ఉత్తరాన జయప్రద.. దక్షిణాన సుమలత

Update: 2019-04-04 07:27 GMT
ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో అలనాటి తెలుగు తారలు దక్షిణాన ఒకరు.. ఉత్తరాన మరొకరు లోక్‌ సభ బరిలో దిగారు. ఇందులో భాగంగా ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఒకరు జయప్రద కాగా.. మరొకరు సుమలత. తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఇంతటి క్రేజ్‌ సంపాదించిన నటీమణులు రాజకీయ జీవితంలో అడుగు పెట్టిన వారు లేరు. తెలుగు తారలు ఎవరూ కూడా రాజకీయంగా ఇంతటి అనుభవం - అభిమానులను సంపాదించలేదని చెప్పవచ్చు. ఈ ఇద్దరి రాజకీయ జీవితంపై యావత్‌ భారత్‌ దృష్టి మళ్లింది.

 వీరిద్దరి జీవిత చరిత్రలు చూస్తే చాలా వాటిలో ఒకే పోలికలు ఉంటాయి. సుమలత - జయప్రద చిత్ర పరిశ్రమలోకి 1979లోనే అడుగు పెట్టారు. ఒకరు కేవలం రూ.10ల పారితోషికంతో సినీజీవితం ఆరంభించారు. మరొకరు రూ.1,001 పారితోషికం తీసుకుని తొలి సినిమాలో నటించారు. ఇద్దరు తారలు బహుభాషా నటులు కావడం విశేషం. ఇద్దరి వయసు ప్రస్తుతం 55 ఏళ్లు దాటిపోయింది. ఒకరు ఉత్తర భారత్‌ నుంచి.. మరొకరు దక్షిణ భారత్‌ నుంచి పోటీ చేస్తున్నారు. జయప్రద ఉత్తరప్రదేశ్‌లోని రాంపుర నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున లోక్‌సభ బరిలో ఉన్నారు. సుమలత కర్ణాటకలోని మండ్య పార్లమెంటు నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

జయప్రద గురించి..

జయప్రద ఏపీలోని రాజమండ్రిలో 1962 ఏప్రిల్‌ 3వ తేదీన జన్మించారు. తల్లిదండ్రులు కృష్ణారావు - నీలవేణి. జయప్రద అసలు పేరు లలితారాణి. చిన్న వయసు నుంచి నృత్యం, సంగీతంపై దృష్టి మరిల్చింది. ఫలితంగా 13 ఏళ్లకే సినిమాలో డ్యాన్స్‌ అవకాశం వచ్చింది. ఈక్రమంలో జయప్రద తొలి జీతం రూ.10 మాత్రమే. అప్పటి ప్రముఖ సినీ దర్శకుడు కె.బాలచందర్‌ జయప్రదను సినీరంగంలోకి తీసుకెళ్లారు. ఎన్నో అవకాశాలు కల్పించారు. అనంతరం తమిళం - మలయాళం - హిందీ - కన్నడ - మరాఠి - బెంగాలి చిత్రాల్లో నటించే అవకాశం వచ్చింది. అలనాటి తెలుగు తార జయప్రద 1994లో తెలుగుదేశం పార్టీలో చేరారు. అనంతరం సమాజ్‌వాది పార్టీలో చేరి రెండుసార్లు లోక్‌ సభకు ఎన్నికయ్యారు. అయితే తర్వాత జరిగిన కొన్ని పరిణామాల రీత్యా ఆమె భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ క్రమంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో యూపీలోని రాంపూర్‌ నుంచి పోటీ చేస్తున్నారు.

సుమలత గురించి..

కర్ణాటకలోని మండ్య లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో దిగిన నటి సుమలత 1963 ఆగస్టు 27న ఏపీలో జన్మించారు. 1979లో మిస్‌ ఆంధ్ర పోటీలో పాల్గొని విజేతగా నిలిచారు. పదిహేనేళ్ల వయసుకే సుమలత ఫొటోలు దినపత్రిక -వార పత్రిక - మాసపత్రికల్లో ప్రచురించారు. మిస్‌ ఆంధ్ర కావడంతో విపరీతమైన క్రేజ్‌ వచ్చింది. ఈక్రమంలో ప్రముఖ నిర్మాత రామానాయుడు గమనించి పలు సినిమాల్లో ఆఫర్లు ఇచ్చారు. ఫలితంగా ఆమె నటించిన తొలి సినిమాకు రూ.1,001 పారితోషికం తీసుకున్నారు.

తర్వాత కన్నడ - హిందీ - మలయాళం చిత్రాల్లో అవకాశం వచ్చింది. మొత్తం 220 సినిమాల్లో సుమలత నటించారు. ఈ క్రమంలో కన్నడ రెబల్‌ స్టార్‌ అంబరీశ్‌ ను వివాహం చేసుకున్నారు. ఇటీవల ఆయన కన్నుమూశారు. ఆయన గతంలో మండ్య నుంచి కాంగ్రెస్‌ తరఫున మూడుసార్లు ఎంపీగా గెలిచారు. అనంతరం కేంద్రమంత్రిగా.. రాష్ట్ర మంత్రిగా పని చేశారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్‌ – జేడీఎస్‌ కూటమిలో భాగంగా మండ్య సీటు జేడీఎస్‌ కు ఇవ్వడంతో సుమలతకు చుక్కెదురైంది. ఫలితంగా ఆమె స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో దిగారు. బీజేపీ మద్దతు తెలిపింది.



Tags:    

Similar News