క్రిమిన‌ల్ కేసులున్నా.. వారిని త‌ప్పించ‌లేం!!

Update: 2018-09-25 09:37 GMT
క్రిమిన‌ల్ కేసుల్లో విచార‌ణ ఎదుర్కొటున్న చ‌ట్ట‌స‌భ స‌భ్యుల‌కు సుప్రీంకోర్టు చ‌ల్ల‌ని క‌బురు చెప్పింది. అభియోగాలు దాఖ‌లైనంత మాత్రాన వారిపై అన‌ర్హ‌త వేటు వేయ‌లేమ‌ని స్ప‌ష్టం చేసింది. దోషిగా తేలితేనే ప‌ద‌వుల నుంచి త‌ప్పించ‌గ‌ల‌మ‌ని తేల్చిచెప్పింది. ఇక విచార‌ణ ఎదుర్కొటున్న నేత‌లు ఎన్నిక‌ల్లో పోటీ చేసే విష‌యాన్ని పార్ల‌మెంటుకే వ‌దిలేస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. చీఫ్ జ‌స్టిస్ దీప‌క్ మిశ్రా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం మంగ‌ళ‌వారం ఈ మేర‌కు కీల‌క తీర్పు వెలువ‌రించింది.

ప్రస్తుతం ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం.. క్రిమినల్‌ కేసుల్లో దోషిగా తేలితేనే చట్టసభ సభ్యుడిపై అనర్హత వేటు పడుతుంది. అయితే అభియోగాల నమోదు దశ నుంచే ఎన్నికల్లో పోటీ చేయకుండా వారిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ పబ్లిక్‌ ఇంట్రెస్ట్‌ ఫౌండేషన్‌ అనే స్వచ్ఛంద సంస్థతోపాటు బీజేపీ నేత అశ్వనీ కుమార్‌ ఉపాధ్యాయ్‌ లు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం విచార‌ణ నిర్వ‌హించింది. ‘క్రిమినల్‌ కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న చట్టసభ సభ్యులపై అనర్హత వేటు వేసే స్థాయిలో న్యాయస్థానం లేదు. ఈ విషయంలో లక్ష్మణ రేఖ దాటలేం. అయితే నేరస్థులను చట్టసభలకు దూరంగా ఉంచే సమయం వచ్చింది. క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్న నేతలు ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అన్నది పార్లమెంట్‌కే వదిలేస్తున్నాం. దీనిపై పార్లమెంట్‌ ఓ చట్టం తీసుకురావాలి’ అని ధర్మాసనం త‌మ ఉత్త‌ర్వుల్లో పేర్కొంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై క్రిమినల్‌ కేసులు నమోదైతే.. ఆ కేసుల‌కు సంబంధించిన వివరాలను అభ్యర్థులు ఎన్నికల అఫిడవిట్‌ లో తప్పనిసరిగా తెలియజేయాల‌ని సుప్రీంకోర్టు ఆదేశించింది. పార్టీలు కూడా తమ అభ్యర్థుల కేసుల వివరాలను వెబ్‌సైట్లలో పొందుపర్చాలని ఆదేశించింది.

Tags:    

Similar News