పరీక్షల నిర్వహణ: ఏపీ, కేరళ ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం

Update: 2021-06-22 16:30 GMT
కరోనా కల్లోలం వేళ పరీక్షల నిర్వహణను అనేక రాష్ట్రాలు వాయిదా వేశాయి. కానీ ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాలు మాత్రం పరీక్షల నిర్వహణకే మొగ్గుచూపాయి. విద్యార్థుల ప్రాణాలకు ముప్పు ఉందని తల్లిదండ్రులు ఆందోళన చేసినా వెనక్కి తగ్గలేదు. అయితే తాజాగా సుప్రీంకోర్టు పరీక్షల నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పరీక్షలను రద్దు చేయని ఆంధ్రప్రదేశ్ సహా నాలుగు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు గురువారం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. రద్దు చేసిన సీబీఎస్ఈ పరీక్షల మార్కుల కేటాయింపు వివాదానికి ఆమోదం తెలిపే సందర్భంలో సుప్రీంకోర్టులో ఈ విషయం చర్చకు వచ్చింది.

ఆంధ్రప్రదేశ్, కేరళ ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు మండిపడింది. ఏపీలో పరీక్షల నిర్వహణపై అఫిడవిట్ వేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇన్ని రోజులైనా అఫిడవిట్ ఎందుకు వేయలేదని ప్రభుత్వ న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. ఏపీ నుంచి స్పష్టత లేదని అసహనం వ్యక్తం చేసింది.

ఒక్క విద్యార్థి ప్రాణం పోయినా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. పరీక్షల నిర్వహణపై అన్ని రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నా ఏపీ ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించిన న్యాయస్థానం.. ఏపీని ఎందుకు మినహాయించాలో చెప్పాలని నిలదీసింది.  12వ తరగతి పరీక్షలు నిర్వహిస్తారా? లేదా స్పష్టంగా చెప్పాలని ఏపీని ఆదేశించింది. 11వ తరగతి పరీక్షలు సెప్టెంబరులో నిర్వహిస్తామని కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.

28 రాష్ట్రాలకు గాను 18 రాష్ట్ర బోర్డులు ఇప్పటికే 12వ తరగతి పరీక్షలను రద్దు చేశాయని.. మిగిలిన ఆరు.. కరోనా రెండో ఉధృతి రాకముందే పరీక్షలు నిర్వహించాయని పిటీషనర్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మిగిలిన నాలుగురాష్ట్రాలు పరీక్షలు ఎందుకు రద్దు చేయలేదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

రద్దైన సీబీఎష్ఈ 12వ తరగతి పరీక్షల మూల్యాంకన విధానానికి సుప్రీం ఆమోదం తెలిపింది. 13మంది నిపుణుల కమిటీ తయారు చేసిన మూల్యాంకన కమిటీ నివేదికను సుప్రీంకు సీబీఎస్ఈ గురువారమే సమర్పించింది. సీఐఎస్సీఈ తన మదింపు విధానాన్ని తెలిపింది. ఫలితాలను జులై 31లోగా ప్రకటిస్తామంది.
Tags:    

Similar News