అయిదెకరాల్లో మసీదు కడతాం.. దానికి బాబ్రీ పేరు పెట్టుకుంటాం

Update: 2019-11-09 14:46 GMT
అయోధ్య కేసులో సుప్రీం ఇచ్చిన తీర్పు దేశంలో అన్ని ప్రధాన ముస్లిం వర్గాలు స్వాగతించాయి. తీర్పు రాగానే అసంత‌ృప్తి వ్యక్తంచేసిన సున్నీ వక్ఫ్ బోర్డు కూడా సాయత్రమయ్యేసరికి సానుకూల ప్రకటన చేసింది. తొలుత తాము చెప్పినట్లు సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయబోమని ప్రకటించింది. తమకు ఇస్తామన్న 5 ఎకరాల భూమిలో మసీదు నిర్మించి దానికే బాబ్రీ అని పేరు పెడతామని ప్రకటించింది.

సుప్రీంకోర్టు తీర్పును తాము స్వాగతిస్తున్నామని, వినయంగా అంగీకరిస్తున్నామని ఉత్తర ప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు ఛైర్మన్ జాఫర్ ఫరూఖీ ప్రకటించారు. ‘‘అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వును సమీక్షించడానికి రివ్యూ పిటిషన్ కానీ, క్యురేటివ్ పిటిషన్ కానీ దాఖలు చేయడానికి యూపీ సున్నీ వక్ఫ్ బోర్డు వెళ్లదని స్పష్టం చేస్తున్నాను’’ అని ఆయన చెప్పారు.

మరోవైను అయోధ్య కేసుపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని దిల్లీకి చెందిన జామా మసీదు షాహి ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీ తెలిపారు. దేశం అభివృద్ధి దిశగా సాగుతుందని ఆశిస్తున్నామని, ఈ విషయంలో రివ్యూ పిటిషన్ దాఖలు చేయడాన్ని అంగీకరించమని ఆయన కూడా స్పష్టం చేశారు.

తీర్పు వెలువడిన అనంతరం దిల్లీలో సున్నీ వక్ఫ్ బోర్డు పెద్దలు సమావేశం కాగా సుప్రీంకోర్టులో వారితరఫున కేసును వాదించిన జఫర్యాబ్ జిలానీ సహా పలువురు నాయకులు దీనికి హాజరయ్యారు. తీర్పు వెలువడిన తరువాతి పరిస్థితులపై అధ్యయనం చేశారు. దేశవ్యాప్తంగా ముస్లిం సంఘాల నుంచి గానీ, ప్రతినిధుల నుంచి గానీ ఎలాంటి వ్యతిరేక ప్రకటనలు రాకపోవడం... ప్రఖ్యాత అజ్మీర్ దర్గా ప్రధాన మౌల్వీ, దిల్లీ జామియా మసీదు షాహి ఇమామ్ సైతం తీర్పును అంగీకరిస్తామని ప్రకటించడం.. ముస్లిం పర్సనల్ లా బోర్డు సైతం పెద్దగా వ్యతిరేకతను వ్యక్తం చేయకపోవడం... దేశంలోని ముస్లిం మేధావులు కానీ, అసదుద్దీన్ మినహా మిగతా ముస్లిం నేతలు కానీ.. బీజేపీ వ్యతిరేక పార్టీలు కానీ తీర్పుకు వ్యతిరేకంగా మాట్లాడకపోవడంతో వారు కూడా మనసు మార్చుకుని ప్రభుత్వ సహకారంతో మసీదు నిర్మించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News