యోగికి షాక్..జ‌ర్న‌లిస్ట్ అరెస్ట్ పై సుప్రీం ఆక్షింత‌లు!

Update: 2019-06-11 14:30 GMT
విమ‌ర్శ‌ల్ని పాజిటివ్ గా తీసుకునే ధోర‌ణి నేటి పాల‌కుల‌కు అంత‌కంత‌కూ త‌గ్గిపోతోంది. త‌మ‌ను అదే ప‌నిగా పొగ‌డాలే త‌ప్పించి ఏ మాత్రం తిట్టినా భ‌రించ‌లేని ప‌రిస్థితి ఈ మ‌ధ్య‌న ఎక్కువ అవుతోంది. అలాంటిది పాల‌కుల త‌ప్పుల‌కు సంబంధించి ఏదైనా ఆధారం ప్ర‌ద‌ర్శించినా.. మ‌రేమైనా సాక్ష్యాలు చూపించినా అగ్గి మీద గుగ్గిలం కావ‌ట‌మే కాదు.. సోష‌ల్ మీడియాలో అభ్యంత‌ర‌క‌ర పోస్టు పెట్టిన నేరం మీద జైల్లో పెట్టేయ‌టం ఈ మ‌ధ్య‌న అల‌వాటుగా మారింది.

తాజాగా ఢిల్లీకి చెందిన జ‌ర్న‌లిస్టు ప్ర‌శాంత్ క‌నోజియాను పోలీసులు అరెస్ట్ చేసిన జైల్లో పెట్టిన వైనంపై అత్యున్న‌త న్యాయ‌స్థానం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. యూపీ ముఖ్మ‌యంత్రి యోగిపై అభ్యంత‌ర‌క‌ర పోస్టులు షేర్ చేసిన నేరానికి అరెస్ట్ చేయ‌ట‌మే కాదు.. ఏకంగా ప‌ద‌కొండు రోజులు రిమాండ్ లో ఉంచిన వైనంపై సుప్రీం విస్మ‌యాన్ని వ్య‌క్తం చేసింది.

అత‌డేమైనా హ‌త్య చేశాడా? అంటూ ఆగ్ర‌హంగా ప్ర‌శ్నించిన సుప్రీం.. ప్ర‌శాంత్ అరెస్ట్ ను తాము స‌మ‌ర్థించ‌లేమ‌ని పేర్కొంది. త‌న భ‌ర్త‌ను అక్ర‌మ ప‌ద్ద‌తిలో అరెస్ట్ చేశార‌ని.. అదుపులోకి తీసుకునే స‌మ‌యంలో అనుస‌రించాల్సిన విధానాల్ని కూడా వారు పాటించ‌లేద‌న్న ఆమె ఫిర్యాదుపై సుప్రీం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.  త‌న భ‌ర్త‌ను అక్ర‌మ ప‌ద్ద‌తిలో అరెస్ట్ చేసిన తీరునుత‌ప్పు ప‌డుతూ ప్ర‌శాంత్ స‌తీమ‌ణి జ‌గీష అరారా సుప్రీంను ఆశ్ర‌యించారు.

ఆమె పిటిష‌న్ పై విచార‌ణ జ‌రిపిన సుప్రీం తీవ్రంగా రియాక్ట్ అయ్యింది. జ‌ర్న‌లిస్టుల‌పై ప్ర‌భుత్వాలు ఈ విధంగా నిర్బంధం విధించ‌టం స‌రికాద‌ని కోర్టు వ్యాఖ్యానించింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రియోగి ఆదిత్యానాథ్ పై సోష‌ల్ మీడియాలో అభ్యంత‌ర‌క‌ర పోస్టులు చేసిన ఆరోప‌ణ‌పై శ‌నివారం నుంచి ఐదుగురు వ్య‌క్తుల‌ను పోలీసులు అరెస్ట్ చేసిన ఉదంతం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

యోగి త‌న‌తో గ‌త ఏడాది కాలంగా వీడియో కాల్ మాట్లాడుతున్నార‌ని.. రాజ‌కీయ నేత‌గా మారిన స‌న్యాసి త‌న జీవితాంతం త‌న‌తో ఉండేందుకు సిద్ధ‌ప‌డ‌తారా? అంటూ ఓ మ‌హిళ సోష‌ల్ మీడియాలో పెట్టిన వీడియో క్లిప్ ను షేర్ చేసిన అభియోగం మీద అరెస్టులు చేయ‌టం క‌ల‌క‌లం రేపుతోంది. ఈ వీడియో క్లిప్ ను ప్ర‌సారం చేసిన నేష‌న‌ల్ లైవ్ అనే టీవీ ఛాన‌ల్ ఎడిట‌ర్ ను సైతం గంట‌ల వ్య‌వ‌ధిలో అరెస్ట్ చేశారు. జ‌ర్న‌లిస్టు ప్ర‌శాంత్ క‌నోజియా అరెస్టును ఇప్ప‌టికే ప‌లువురు రాజ‌కీయ నేత‌లు తీవ్రంగా త‌ప్పు ప‌డుతున్నారు.


Tags:    

Similar News