ఈసీకి టెన్ష‌న్ గా మారి సుప్రీం ఆదేశాలు

Update: 2017-07-13 04:59 GMT
కేంద్ర ఎన్నిక‌ల సంఘం మింగాలేక‌.. క‌క్కా లేని ప‌రిస్థితుల్లో చిక్కుకుంది. కీల‌క‌మైన ఒక అంశం మీద అత్యున్న‌త న్యాయ‌స్థానం అభిప్రాయం చెప్పాల్సిందిగా కోరిన తీరుకు ఏం చెప్పాలో అర్థం కాని ప‌రిస్థితుల్లో ప‌డింద‌ని చెబుతున్నారు. ఏదైనా కేసులో దోషిగా తేలిన చ‌ట్ట‌స‌భ స‌భ్యులు ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌కుండా జీవిత‌కాల నిషేధం విధించాల‌ని కోరుతూ ఒక పిటీష‌న్ సుప్రీంలో దాఖ‌లైంది. అశ్వినీకుమార్ ఉపాధ్యాయ అనే న్యాయ‌వాది ఒక‌రు సుప్రీంను ఆశ్ర‌యించి.. ఒక ఆస‌క్తిక‌ర వాద‌న‌ను తెర మీద‌కు తీసుకొచ్చారు.

ఒక ప్ర‌భుత్వ ఉద్యోగి ఏదైనా కేసులో దోషిగా తేలితే అత‌న్ని స‌ర్వీసుల నుంచి తొల‌గిస్తార‌ని.. అదే ప్ర‌జా ప్ర‌తినిధులు అయితే ఆరేళ్ల నిషేధంతో స‌రి పెడుతున్నార‌ని.. అది స‌రికాద‌న్న‌ది ఆయ‌న వాద‌న‌. దోషులుగా నిరూపిత‌మైన వారిని ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌కుండా జీవిత‌కాలం నిషేధం విధించాల‌ని.. ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌టానికి వీల్లేకుండా ప‌రిమితులు విధించాల‌ని కోరుతున్నారు.

ఈ పిటీష‌న్‌ను విచారిస్తున్న సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తులు జ‌స్టిస్ రంజ‌న్ గొగోయ్‌.. జ‌స్టిస్ న‌వీన్ సిన్హాల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈ అంశంపై విచార‌ణ చేప‌ట్టింది. పిటీష‌న్ విన్న‌పంపై త‌న స్ప‌ష్ట‌మైన‌ నిర్ణ‌యాన్ని వెల్ల‌డించ‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం తీరును సుప్రీం తీవ్రంగా త‌ప్పు ప‌ట్టింది.

"మీరు భార‌త్ ఎన్నిక‌ల క‌మిష‌న్‌. దోషులైన వారు ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌కుండా జీవిత‌కాలం నిషేధం విధించాల‌ని ఇక్క‌డొక పౌరుడు మ‌మ్మ‌ల్ని ఆశ్ర‌యించాడు. పిటీష‌న‌ర్ వాద‌న‌ను మీరు స‌మ‌ర్థిస్తున్నారో..లేదో అన్న విష‌యాన్ని తేల్చి చెప్పాలి.  ఇలాంటి విష‌యాల్లో మౌనంగా ఉండ‌టం ఏమిటి? క‌క్షిదారు వేసిన పిటీష‌న్‌ పై మీ స‌మాధానం అవునో.. కాదో తేల్చి చెప్పండి" అంటూ తీవ్రంగా స్పందించింది.

రాజకీయంగా ప్ర‌కంప‌న‌లు సృష్టించే ఇలాంటి అంశంపై ఈసీ ఆచితూచి స్పందించాల్సిందే. లేదంటే అదో పెద్ద ఇష్యూగా మారుతుంద‌న్న అభిప్రాయం ఉంది. ఈ కార‌ణంతోనే ఈసీ జాగ్ర‌త్త‌గా రియాక్ట్ కావాల‌న్న ఉద్దేశంతో తొంద‌ర‌ప‌డ‌టం లేద‌ని తెలుస్తోంది. మ‌రోవైపు.. ఈ అంశంపై త‌న నిర్ణ‌యాన్ని వెంట‌నే చెప్పాలంటూ ఈసీ ఒత్తిడి చేస్తుండ‌టం ఈసీకి ఒక ప‌ట్టాన మింగుడు ప‌డ‌టం లేద‌ని చెబుతున్నారు.
Tags:    

Similar News