మోడీ గురించి ఏం చెప్ప‌ని కేసీఆర్‌ కు ఫ్రంట్ తొంద‌ర ఎందుకు?

Update: 2018-03-31 10:53 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ పై సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. జాతీయ రాజ‌కీయాల్లో గుణాత్మ‌క మార్పు రావాలంటూ ఫ్రంట్ పేరుతో ప్ర‌య‌త్నాలు చేస్తున్న కేసీఆర్ తీరును ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ కు ఆతృత ఎక్కువ ఉంది కానీ...అందుకు త‌గిన అడుగులు లేవ‌న్నారు. కేసీఆర్ ఫ్రంట్ ఏర్పాటుపై మాతో చర్చించలేదని సీపీఐ జాతీయ ప్ర‌ధాన‌కార్య‌ద‌ర్శి స్ప‌ష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం విధానాలు - మతోన్మాదంపై ఆయన వైఖరి ఏమిటో చెప్పకుండా ఫ్రంట్ లో చేరండి అంటే ఎలా సాధ్యం అవుతుందని ఆయన సూటిగా ప్ర‌శ్నించారు.

బీజేపీకి పూర్తి మద్దతు ఉన్న అవిశ్వాసానికి ఎందుకు భయపడుతోందని సుర‌వ‌రం సుధాక‌ర్ రెడ్డి ప్రశ్నించారు. తన పార్టీ ఎంపీలు వ్యతిరేకంగా ఓటు వేస్తారని అవిశ్వాసం చర్చకు రానివ్వకుండా కుట్ర చేస్తోందన్నారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరగడానికి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఆయన సూచించారు. బీజేపీకి కర్ణాటక ఎన్నికల్లో వ్యతిరేకత వస్తుందని కావేరి బోర్డును  ఏర్పాటు చేయటం లేదని ఆరోపించారు. న్యాయస్థానాల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం ఎక్కువయిందని సీనియర్ న్యాయమూర్తులు లేవనెత్తిన అంశాలపై దేశ వ్యాప్తంగా చర్చ జరగాలని సుర‌వ‌రం కోరారు. ఎస్సి  - ఎస్టీ అట్రాసిటీ చట్టంపై సుప్రీం తీర్పు పై దళిత  - వామపక్ష సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, ఏప్రిల్ 2 న దళిత సంఘాలు దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారని ఈ నిరసనలకు సీపీఐ మద్దతు తెలుపుతుందన్నారు.

సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ... ఒక మహిళ కూ తన మంత్రివర్గంలో స్తానం ఇవ్వలేని కేసీఆర్ సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కేసీఆర్  ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరిస్తోందని - నూతన పంచాయతీ రాజ్ చట్టం గ్రామాల్లో వైషమ్యాలు తెచ్చేలా ఉందన్నారు. ఏప్రిల్ 1 నుంచి 4 వరకు ఆర్టీసీ కళ్యాణ మండపంలో  సీపీఐ రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నామని - ఏప్రిల్ 1 న ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో బహిరంగ సభ జరుగుతుందన్నారు. ఈ సమావేశాల్లో కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. రాబోయే ఎన్నిక‌ల‌కు సంబంధించిన త‌మ ప్ర‌ణాళిక‌ను విడుద‌ల చేస్తామ‌న్నారు.

Tags:    

Similar News