మోడీవి అపరిపక్వతతో కూడిన నిర్ణయాలా?

Update: 2016-12-22 04:34 GMT
నిన్నమొన్నటివరకూ మోడీపై వ్యక్తిగత విమర్శలు చేసేవారే తప్ప వ్యవస్థాగతంగా భారీగా విమర్శలు చేసిన ప్రతిపక్షాలు తక్కువనే చెప్పాలి. మంచో చెడో మోడీపై సామాన్యులకు ఉన్న నమ్మకం ప్రభావమో లేక భారీగా ప్రజలను ఇబ్బందిపెట్టే నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లో, పాకిస్థాన్ విషయంలో కాస్త దూకుడుగా వ్యవహరిస్తున్నరో.. కారణం ఏదైనా ప్రజలకు మోడీ పై ఉన్న నమ్మకమే 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ఆ స్థాయిలో విజయం దక్కిందని చెప్పాలి. మతతత్వ పార్టీ అనే ముద్ర ఉన్నప్పటికీ ఈ స్థాయిలో ప్రజామోదం పొందడం అంటే.. కచ్చితంగా దేశప్రయోజనాల విషయంలో సామాన్యుడు మోడీని నమ్మాడనే అనాలి. అయితే తాజాగా తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం, అనంతరం పూట పూటకూ తీసుకుంటున్న కొత్త కొత్త నిర్ణయాలు, రోజుకో సారి ఆయా నిర్ణయాలకు చేస్తున్న సవరణలతో మోడీ అండ్ కో నిర్ణయాలపై విమర్శలు పెరిగిపోతున్నాయి.

ఈ విషయంలో రాహుల్ గాంధీ - అరవింద్ కేజ్రీవాల్ - మమతా బెనర్జీలు పోటీపడి మంచి మార్కులు సంపాదించుకునే పనిలో బిజీగా ఉండగా... వీరికి ఏమాత్రం తగ్గకుండా కమ్యునిస్టులు మోడీపై విమర్శల్లో తీవ్రత పెంచారు. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి స్పందిస్తూ... ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్ల రద్దు పేరుతో కొత్త డ్రామాకు తెరలేపారని, రోజుకో నిబంధన పేరుతో ప్రజలను గందరగోళ పరుస్తున్నారని విమర్శించారు. సీపీఐ జాతీయ కౌన్సిల్ సమావేశాలను హైదరాబాద్ లో ప్రారంభించిన సందర్భంగా మాట్లాడిన ఆయన... ప్రధాని మోడీ అపరిపక్వతతో కూడిన నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. ఇదే క్రమంలో ఆర్మీ - సీబీఐ - రా చీఫ్ లను నియమించడంలో సీనియారిటీ - నిబంధనలు పాటించలేదని అన్నారు. దేశంలో గోహత్య పేరుతో దళితులపై దాడులు జరిగాయని చెప్పిన సురవరం... త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మతోన్మాద శక్తులకు బుద్ధి చెప్పాలని కోరారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News