బీజేపీలో చేరాలని వెళ్లిన రౌడీ..పోలీసులని చూసి!

Update: 2020-09-01 15:00 GMT
తమిళనాడు బీజేపీ పార్టీలో చేరికలు రోజురోజుకి పెరుగుతున్నాయి. తాజాగా పెరియార్ మనవడు సైతం బీజేపీ పార్టీలో చేరిన సంగతి తెల్సిందే. తాజాగా పలు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్న ఓ రౌడీ షీటర్‌ బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. అయితే అదే సమయంలో పోలీసులు అక్కడకు రావడంతో వారిని చూసి అక్కడ నుండి జారుకున్నాడు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.

పూర్తి వివరాలు చూస్తే .. తాజాగా ఆరు హత్య కేసుల్లో నిందితుడు అయిన సూర్య అనే వ్యక్తి బీజేపీలో చేరబోతూ, పోలీసులను చూసి జారుకున్నాడు. బీజేపీ తమిళనాడు శాఖ అధ్యక్షుడు ఎల్ మురుగన్ సమక్షంలో పార్టీలో చేరేందుకు వేదికపైకి వెళ్ళిన సూర్య అక్కడ ఉన్న పోలీసు అధికారులను చూసి తప్పించుకుని వెళ్లిపోయాడు. అతడు ఆరు హత్య కేసులతో పాటు మొత్తం 35 కేసుల్లో నిందితుడని పోలీసులు తెలిపారు. సూర్య బీజేపీలో చేరబోతున్నారని పోలీసులకు ముందే సమాచారం అందింది. దీంతో వెళ్లి వేదికను చుట్టుముట్టారు. దీనిని గమనించిన సూర్య ఓ కారులో పారిపోయారు. ఇక అక్కడ సూర్య సహచరులు నలుగురు ఉండగా.. వారిని అరెస్ట్ చేసి బెయిల్‌పై విడుదల చేశారు. మరోవైపు సూర్యపై సీఆర్‌పీసీ సెక్షన్ 41 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో వారెంట్ లేకుండా అతడిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇక ఈ విషయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మురగన్ మాట్లాడుతూ.. అతడు పార్టీలో చేరాలనుకున్న విషయం తనకు తెలీదని చెప్పుకొచ్చారు.
Tags:    

Similar News