పెళ్లి ఖ‌ర్చుపై సుప్రీం దృష్టి..కొత్త త‌ల‌నొప్పి!

Update: 2018-07-04 04:44 GMT
కీల‌క అంశంపై దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం దృష్టి సారించింది. పెళ్లికి అయ్యే ఖ‌ర్చు వివ‌రాల్ని వ‌ధూవ‌రులు ఇద్ద‌రూ ప్ర‌భుత్వ అధికారికి ఇవ్వాలా?  వ‌ద్దా? అన్న అంశంపై విచార‌ణ‌ను షురూ చేసింది. అస‌లు ప్ర‌భుత్వ అధికారికి పెళ్లి ఖ‌ర్చు లెక్క‌లు ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉందా?  లేదా?  అన్న విష‌యాన్ని ప‌రిశీలించాల‌న్న అంశంపై దృష్టి పెట్టింది. ఇంత‌కూ ఈ నిర్ణ‌యాన్ని తీసుకోవ‌టానికి కార‌ణం ఏమిటి? అన్న అంశంలోకి వెళితే.. క‌ట్న కానుక‌ల విష‌యంలో ఫ్యూచ‌ర్లో గొడ‌వ‌లు రాకుండా ఉండ‌టానిక‌న్న మాట‌ను చెబుతున్నారు.

పెళ్లి ఖ‌ర్చుల వివ‌రాలు రెండు వైపుల నుంచీ ప్ర‌భుత్వానికి చేరితేనే మంచిదా? అన్న అభిప్రాయంపై విచార‌ణ జ‌ర‌పాల‌ని భావిస్తున్న‌ట్లుగా సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఆద‌ర్శ్ గోయ‌ల్‌.. జ‌స్టిస్ ఎస్ అబ్దుల్ న‌జీర్ ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం తాజాగా వెల్ల‌డించింది.

పెళ్లి ఖ‌ర్చులో కొంత భాగం పెళ్లి కుమార్తె పేరిట జ‌మ చేయించాల‌న్న అభ్య‌ర్థ‌న‌ను కూడా ప‌రిశీలించాల‌ని న్యాయ‌మూర్తులు భావిస్తున్నారు. ఇంత‌కూ ఇదంతా ఎందుకంటే.. పెళ్లి ఖ‌ర్చుల‌కు సంబంధించి భ‌విష్య‌త్తులో గొడ‌వ‌లు రాకుండా ఉండ‌టానికి అని చెబుతున్న‌ప్ప‌టికీ.. ప్రాక్టిక‌ల్ గా ప‌లు స‌మ‌స్య‌లు తలెత్త‌టం ఖాయ‌మ‌న్న మాట వినిపిస్తోంది.

పెళ్లి అన్న‌ది ఇద్ద‌రు వ్య‌క్తుల ప్రైవేటు వ్య‌వ‌హారం. అదే స‌మ‌యంలో రెండు కుటుంబాల‌కు సంబంధించిన అంశం. ల‌క్ష‌లాది పెళ్లిళ్లు జ‌రిగితే.. గొడ‌వ‌ల‌తోనో.. మ‌రో కార‌ణంతోనో వివాదాల‌కు కేంద్రంగా మారే పెళ్లిళ్లు చాలా త‌క్కువ ఉంటాయి. అలాంటప్పుడు.. ప్ర‌తి పెళ్లికి సంబంధించిన లెక్క‌లు ప్ర‌భుత్వ అధికారి దృష్టికి వెళ్ల‌ట‌మంటే.. వారి ప్రైవ‌సీని దెబ్బ తీయ‌ట‌మే కాదు.. వారి స్వేచ్ఛ‌కు చెక్ పెట్టే వీలుంది.

ప్ర‌భుత్వ అధికారికి లెక్క‌లు ఇవ్వాల‌న్న మాట కొత్త త‌ర‌హా అవినీతిని ప్రోత్స‌హించే వీలుంది కూడా.   ఇలాంటి సందేహాల న‌డుమ సుప్రీం ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుంద‌న్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. పెళ్లి ఖ‌ర్చు వివ‌రాల్ని త‌ప్ప‌నిస‌రిగా ప్ర‌భుత్వ అధికారికి స‌మ‌ర్పించాల‌న్న రూల్ ఇప్ప‌టివ‌ర‌కూ లేదు. ఇక‌పై ఏమ‌వుతుంద‌న్న‌ది సుప్రీం తుది తీర్పుపై ఆధార‌ప‌డి ఉంటుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News