సహజీవనంలో చేసే శృంగారం .. రేప్ గా భావించలేం : సుప్రీం కోర్టు !

Update: 2021-03-02 05:30 GMT
గతంలో యువతీ , యువకులు చూసుకొని నచ్చితే పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించేవారు. కానీ మారిన కాలంలో కొత్త ట్రెండ్ కి అలవాటు పడి పెళ్లికి ముందే సహజీవనం చేస్తున్నారు. తర్వాతే పెళ్లి గురించి ఆలోచిస్తున్నారు. ఆ లోపు మనస్పర్థలు వస్తే విడిపోతున్నారు. రిలేషన్‌ షిప్ బ్రేక్ చేసుకున్న తర్వాత.. కొందరు మహిళలు, తన మాజీ భాగస్వామిపై అత్యాచారం కేసులు పెడుతున్నారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని, నెలల తరబడి తనను రేప్ చేశాడని కోర్టులకి ఎక్కుతున్నారు. ఈ తరహా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

కొన్ని రోజులు సహజీవనం చేసిన తర్వాత పురుషుడిపై స్త్రీలు అత్యాచారం కేసులు పెడుతున్న తరుణంలో, ఓ మహిళ చేసే అంగీకార సహజీవనాన్ని అత్యాచారంగా భావించలేమని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎస్ ఏ బాబ్డే వ్యాఖ్యానించారు. యూపీకి చెందిన వినయ్ ప్రతాప్ సింగ్, ఓ మహిళతో రెండేళ్లు సహజీవనం చేశాడు. కానీ ఆ తర్వాత వీరి బంధం పెటాకులయింది. వినయ్ ప్రతాప్ మరొక మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఐతే తనతో రెండేళ్లు సహజీవనం చేసి, పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి, మోసం చేశాడనని బాధిత మహిళ 2019లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను రెండేళ్ల పాటు అత్యాచారం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు. దానిని సవాల్ చేస్తూ.. కోర్టు మెట్లెక్కాడు వినయ్ ప్రతాప్. చివరకు ఆ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు చేరింది.

తనపై నమోదైన ఎఫ్ ఐ ఆర్ ‌ను కొట్టివేయాలని వినయ్ ప్రతాప్ సింగ్ కోర్టును కోరాడు. ఎందుకంటే సహజీవనం సమయంలో ఆమె అంగీకారంతోనే శృంగారంలో పాల్గొన్నామని చెప్పారు. అంతేకాదు ఆమె కూడా వేరొక వ్యక్తితో కూడా సహజీవనం చేసిందని వినయ్ తరపున సీనియర్ లాయర్ విభా మఖీజా వాదించారు. అతడి వాదనలకు మహిళ తరపు లాయర్ ఆదిత్య కౌంటర్ ఇచ్చారు. ఫిబ్రవరి 2014 నుంచి నిందితుడు తమ క్లయింట్‌తో మోసపూరితమైన బంధాన్ని కొనసాగించాడని సుప్రీం కోర్టుకు నివేదించారు. ఇరువర్గాల వాదనలు విన్న CJI ఎస్ ఏ బాబ్డే కీలక వ్యాఖ్యలు చేశారు. పెళ్లి గురించి తప్పుడు వాగ్ధానాలు ఇవ్వడం మోసమే. మహిళలైనా.. పురుషులైనా... ఎవరూ తప్పుడు వాగ్ధానాలు చేయకూడదు. కానీ ఒక మహిళ, ఒక పురుషుడు సహజీవనంలో ఉన్నప్పుడు, అతడు ఎంత క్రూరంగా ఉన్నా, ఎన్ని తప్పులు చేసినా దాన్ని అత్యాచారంగా పరిగణించలేం అని స్పష్టం చేశారు. అయితే, ఈకేసుకు సంబంధించిన  ఎఫ్ ఐ ఆర్ రద్దు చేయలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. సాక్ష్యాలు సేకరించిన తరువాత ట్రయల్ కోర్టులో అప్పీలు చేసుకోవాలని ధర్మాసనం పేర్కొంది.
Tags:    

Similar News