జీవో నంబర్‌ 1పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

Update: 2023-04-24 17:00 GMT
రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో రాజకీయ పార్టీల ర్యాలీలు, ధర్నాలు జరపడాన్ని నిషేధిస్తూ జీవో నంబర్‌ 1 ను ఏపీ ప్రభుత్వం జారీ చేసిన సంగతి తెలిసిందే. దీన్ని సవాల్‌ చేస్తూ టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సుప్రీంకోర్టు పిటిషన్‌ దాఖలు చేసిన విషయం విదితమే.

ఈ పిటిషన్‌ పై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన సుప్రీంకోర్టు మరోసారి తాజాగా విచారించింది. విచారణ ముగించిన జీవో నంబర్‌ 1పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జీవో నంబర్‌ 1పై ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనాన్ని ఆశ్రయించాల్సిందిగా పిటిషనర్‌ కు సూచించింది. దీనిపై త్వరగా విచారణ ముగించి తీర్పు ఇవ్వాలని ఏపీ హైకోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కాగా జీవో నెంబర్‌ 1పై జనవరి 24న విచారణ ముగించిన ఏపీ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తీర్పును వాయిదా వేసిందని పిటిషనర్‌ కొల్లు రవీంద్ర తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు. అప్పటి నుంచి తీర్పు పెండింగ్‌ లో ఉందని నివేదించారు. హైకోర్టులో తీర్పు జాప్యం నేపథ్యంలోనే పిటిషనర్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారని వెల్లడించారు.

ఈ పిటిషన్‌ ఏప్రిల్‌ 17న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు ప్రస్తావించగా ఏప్రిల్‌ 24న విచారణ జరుపుతామని సీజేఐ చంద్రచూడ్‌ తెలిపిన సంగతి తెలిసిందే. ఈ మేరకు నేడు విచారణ జరిపిన సుప్రీంకోర్టు జీవో నంబర్‌1పై కీలక ఆదేశాలు జారీ చేసింది.

కాగా, ఏపీలో ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలను, బహిరంగ ప్రదేశాల్లో సభలను నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో 1 నంబర్‌ జారీ చేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఈ జీవోను ప్రతిపక్షాలు హైకోర్టులో సవాల్‌ చేశాయి. దీంతో, జనవరి 24న విచారణ ముగించిన ఏపీ హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. ఇక, హైకోర్టులో తీవ్ర జాప్యం నేపథ్యంలో పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.  

ప్రతిపక్షాల సభలను అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ చీకటి జీవోను జగన్‌ ప్రభుత్వం తెచ్చిందని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. వైసీపీ నేతలకు ఒకలా, తమకు ఒకలా నిబంధనలు అమలు చేస్తున్నారని మండిపడుతున్నారు. రోడ్లపైన వైసీపీ నేతల సభలు, ర్యాలీలకు అనుమతులు ఇస్తున్న పోలీసులు ప్రతిపక్షాల సభలకు, ర్యాలీలకు అనుమతులు ఇవ్వడం లేదని ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

Similar News