టీటీపీపై ఏంటీ పిటిష‌న్లు.. మా జోక్యం అవ‌స‌ర‌మా? సుప్రీం కోర్టు ఆగ్ర‌హం

Update: 2021-11-16 13:30 GMT
తిరుమ‌ల తిరుప‌తి దేవస్థానం.. టీటీడీ వ్య‌వ‌హాలు.. శ్రీవారికి జ‌రిగే నిత్య కైంక‌ర్యాల్లో రోజు వారీ విచార‌ణ చేప‌ట్టే అవ‌కాశం లేద‌ని.. సుప్రీం కోర్టు స్ప‌ష్టం చేసింది. రాజ్యాంగ ధ‌ర్మాసనం.. ఇలాంటి వాటి విష‌యంలో జోక్యం చేసుకునే ప్ర‌స‌క్తి లేద‌ని తేల్చి చెప్పింది. ఈ మేర‌కు ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును స‌వాల్ చేస్తూ.. దాఖ‌లైన‌.. పిటిష‌న్‌పై సుప్రీం ధ‌ర్మాస‌నం తేల్చి చెప్పింది. శ్రీవారి నిత్య కైంక‌ర్యాల్లో ఆగ‌మం అనుస‌రించ డం లేద‌ని.. భ‌క్తుల మ‌నోభావాలు దెబ్బ‌తింటున్నాయ‌ని పేర్కొంటూ.. టీటీడీని సంస్క‌రించేలా ఆదేశాలి వ్వాలంటూ.. `శ్రీవారి దాదా` అనే భ‌క్తుడు హైకోర్టులో గ‌తంలో పిటిష‌న్ వేశారు.

అయితే.. ఈ పిటిష‌న్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. అయితే.. హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆయ‌న సుప్రీంలో స‌వాల్ చేశారు. ఇప్ప‌టికే రెండు సార్లు విచారించిన సుప్రీం కోర్టు.. తాజాగా దాదా దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను తోసిపుచ్చింది. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌, జ‌స్టిస్ హిమా కోహ్లీ, జ‌స్టిస్ బోప‌న్న‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం.. కొన్ని కీల‌క వ్యాఖ్యలు చేసింది. శ్రీవారి నిత్య కైంక‌ర్యాల్లో రోజు వారి విచార‌ణ చేసే అవ‌కాశం లేద‌ని పేర్కొంది. ఏదైనా స‌మ‌స్య ఉంటే.. భ‌క్తులు.. టీటీడీని ఆశ్ర‌యించి వారి ద్వారా ప‌రిష్క‌రించుకోవాల‌ని సూచించింది.

``పిటిష‌న‌ర్ ఉద్దేశం.. వెనుక‌.. ఇప్ప‌టికిప్పుడు మేం ఏదైనా ఆదేశాలు ఇస్తే.. అవి సంచ‌ల‌నం కావాల‌ని కోరుకుంటున్న‌ట్టుగా ఉంది!`` అని కోర్టు వ్యాఖ్యానించడం గ‌మ‌నార్హం. ఆగ‌మం ప్ర‌కారం .. అన్నీ జ‌రుగుతున్నాయ‌ని.. టీటీడీ చెబుతోంద‌ని.. ఒక‌వేళ ఏదైనా అలా జ‌ర‌గ‌క‌పోతే.. అక్క‌డే ఫిర్యాదు చేయొచ్చ‌ని.. అన్నీ శ్రీవారే చూసుకుంటార‌ని.. కోర్టు వ్యాఖ్యానించింది. ఇప్ప‌టికే ట్ర‌య‌ల్ కోర్టు దీనిపై అన్ని కోణాల్లోనూ విచారించిన నేప‌థ్యంలో టీటీడీ రోజు వారీ కార్య‌క‌లాపాల‌ను తాము.. ప‌ర్య‌వేక్షించ‌లేమ‌ని స్ప‌ష్టం చేసింది.

అదేస‌మ‌యంలో భ‌క్తుల స‌మ‌స్య‌లు.. వారి సందేహాల‌ను సంపూర్ణంగా నివృత్తి చేయాల్సిన బాధ్య‌త టీటీడీపై ఉంద‌ని.. సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. అంతేకాదు.. స‌రైన విధంగా భ‌క్తుల స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం చూపించే వేదిక‌ను ఏర్పాటు చేయాల‌ని.. ఇప్ప‌టికే ఉంద‌ని చెబుతున్న నేప‌థ్యంలో ఆ వ్య‌వ‌స్థ‌ను మ‌రింత ప‌క‌డ్బందీగా నిర్వ‌హించాల‌ని.. పేర్కొంది. ఈ మేర‌కు శ్రీవారి దాదా దాఖ‌లు చేసిన‌.. పిటిష‌న్‌ను తోసిపుచ్చుతూ.. హైకోర్టు తీర్పును స‌మ‌ర్ధించింది.
Tags:    

Similar News