బీజేపీకి చెలగాటం..కాంగ్రెస్ కు ప్రాణ సంకటం

Update: 2017-03-14 12:04 GMT
మొన్నటి గోవా అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించినా గవర్నమెంటు ఏర్పాటు చేయలేకపోవడంతో కాంగ్రెస్ లో విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. తమ కంటే తక్కువ సీట్లు సాధించిన బీజేపీ చిన్నాచితకా పార్టీలను చేరదీసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంటే కాంగ్రెసోళ్లు ఏమీ చేయలేక ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. అక్కడి వైఫల్యాలకు కారణం నువ్వే అంటే నువ్వే అనుకుంటూ ఇప్పుడు హడావుడి చేస్తున్నారు.
    
గోవాలో మనోహర్ పారికర్ ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ అంతా సిద్ధం చేసుకున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు ఆలోచనే లేకుండా కుమ్ములాటలకు దిగుతోంది. అంతేకాదు.. అంతా అయిపోయాక దిగ్విజయ్ సింగ్ నేతృత్వంలో గవర్నర్ ఎదుట కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పరేడ్ నిర్వహించాలని నిర్ణయించారు. గవర్నర్‌ ను కలిసి తమకు ఉన్న బలాన్ని చూపించనున్నారు.
    
గోవాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 17 స్థానాలు - బీజేపీ 13 స్థానాలు గెలుపొందింది. జీఎఫ్‌ పీ - ఎంజీపీ పార్టీల ఎమ్మెల్యేలు సహా స్వతంత్రులు మద్దతు ఇస్తుండడంతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు రెడీ అయిపోయింది. గోవాలో  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన సంఖ్య 21. కాంగ్రెస్ పార్టీకి బీజేపీ కంటే ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ మేజిక్ ఫిగర్ రాలేదు. మరో నాలుగు సీట్లు తక్కువ పడ్డాయి. కాంగ్రెస్ పార్టీకి నాలుగు - బీజేపీకి ఎనిమిది సీట్లు తక్కుగా ఉన్నాయి. ముందే అప్రమత్తమైన బీజేపీ ఇందుకోసం కసరత్తు చేసింది. ఇతర పార్టీలు - స్వతంత్రుల మద్దతును కూడగట్టుకుంది.
    
ఇంత, జరిగాక ఇప్పుడు  17 మంది ఎమ్మెల్యేలతో  గవర్నరును కలుస్తోంది. మరోవైపు తమనే ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలంటూ గోవా కాంగ్రెస్ సుప్రీంలో కేసు కూడా వేసింది.  పిటిష‌న్ ఈ రోజు విచార‌ణ‌కు వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ త‌ర‌ఫు న్యాయ‌వాది వాదిస్తూ బీజేపీ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘిస్తోంద‌ని అన్నారు. గోవా సీఎంగా పారికర్‌ ను ఆహ్వానించడమేంటని ప్రశ్నించారు. అయితే, రాష్ట్రంలో గ‌వ‌ర్న‌మెంటు ఏర్పాటుకు కాంగ్రెస్‌ కి బ‌లం ఎక్క‌డుంది? అని సుప్రీంకోర్టు ప్ర‌శ్నించింది. ఒక వేళ కాంగ్రెస్ కు బ‌లం ఉంటే మ‌రి గ‌వ‌ర్న‌ర్‌ ను ఎందుకు సంప్ర‌దించ‌లేద‌ని అడిగింది. గ‌వ‌ర్న‌ర్‌ ను ఇప్పుడ‌యినా క‌ల‌వాల‌ని సుప్రీంకోర్టు సూచించింది.
    
ఈ పరిణామాలన్నిటి నేపథ్యంలో అక్కడి వ్యవహారాలు చూస్తున్న దిగ్విజయ్ సింగ్ పై మిగతా కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.  రేణుకా చౌదరి అయితే.. గోవాలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించడంలో దిగ్విజయ్ విఫలమయ్యారని.. ఆయన్ను వెంటనే తొలగించాలని డిమాండు చేస్తున్నారు. మొత్తానికి ఎక్కువ సీట్లు రాకపోయినా తెలివిగా ప్రభుత్వం ఏర్పాటుచేసుకుంటూ బీజేపీ హ్యాపీగా ఉండగా.. ఎక్కువ సీట్లు వచ్చినా కూడా కాంగ్రెస్ ఏమీ చేయలేక చతికిలపడింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News