అంబానీకి సుప్రీం ఫైన‌ల్ వార్నింగ్...తేడా వ‌స్తే

Update: 2019-01-08 04:47 GMT
అప్పుల్లో కూరుకుపోయిన రిలయన్స్ కమ్యూనికేషన్ లిమిటెడ్ (ఆర్‌ కామ్) చైర్మన్ అనిల్ ధీరూభాయ్ అంబానీకి మ‌రోషాక్ త‌గిలింది. సుప్రీంకోర్టు సోమవారం కోర్టు ధిక్కార నోటీసును జారీ చేసింది. ఎరిక్సన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన పిటీషన్ విచారణలో భాగంగా అనిల్ అంబానీతోపాటు మరికొందరికీ అత్యున్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. ఆర్‌ కామ్ పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన నేపథ్యంలో సంస్థ ఆస్తులను అన్న ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియోకు అనిల్ అమ్ముకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆస్తులను విక్రయించుకుంటున్నా.. తమకు ఇవ్వాల్సిన రూ.550 కోట్ల బకాయిలను మాత్రం తీర్చడం లేదని ఎరిక్సన్ ఆరోపిస్తూ సుప్రీంను ఆశ్రయించింది.

దేశవ్యాప్తంగా ఆర్‌ కామ్ టెలికం నెట్‌ వర్క్ నిర్వహణ కోసం 2014లో ఎరిక్సన్ ఇండియా ఏడేళ్ల‌ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అయితే - 2018 ఆగస్టు 3 నాటి ఆదేశాలను బేఖాతరు చేసిన నేపథ్యంలో అక్టోబర్ 23న డిసెంబర్ 15లోగా మొత్తం బకాయిలను చెల్లించాలని ఆర్‌కామ్‌ను సుప్రీం ఆదేశించింది. ఇదే చివరి అవకాశంగా పేర్కొన్న సుప్రీం.. గడువులోగా చెల్లించని పక్షంలో 12 శాతం వార్షిక వడ్డీరేటు పడుతుందని కూడా హెచ్చరించింది. అలాగే ఆర్‌ కామ్ విఫలమైతే ఈ వ్యవహారంపై ధిక్కార పిటీషన్‌ ను ఎరిక్సన్ దాఖలు చేసుకోవచ్చనీ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే ఆర్‌ కామ్ చెల్లింపులు జరుపకపోవడంతో ధిక్కార చర్యలకు సుప్రీంను ఎరిక్సన్ కోరగా - అనిల్‌ తోపాటు మరో ఇద్దరికి కోర్టు ధిక్కార నోటీసులు జారీ అయ్యాయి. ఆర్‌ ఎఫ్ నారీమన్ - వినీత్ శరణ్‌ లతో కూడిన ధర్మాసనం దీనిపై అనిల్ అంబానీ - మరికొందరి నుంచి నాలుగు వారాల్లో స్పందనను కోరింది. ఇదే సమయంలో ఈ కేసు విచారణను ఐదు వారాల తర్వాతకు వాయిదా వేసింది. ఆర్‌ కామ్ తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్ - ముకుల్ రోహ్తగీలు వాదిస్తుండగా - స్వీడన్ కంపెనీ ఎరిక్సన్ తరఫున మరో సీనియర్ న్యాయవాది దుశ్యంత్ దవే వాదనలు వినిపిస్తున్నారు.


Full View

Tags:    

Similar News