకి జాతీయ అధ్యక్షుడిగా ఉన్న నేత. అలాంటిది చంద్రబాబు టీడీపీ నుంచి బీజేపీలోకి చేరిపోయారంటే... టీడీపీని మూసివేసినట్టేనని కూడా చెప్పక తప్పదు. మరి ఇంతటి కీలక పరిణామాలకు కారణమైన చంద్రబాబు పార్టీ మార్పుపై సుజనా అంత ఈజీగా ఎలా కామెంట్ చేశారన్నదే ఇప్పుడు అసలు సిసలు ప్రశ్నగా మారింది. చంద్రబాబు పార్టీ మారతారో? లేదో? తెలియదు గానీ... ఇప్పుడు సుజనా చేసిన కామెంట్లు మాత్రం వైరల్ గా మారిపోయాయి.



Tags:    

Similar News