మోడీ ప్రభుత్వ నిర్ణయంపై విచారణకు కోర్టు ఓకే!

Update: 2015-04-11 05:27 GMT
భూ సేకరణ చట్టంలో సవరణలు అంటూ ఆర్డినెన్స్‌ల మీద ఆర్డినెన్స్‌లు తెస్తున్న మోడీ ప్రభుత్వంపై రైతు సంఘాల పోరాటానికి కోర్టు నుంచి ఊరట లభించింది. వరస ఆర్డినెన్స్‌లు జారీ చేస్తూ భూ సేకరణ విషయంలో తాము అనుకొన్న మార్పులు తీసుకురావాలని ప్రయత్నిస్తున్న మోడీ సర్కారుకు ఇది ఝలక్‌ అని చెప్పవచ్చు. భూ సేకరణ చట్టంలో సవరణలు అంటూ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ అక్రమమైనదని.. దాన్ని రద్దు చేసి రైతులను కాపాడాలని కోరుతూ రైతు సంఘాలు దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం విచారణకు తీసుకొంది.

    ఈ అంశంపై విచారణకు అనుమతిని ఇచ్చింది. దీంతో ఈ ఆర్డినెన్స్‌ కథాకమామీషు పై కోర్టులో విచారణ జరిగే అవకాశం లభించింది. మోడీ ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ చట్టసవరణలను ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. అయితే పార్లమెంటులో ఈ బిల్లు ఆగలేదు. అక్కడ మోడీ సర్కారుకు మంచి బలం ఉండటంతో సవరణల బిల్లు లోక్‌సభ గేటు దాటింది.

    అయితే ప్రభుత్వం ఏకపక్షంగా తెస్తున్న ఈ బిల్లు రాజ్యసభ గేటు మాత్రం దాటడం లేదు. అక్కడ మోడీ సర్కారుకు బలం లేకపోవడంతో ఈ బిల్లు ఆగిపోయింది. ఈ నేపథ్యంలో మోడీ ప్రభుత్వం మరో సారి ఆర్డినెన్స్‌ తెచ్చింది.

    అయితే వరస ఆర్డినెన్స్‌లు రాజ్యాంగ విరుద్దమని.. ఈ బిల్లులో సవరణల వల్ల కూడా రైతులకు అన్యాయం జరుగుతుందని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయాలపైనే వారు కోర్టుకు ఎక్కారు. ఇప్పుడు కోర్టులో ఈ పిటిషన్‌పై విచారణ ఖాయం అయ్యింది.

    దీంతో మోడీ ప్రభుత్వం ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టుకు వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. మరి ఈ పోరాటంలో రైతులు గెలుస్తారో.. ప్రభుత్వమే గెలుస్తుందో చూడాలి!
Tags:    

Similar News