పండిట్ల ఊచ‌కోత‌పై సుప్రీం రియాక్ష‌న్ ఇది

Update: 2017-07-25 04:38 GMT
ఒక దారుణంపై రాజ‌కీయ పార్టీలు.. మేధావులు.. మాన‌వ‌తామూర్తులు అంత‌గా స్పందించ‌ని ఉదంతం ఏదైనా ఉందంటే అది కాశ్మీరీ పండిట్ల ఉచ‌కోతేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. చిన్న చిన్న విషయాల‌కు.. దారుణ‌మైన నేరాల‌కు పాల్ప‌డి.. కోర్టుల్లో దోషులుగా తేలి.. ఉరిశిక్షను అమ‌లు చేయాల‌ని చెప్పే తీర్పుల‌ను సైతం వ్య‌తిరేకిస్తూ ఆందోళ‌న‌లు చేసే మాన‌వ‌తావాదులు.. క‌రుణామ‌య‌లు సైతం 1989-90ల‌లో కాశ్మీర్ లోయ‌లో వంద‌లాది పండిట్ల‌ను ఊచ‌కోత కోసిన వైనం మీద మాత్రం మౌనంగా ఉన్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

వంద‌లాది మంది కాశ్మీరీ పండిట్ల‌ను హ‌త్య చేయ‌టం.. ఆ వ‌ర్గానికి చెందిన మ‌హిళ‌ల‌పై లైంగిక‌దాడుల‌కు తెగ‌బ‌డ‌టం.. వారి సొంత ప్రాంతం నుంచి త‌రిమికొట్ట‌టం లాంటివి చోటు చేసుకున్న‌ప్ప‌టికీ.. ఆ దారుణాల గురించి ఏ జాతీయ పార్టీ తీవ్ర‌స్థాయిలో పోరాడింది లేదు. దాదాపు 700 మందికి పైగా కాశ్మీరీ పండిట్లు హ‌త్య‌కు గురైనా.. వేలాది మంది త‌మ సొంతిళ్లు.. ఊళ్ల‌ను వ‌దిలేసి ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని పారిపోయినా పెద్ద‌గా ప‌ట్టించుకోని ప‌రిస్థితి.

ఈ దుర్మార్గం జ‌రిగిన 27 ఏళ్ల త‌ర్వాత న్యాయం కోసం సుప్రీంకోర్టును ఆశ్ర‌యించిన ఉదంతంపై తాజాగా అత్యున్న‌త న్యాయ‌స్థానం స్పందించింది. కాశ్మీరీ పండిట్ల హ‌త్య‌కు గురైన కేసుల్ని ఇప్పుడు తిర‌గ‌దోడ‌టం సాధ్యం కాద‌ని సుప్రీం స్ప‌ష్టం చేసింది. హ‌త్య‌ల‌తో పాటు వివిధ నేరాల‌కు పాల్ప‌డిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న వేర్పాటునేత యాసిన్ మాలిక్ తో స‌హా ప‌లువురిని విచారించి.. ద‌ర్యాప్తు జ‌ర‌పాల‌ని దాఖ‌లైన పిటీష‌న్ పై సుప్రీంకోర్టు స్పందించింది. కాశ్మీరీ పండిట్ల‌ను ఊచ‌కోత కోసిన‌ ఉదంతం జ‌రిగి 27 ఏళ్లు పూర్తి అయిన వేళ‌లో.. నాటి ఘ‌ట‌న‌ల‌కు సంబంధించిన సాక్ష్యాలు సేక‌రించ‌టం చాలా క‌ష్ట‌మ‌న్న అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ఎస్‌.జె.ఖెహ‌ర్.. జ‌స్టిస్ చంద్ర‌చూడ్ ల‌తో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ వ్య‌క్తం చేసింది.

ఈ సంద‌ర్భంగా పిటీష‌న‌ర్ ను ఉద్దేశించి సుప్రీంకోర్టు బెంచ్ స్పందిస్తూ.. కేసును రీఓపెన్ చేయాల‌ని ఎలా అడుగుతార‌ని.. 27 ఏళ్లు ఎందుకు మౌనంగా ఉన్నార‌ని ప్ర‌శ్నించింది. ఇప్పుడు కోర్టు ముందుకు వ‌స్తే సాక్ష్యాలు ఎలా వ‌స్తాయ‌ని.. ఎక్క‌డినుంచి తెస్తారో చెప్పాల‌ని ప్ర‌శ్నించింది. దీనికి పండిట్ల త‌ర‌పు న్యాయ‌వాది బ‌దులిస్తూ.. నాటి ఘ‌ట‌న‌ల్లో 700 మంది పండిట్లు హ‌త్య‌కు గుర‌య్యార‌ని.. ఇందుకు సంబంధించిన 215 ఎఫ్ ఐఆర్ లు దాఖ‌లు అయ్యాయ‌య‌ని.. వాటిల్లో ఒక్క కేసు కూడా ముగింపున‌కు రాలేద‌ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 1990 ప్రారంభంలో ఉగ్ర‌వాదం తీవ్ర‌స్థాయికి చేరుకోవ‌టం.. బెదిరింపులు.. దాడులు అంత‌కంత‌కూ పెరిగిపోవ‌టంతో పండిట్లు త‌మ ప్రాణాల్ని అర‌చేతిలో పెట్టుకొని కాశ్మీర్ లోయ‌ను విడిచిపెట్టి వెళ్లిపోయిన‌ట్లుగా పేర్కొన్నారు. తాజాగా సుప్రీం కోర్టు స్పంద‌న చూసిన‌ప్పుడు.. ద‌శాబ్దాల క్రితం జ‌రిగిన ఈ వ్య‌వ‌హారంపై తాము ఇప్పుడేమీ చేయ‌లేమ‌న్న భావ‌న‌ను వ్య‌క్తం చేసింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News