40ల‌క్ష‌ల‌తో సుకుమార్ ఆక్సిజ‌న్ ప్లాంట్.. ప్ర‌భుత్వాలే చేయ‌లేవ‌న్న మాజీ ఎంపీ

Update: 2021-05-27 06:42 GMT
ఈ క‌రోనా క‌ష్టకాలంలో ప్ర‌జ‌ల్ని ఆదుకునేందుకు సెల‌బ్రిటీలంతా ముందుకు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో ఆక్సిజ‌న్ బ్యాంకుల్ని ఏర్పాటు చేస్తున్నారు. పాప్ స్టార్ స్మిత ఇరు రాష్ట్రాల్లో ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా సాయానికి బృహ‌త్త‌ర ప్ర‌ణాళిక‌తో ముందుకొచ్చారు. ర‌కుల్ ప్రీత్ సింగ్.. నిధి అగ‌ర్వాల్ స‌హా ప‌లువురు స్టార్లు క‌ష్టంలో ఉన్న రోగుల్ని ఆదుకునేందుకు నిధి సేక‌ర‌ణ కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు.

టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ త‌న వంతు సాయంగా ఆక్సిజ‌న్ ప్లాంట్ ని నిర్మించి ఒక ప్రాంత ప్ర‌జ‌ల‌ను ఆదుకునే ప్ర‌య‌త్నం చేయ‌డంపై స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది. ఆయ‌న ప్రాణాలు కాపాడిన దేవుడు అంటూ మాజీ ఎంపీ హ‌ర్ష‌కుమార్ ప్ర‌శంస‌లు కురిపించారు.

సినీద‌ర్శ‌కుడు సుకుమార్ క‌రోనా క‌ష్ట‌కాలంలో చేసిన సాయం మ‌రువ‌లేనిదని ప్ర‌శంసించారు మాజీ ఎంపీ హ‌ర్ష‌కుమార్. ఆయ‌న మాట్లాడుతూ.. కోన‌సీమ క‌రోనా రోగుల‌కు అవ‌స‌ర‌మైన ఆక్సిజ‌న్ ని ఆయ‌న అందిస్తున్నారు. 40ల‌క్ష‌లు పెట్టి ఆక్సిజ‌న్ ప్లాంట్ ప్రారంభించారు. ప్ర‌క‌టించిన కొద్ది రోజుల్లోనే ఆయ‌న ప్లాంట్ ఏర్పాటు చేసి ఎంద‌రో రోగుల ప్రాణాల్ని కాపాడారు. రాజోలు లాంటి మారుమూల ప్రాంతంలో ఆక్సిజ‌న్ అందుబాటులో కి రావ‌డం క‌ష్టమైన ప‌ని. ప్ర‌భుత్వాలు కూడా చేయ‌లేని సాయం సుకుమార్ చేశారు. రాజోలు ప్రాంతంపై అత‌డికి ఉన్న ప్రేమాభిమానాలు అలాంటివి. కోన‌సీమ ప్రాంత ప్ర‌జ‌ల త‌ర‌పున కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసుకుంటున్నాను.. అని హ‌ర్ష‌కుమార్ అన్నారు.
Tags:    

Similar News