మహిళలకి షాక్ ఇచ్చిన సుప్రీం ..ఏ విషయంలో అంటే ?

Update: 2019-12-14 12:01 GMT
శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి అన్ని వయసుల మహిళలు  కూడా ప్రవేశం కల్పిస్తూ గత ఏడాది  సుప్రీం సంచలన తీర్పుని వెలువరించిన విషయం తెలిసిందే. అయితే , ఆ తరువాత సుప్రీం తీర్పుని బట్టి ఆలయ ప్రవేశానికి కొందరు మహిళలు ప్రయత్నాలు చేయగా .. అయ్యప్ప స్వాములు - ఆలయ పూజారులు సుప్రీం తీర్పుని వ్యతిరేకించి ..ఆ అయ్యప్ప దర్శనం కోసం వెళ్లిన వారిని అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా శబరిమల పై రోజుకో వివాదం తెరపైకి వస్తుంది.

అయితే శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశానికి అనుమతి కల్పిస్తూ ఇచ్చిన తీర్పును పున: సమీక్షించాలంటూ కొన్ని పిటిషన్లను ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనానికి నివేదించాలని సుప్రీం కోర్టు గత నెలలో నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే  శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించడానికి భద్రత కల్పించాలంటూ ఇద్దరు మహిళలు దాఖలు చేసిన పిటిషన్‌ ను సుప్రీంకోర్టు కొట్టేసింది.

పోలీస్ బందోబస్తుతో తమను శబరిమలకు సురక్షితంగా పంపేలా కేరళ ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలంటూ వారు ఆ పిటిషన్‌లో  కోరారు. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. ఇది చాలా సున్నితమైన  అంశమని - దీన్ని మరింత వివాదాస్పదం చేయొద్దని - అంతేకాకుండా దీనిపై ఏడుగురు జడ్జిలతో కూడిన బెంచ్‌ అంతిమ నిర్ణయం వెలువరించేవరకు తాము ఎలాంటి ఆదేశాలు జారీచేయలేమని చీఫ్ జస్టిస్ ఎస్.ఎ. బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇక మహిళలకు భద్రత కల్పించాలంటూ కేరళ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడం కూడా సముచితం కాదని ధర్మాసనం తెలిపింది. గత ఏడాది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు తమకు భద్రతను అందించాలంటూ రెహానా ఫాతిమా - బిందు అమ్మాణిలు ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.
Tags:    

Similar News