శశి ఖేల్ ఖతం.. దుకాణం బంద్

Update: 2017-02-14 06:49 GMT
అక్రమ ఆస్తుల కేసులో సుప్రీం కోర్టు తీర్పుతో శశికళకు అన్ని దారులూ మూసుకుపోయినట్లయింది. ఈ కేసులో ఆమెకు నాలుగేళ్ల జైలు శిక్ష పడడంతో పాటు పదేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేని పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను శశికళ కోల్పోయింది. దీంతో ఆమె అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో నిర్వహిస్తున్న శిబిరం మూగవోయింది. ఇంతవరకు నమ్ముకుంటూ వచ్చిన నేత జైలుకు వెళ్లనుండడంతో అటు పన్నీర్ సెల్వం వద్దకు ఏ మొఖం పెట్టుకుని వెళ్లాలన్న భయం వారిలో కనిపిస్తోంది. అలా అని శశికళను అంటి పెట్టుకుని ఉండడం వల్ల ఏమాత్ర ప్రయోజనం లేని పరిస్థితి. దీంతో శశికళ ఖేల్ ఖతం కావడంతో పాటు ఆమె దుకాణం కూడా బంద్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. సాయంత్రానికల్లా శశికళ శిబిరం ఖాళీ అయిపోనుందని సమాచారం.
    
సుప్రీంకోర్టులో ఇద్దరూ న్యాయమూర్తులు ఏకగ్రీవంగా ఈ శిక్షను ఖరారు చేశారు. రెండో న్యాయమూర్తి అమితవరాయ్ కూడా ఆమె దోషేనని ప్రకటించారు. లొంగిపోయేందుకు నాలుగు వారాల సమయం ఇస్తున్నట్టు వెల్లడించారు. తక్షణం లొంగిపోవాలని కోరారు. పదేళ్ల పాటు ఏ విధమైన ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆమె అనర్హురాలని అన్నారు. ట్రయల్ కోర్టు తీర్పును అమలు చేయాలని, హైకోర్టు ఉత్తర్వులు కొట్టివేస్తున్నామని ఆయన స్పష్టంగా చెప్పారు. కాగా, ఈ కేసులో అపీలు చేసుకునేందుకు అవకాశం లేకపోవడంతో, శశికళ జైలుకు వెళ్లక తప్పనిసరి పరిస్థితి నెలకొంది.
    
కాగా అక్రమాస్తుల కేసులో శశికళతో పాటు మిగిలిన నిందితులందరూ ట్రయల్ కోర్టు విధించిన నాలుగేళ్ల శిక్ష, రూ. 100 కోట్ల జరిమానాను చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు న్యాయమూర్తి పినాకి చంద్రఘోష్ తొలుత తన తీర్పులో పేర్కొన్నారు. కేసులో ఏ-1 ముద్దాయిగా ఉన్న జయలలిత మరణించిన విషయాన్ని ప్రస్తావించిన ఆయన, మిగతా శశికళ, ఇళవరసి, సుధాకరన్ లు దోషులని, వీరంతా లొంగిపోయేందుకు నాలుగు వారాల గడువిస్తున్నామని తెలిపారు. నాలుగు వారాల్లోగా పోలీసుల ముందు లొంగిపోవాలని ఆదేశించారు. చంద్రఘోష్ తీర్పు చదవడం పూర్తయిన తరువాత, ద్విసభ్య బెంచ్ లోని మరో న్యాయమూర్తి అమితావ్ రాయ్ కూడా అదే తీర్పు ఇచ్చారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News