అబ్బో సుజనా కొడుక్కి దూకుడు ఎక్కువే

Update: 2016-04-16 06:02 GMT
పుత్రరత్నాలు చేసే పనులు నేతలకు శిరోభారంగా మారటం ఈ మధ్యన మామూలైంది. అయితే.. ఇలాంటి భాగోతాలన్నీ ఏపీ అధికారపక్షానికి చెందిన వారివి ఎక్కువగా ఉండటం గమనార్హం. ఆ మధ్య మంత్రి గంటా కుమారుడు విశాఖలో హడావుడి చేయటం విమర్శల పాలు చేస్తే.. ఈ మధ్యనే ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబు తనయుడి భాగోతం ఎంత సంచలనంగా మారిందో తెలిసిందే. ఇదే తరహాలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు కొడుకు దూకుడు వార్తల్లోకి వచ్చింది.

తాజాగా వీరికి కొనసాగింపుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు.. కేంద్రమంత్రి సుజనా చౌదరి కొడుకు వ్యవహారం తాజాగా పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. శుక్రవారం అర్థరాత్రి బంజారాహిల్స్ లో కారును వేగంగా నడిపిన ఉదంతంలో కేసు నమోదు చేశారు. అర్థరాత్రి వేళ.. సంపన్నులు.. పెద్దోళ్ల పిల్లలు నగర రోడ్ల మీద సరదాగా కారు రేసులు పెట్టుకోవటం.. అమాయకుల్ని బాధితులుగా చేయటం.. రోడ్ల మీద తిరిగే వారిని భయభ్రాంతులుగా చేయటం మామూలే. తాజాగా అలాంటి పనినే సుజనా పుత్ర రత్నం చేసినట్లు చెబుతున్నారు.

తండ్రికున్న పవర్ తలెక్కిందేమో కానీ  సుజనా కుమారుడు సాయి కార్తీక్ శుక్రవారం రాత్రి బంజారాహిల్స్ రోడ్ల మీద రయ్యిరయ్యి మంటూ దూసుకెళ్లారు.ఈ రేస్ గురించి సమాచారం అందుకున్న పోలీసులు మెరుపు దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా సుజనా కుమారుడి కారుతో పాటు మరో నాలుగు కార్లను అదుపులోకి తీసుకొన్నట్లు చెబుతున్నారు. కార్లతో పాటు కార్లలోని నలుగురు యువకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. సుజనా కుమారుడు నడిపినట్లుగా చెబుతున్న కారు ఏపీ09 సీవీ9699 జర్మన్ స్పోర్ట్స్ కారుగా తెలుస్తోంది. వీరికి ఈ ఉదయం కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు చెబుతున్నారు.    

మరో కథనం ప్రకారం.. సుజనా కొడుకు వాహనాన్ని పోలీసులు అదుపులోకి తీసుకొని..కేసు నమోదు చేసిన పోలీసులు ఆయన కొడుకును విడిచిపెట్టినట్లుగా చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది. ఏది ఏమైనా.. పుత్రరత్నాల్ని అదుపులో పెట్టుకోవాలన్న విషయాన్ని తమ్ముళ్లకు చంద్రబాబు సలహా చెప్పాల్సిన అవసరం ఉందన్న విషయం తాజా ఉదంతం మరోసారి స్పష్టం చేసినట్లైంది.
Tags:    

Similar News