ఎంపీల‌ను ఏకి ప‌డేసిన సుప్రీం

Update: 2017-04-27 06:46 GMT
పార్ల‌మెంటు స‌భ్యుల‌పై దేశ సర్వోన్న‌త న్యాయ‌స్థానం తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఏకంగా స‌భ్యుల సంఖ్య‌ను సైతం ప్ర‌స్తావిస్తూ నిప్పులు చెరిగింది. ``ఈ ఏడాది జూలై 1 నుంచి పాన్‌ కార్డుకు ఆధార్ అనుసంధాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ లో ప్రతిపాదనను పొందుపరుస్తుంటే ఎంపీలు ఎందుకు అభ్యంతరం చెప్పలేదు``అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ``పార్లమెంట్‌ లో 542 మంది సభ్యులు ఉన్నారు. పాన్‌ కార్డు జారీకి ఆధార్ అనుసంధానాన్ని తప్పనిసరి చేస్తుంటే వారు ఎందుకు అభ్యంతరం చెప్పలేదు. మీరే అభ్యంతరం వ్యక్తం చేయనప్పుడు మేం ఎందుకు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి`` అని జస్టిస్ ఏకే సిక్రి - జస్టిస్ అశోక్‌ భూషణ్‌ తో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది.

``కొన్నిరోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం అన్నింటికీ ఆధార్‌కార్డును తప్పనిసరి చేయడం లేదని మాకు తెలిపింది. అయితే, ఇచ్చిన మాటకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడలేదు. ఆధార్ అనుసంధానంపై చట్టబద్ధమైన నిబంధనలను రూపొందిస్తుంటే పార్లమెంట్‌ లో ఎంపీలు అడ్డుకోలేదు`` అని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ ఏడాది జూలై 1 నుంచి పాన్‌ కార్డు పొందడం, ఆదాయం పన్ను రిటర్న్స్ సమర్పణకు ఆధార్‌ కార్డు లేదా ఆధార్‌ కార్డు దరఖాస్తుకు సంబంధించిన నంబరు సమర్పించడాన్ని తప్పనిసరి చేస్తూ 2017 బడ్జెట్‌ లో ఆదాయం పన్ను చట్టంలో సెక్షన్ 139ఏఏను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఆదాయం పన్ను చట్టం సెక్షన్ 139ఏఏ రాజ్యాంగానికి విరుద్ధమని పేర్కొంటూ దాఖలైన మూడు వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసు విచారణ సందర్భంగా దేశంలో పన్నుల ఎగవేతపై సుప్రీంకోర్టు స్పందిస్తూ పన్నులు చెల్లించడానికి కొంత మంది ప్రజలు ఇష్టపడకపోవడం సిగ్గు చేటు అని పేర్కొన్నది. ``పన్ను ఎగవేస్తున్నారన్న విషయం మాకు తెలుసు. తగిన ప్రత్యామ్నాయ చట్టం తీసుకువచ్చి పన్ను ఎగవేతను అరికట్టవచ్చు. ఆధార్ అనుసంధానాన్ని ఐచ్ఛికం చేయాలన్న విషయంలో మాకు మరో అభిప్రాయం లేదు`` అని ధర్మాసనం తేల్చిచెప్పింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News