ఏపీ సర్కారుకు సుప్రీం షాక్.. నాలుగు వారాలు టైం

Update: 2020-06-03 07:40 GMT
ఏపీ సర్కారు తీసుకున్న నిర్ణయంపై ఇటీవల కాలంలో ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బలు తగులుతున్న సంగతి తెలిసిందే. తాజాగా.. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంలో ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. ప్రభుత్వ కార్యాలయాలకు వేసిన పార్టీ రంగులపై హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీన్ని సవాలు చేస్తూ రాష్ట్ర సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

ఈ రోజు (బుధవారం) పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు.. రంగులను నాలుగు వారాల వ్యవధిలో తొలగించాలని గడువు ఇచ్చింది. ఒకవేళ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాను పోలిన రంగుల్నినాలుగు వారాల్లో తొలగించని పక్షంలో కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది.

ఈ పిటిషన్ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ అంశంపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు చాలా స్పష్టంగా ఉందని పేర్కొంది. అంతేకాదు.. రాష్ట్రప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది. హైకోర్టు తీర్పు తర్వాత ప్రభుత్వ భవనాలకు వేసిన రంగుల్ని తొలగించకుండా రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసిందన్నఅభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

ప్రభుత్వం జారీ చేసిన జీవోను ఒకసారి కొట్టివేసిన తర్వాత.. మరో రంగును జత చేస్తూ మరో జీవోను ఎందుకు తీసుకు వచ్చారని ప్రశ్నించింది. ఈ సందర్భంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబరు 623ను న్యాయస్థానం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంలోని జస్టిస్ లావు నాగేశ్వర్ రావుతో  కూడిన సుప్రీం ధర్మాసనం విచారించింది. మరి.. సుప్రీంకోర్టు చెప్పినట్లు నాలుగు వారాల వ్యవధిలో పంచాయితీ భవనాల రంగుల్ని మారుస్తారా? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పాలి.
Tags:    

Similar News