మూడేళ్ల బీజేపీ పాల‌న ఓ విప‌త్తు

Update: 2017-06-05 05:46 GMT
కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మూడేళ్ల‌ పాలన ఒక విపత్తుగా సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అభివర్ణించారు. పెద్దనోట్ల రద్దు తర్వాత ప్రధానమంత్రి న‌రేంద్ర మోడీ చేసిన మరొక పెద్ద తప్పు పశువధపై నిషేధం విధించడమని అన్నారు. హిట్లర్ తరహాలో ఏకవ్యక్తి పాలనను మోడీ సాగిస్తున్నారని ఆరోపించారు.

విజయవాడలో సుర‌వ‌రం సుధాక‌ర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అధికార ప‌క్షాల‌పై విరుచుకుప‌డ్డారు. ఏపీకి ప్రత్యేక హోదాను కోరేవారిని ప్రగతి నిరోధకులుగా అభివర్ణిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు.. అసలు హోదా ఏ విధంగా ప్రగతి నిరోధకమో ప్రజలకు చెప్పాలని సురవరం డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా కోసం ఏర్పాటుచేసిన కాంగ్రెస్ సభకు ఎవరూ వెళ్లవద్దని చెప్పడం చంద్రబాబు కుసంస్కారానికి నిదర్శనమన్నారు.

రాష్ట్ర ప్రగతికి పాటుపడుతున్నామని చెప్పుకుంటున్న టీడీపీ ఎమ్మెల్యేలు - ఎంపీలు ఇసుక మాఫియాలు నిర్వహిస్తూ, అధికారులపై దాడులు చేయడమే ప్రగతి అనిపించుకుంటుందా ? ఏపీ సీఎం చంద్ర‌బాబు చెప్పాల‌ని సుర‌వ‌రం సుధాక‌ర్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. ఇప్పటికైనా కల్లబొల్లి మాటలు కట్టిపెట్టి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ఏపీకి ప్రత్యేకహోదాను కల్పించేందుకు పార్లమెంటు బయటా - వెలుపలా ఒత్తిడి పెంచేందుకు కృషిచేయాలని చంద్రబాబుకు సురవరం హితవు పలికారు. ఏ ప్రయోజనాల కోసం బీజేపీతో జతకలిశారో చంద్ర‌బాబు సమాధానం ఇవ్వాలన్నారు.  కేవలం ఎన్నికల్లో గెలిచేందుకు, తనపై కేసులు లేకుండా చూసేందుకే బీజేపీతో అవకాశవాద పొత్తు పెట్టుకున్నారని ఆయన విమర్శించారు. తాను సంతకం చేయడం వల్లే తెలంగాణ వచ్చిందని హైదరాబాద్‌లో మాట్లాడటం, జూన్ 2న బ్లాక్‌ డేగా నిర్వహించాలని నవ్యాంధ్రలో చెప్పడం చంద్రబాబుకే చెల్లిందని ఎద్దేవా చేశారు.

మూడేళ్ల పాలనలో ప్రధాని మోడీ చేసింది శూన్య‌మ‌ని సురవ‌రం మండిప‌డ్డారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగాలను ఊడ తీస్తున్నారని విమర్శించారు. పశువధపై నిషేధం వల్ల లక్షల కోట్ల వ్యాపారాలు స్తంభించిపోతున్నాయని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఆందోళనలు, దాడులతో తగులబడిపోతున్న కాశ్మీర్‌ ను రక్షించుకోవాలన్నారు. చర్చల ద్వారానే రాజకీయ పరిష్కారాన్ని చూపాల్సిన అవసరం ఉందని సూచించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News