బీజేపీ నేత‌లే బిత్త‌ర‌పోయేలా సుజ‌నా హోదా మాట‌లు!

Update: 2019-07-15 04:24 GMT
ఏ ఎండ‌కు ఆ గొడుగు ప‌ట్ట‌టంలో తెలుగుదేశం పార్టీ నేత‌ల‌కు ఉండే ప్ర‌తిభ ఎంత‌న్న విష‌యం మ‌రోసారి నిరూపిత‌మైంది. హోదా కోసం అదే ప‌నిగా ప్ల‌కార్డులు ప‌ట్టుకొని.. అవ‌కాశం వ‌చ్చిన ప్ర‌తిసారీ గొంతు స‌వ‌రించుకొనే చంద్ర‌బాబుకు ఒక‌ప్ప‌టి జిగిరీ దోస్తో సుజ‌నా చౌద‌రి తాజా మాట‌లు విన్నంత‌నే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే.

హోదా సాధ‌నే త‌మ ల‌క్ష్యంగా గొప్ప‌లు చెప్పుకున్న సుజ‌నా.. తాను మారిన పార్టీకి త‌గ్గ‌ట్లే ఇప్పుడు ఆయ‌న బాడీ లాంగ్వేజ్ మాత్ర‌మే కాదు.. మాట‌లు కూడా పూర్తిగా మారిపోయాయి. ప్ర‌త్యేక హోదా మీద ఏపీ ప్ర‌జ‌ల‌కు ఉన్న ఆశ‌ల్ని నిలువునా పాతేసేలా ఆయ‌న మాట్లాడారు.

బ‌ల్ల‌గుద్ది చెబుతున్నా.. ఏపీకి మోడీ స‌ర్కారు పూర్తిగా న్యాయం చేసింది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో చంద్ర‌బాబు లేక జ‌గ‌న్ లో ఎవ‌రో ఒక‌రు ప్ర‌ధాన‌మంత్రి సీట్లో కూర్చున్నా.. రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా తీసుకురావ‌టం సాధ్యం కాద‌న్న ఆయ‌న.. హోదా ఆశ‌ల్ని స‌మాధి చేసేలా వ్యాఖ్య‌లు చేశారు. మోడీ ఎలా మాట్లాడ‌తారో అచ్చు గుద్దిన‌ట్లుగా మాట్లాడిన సుజ‌నాను చూస్తే.. ఏపీ బీజేపీ నేతలు సైతం బిత్త‌ర‌పోయేలా ఉన్నాయ‌ని చెప్పాలి.

మొన్న‌టివ‌ర‌కూ ఏపీ హోదా గురించి అదే ప‌నిగా గ‌ళం విప్పే సుజ‌నా.. తాజాగా ఏపీ బీజేపీ నేత‌ల‌కు మించిన‌ట్లుగా మాట్లాడిన తీరు చూస్తే అవాక్కు అవ్వాల్సిందే. ఇప్పుడున్న నిబంధ‌న‌ల ప్ర‌కారం రాష్ట్రానికి హోదా ఇవ్వ‌లేమ‌ని.. భ‌విష్య‌త్తులో కూడా సాధ్యం కాద‌ని చెప్పిన తీరు చూస్తే.. మోదా క‌ల‌ల్ని క‌రిగించేయ‌ట‌మే సుజ‌నా ల‌క్ష్య‌మ‌న్న‌ట్లు ఉంది. అంతేకాదు.. బుద్ధిగా కేంద్రం ఇచ్చిన ప్యాకేజీ తీసుకుంటే ఏపీ అభివృద్ధి సాగుతుంద‌న్న మాట చెప్పేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ప్ర‌ధాని మోడీని త‌మ్ముడు సుజ‌నా ఎలాంటి పొగిడేశారంటే.. బీజేపీ నేత‌ల్లో చాలామందికి సైతం చేత‌కాద‌ని చెప్పాలి.

స్వ‌తంత్ర భార‌తావ‌నిలో ఏ కేంద్ర ప్ర‌భుత్వం ఇవ్వ‌నంత సాయం మోడీ ప్ర‌భుత్వం ఏపీకి ఇచ్చింద‌ని చెప్పిన సుజ‌నా మాట‌లు చూస్తే.. త‌న‌ను న‌మ్మి పార్టీలో చేర్చుకున్నందుకు ప‌ర్ ఫెక్ట్ న్యాయం చేశార‌న్న అభిప్రాయం క‌లుగ‌క‌మాన‌దు. రాజ్యాంగం ప్ర‌కార‌మే తాను బీజేపీలో చేరిన‌ట్లుగా స్ప‌ష్టం చేసిన సుజ‌నా మాట‌లు విన్న ఆంధ్రోళ్లంతా.. ఎంత పార్టీ మారితే మాత్రం.. మ‌రింత అంత‌లా మాట‌లు మారిపోతాయా? అంటూ బుగ్గ‌లు నొక్కుకునే ప‌రిస్థితి.  
Tags:    

Similar News