శ‌బ‌రిమ‌ల‌లో మ‌హిళ‌ల‌కు ప్ర‌వేశం:సుప్రీం

Update: 2018-09-28 06:33 GMT
గ‌త కొద్ది రోజులుగా దేశంలోని అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీం కోర్టు ప‌లు కీల‌క‌మైన తీర్పుల‌ను వెలువ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఎల్జీబీటీల‌కు అనుకూలంగా సెక్ష‌న్ 377 ర‌ద్దు - `ఆధార్`కు రాజ్యాంగ‌బ‌ద్ధ‌త, `అయోధ్య‌`కేసుకు సంబంధించిన మ‌రో పిటిష‌న్ కొట్టివేత‌ - సెక్ష‌న్ 497 ర‌ద్దు వంటి సంచ‌ల‌న తీర్పుల‌ను సుప్రీం వెలువ‌రించింది. ఇదే క్ర‌మంలో నేడు తాజాగా సుప్రీం....మ‌రో చ‌రిత్రాత్మ‌క‌ తీర్పునిచ్చింది. కేర‌ళ‌లోని ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రం శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పును నేడు వెలువ‌రించింది. మహిళలను దేవతలుగా పూజిస్తోన్న భార‌త దేశంలో, ఆల‌యాల్లో మ‌హిళ‌ల‌కు నిషేధం విధించడం సరికాదని సుప్రీం చీఫ్ జ‌స్టిస్ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. మహిళలు స‌మాన‌త్వ‌పు హ‌క్కును ఆ నిబంధ‌న ఉల్లంఘించేలా ఉంద‌ని సుప్రీం అభిప్రాయ‌ప‌డింది. మ‌హిళ‌లు.. పురుషుల‌తో స‌మాన‌ని, ఎందులోనూ తక్కువ కాదని వ్యాఖ్యానించింది. ప్రాథమిక జీవన విధానంలో మ‌తం కూడా ఒక భాగమని పేర్కొంది.

కేర‌ళ‌లోని శ‌బ‌రిమ‌ల ఆల‌యంలోకి మహిళల ప్ర‌వేశంపై ఉన్న‌ నిషేధాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంలో పలు పిటిష‌న్లు దాఖ‌లైన సంగ‌తి తెలిసిందే. వాటిపై విచారణ జరిపిన సుప్రీం..శుక్రవారం నాడు సంచ‌ల‌న తీర్పునిచ్చింది. శ‌బ‌రిమ‌లలో అయ్యప్ప ద‌ర్శ‌నానికి అన్ని వ‌యసులకూ హ‌క్కుంద‌ని సుప్రీం అభిప్రాయ‌ప‌డింది. మహిళా భ‌క్తుల‌కు అయ్యప్పను దూరం చేయడం స‌రికాద‌ని సుప్రీం చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా - జస్టిస్ ఇందూ మల్హోత్రా అభిప్రాయపడ్డారు. కేవ‌లం రుతుస్రావం అనే కార‌ణంతో దేవుడికి మ‌హిళ‌ల‌ను దూరంగా ఉంచ‌డం రాజ్యాంగ విరుద్ధమని వారు అభిప్రాయ‌ప‌డ్డారు. భారత రాజ్యాంగం ప్ర‌కారం స్త్రీ- పురుషులిద్ద‌రికీ సమాన హక్కులున్నాయని గుర్తు చేశారు. మ‌రోవైపు, మిగ‌తా భక్తుల మనోభావాలు, ఆల‌యాల క‌ట్టుబాట్ల‌ కోణం నుంచి కూడా కేసును పరిశీలించామని వారు తెలిపారు. కానీ, భగవంతుడు ఎక్కడున్నా ఒకటే అని భావిస్తున్న‌పుడు, మిగ‌తా అయ్యప్ప ఆలయాల్లో మహిళల ప్రవేశంపై లేని ఆంక్షలు, శబరిమలలో ఉండరాదని సుప్రీం పేర్కొంది.


Tags:    

Similar News