సుష్మా స్వ‌రాజ్ క‌న్నుమూత‌...పాక్‌ లోనూ నివాళులు

Update: 2019-08-06 17:57 GMT
భారతీయ జనతా పార్టీకి చెందిన మహిళా నేతలలో అగ్రగణ్యురాలైన సుష్మాస్వరాజ్ క‌న్నుమూశారు. పార్టీ సిద్ధాంతాల‌కు క‌ట్టుబ‌డి ఉండ‌టానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో....ప్ర‌జా సేవ‌కూ అంతే ప్రాధాన్యం ఇస్తూ...ప్రాంతాల‌కు అతీతంగా అభిమానుల‌ను క‌లిగి ఉన్న సుష్మా స్వ‌రాజ్..మంగ‌ళ‌వారం తుది శ్వాస విడిచారు. గుండెపోటుకు గురవడంతో చికిత్స నిమిత్తం ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆమె తుదిశ్వాస విడిచారు. కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ - హర్షవర్ధన్ ఎయిమ్స్‌కు చేరుకుని పరిస్థితి సమీక్షిస్తున్నారు.

సుష్మాస్వ‌రాజ్ 1952, ఫిబ్రవరి 14న హర్యానా లోని అంబాలా కంటోన్మెంటులో జన్మించారు. కేంద్రమంత్రిగాను, ఢిల్లీ ముఖ్యమంత్రిగాను పనిచేసిన సుష్మాస్వరాజ్ వర్తమాన భారతదేశపు మహిళా రాజకీయ నేతలలో ప్రముఖురాలు. 1970లో రాజకీయ రంగప్రవేశం చేసిన సుష్మా విద్యార్థి సంఘం నాయకురాలిగా ఉంటూ ఇందిరాగాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టి 1977లో తొలిసారిగా హర్యానా రాష్ట్ర శాసనసభలో కాలుపెట్టారు. అదే సంవత్సరంలో కేంద్రంలో ఏర్పాటైన జనతా ప్రభుత్వంలో స్థానం సంపాదించారు. 1996 - 98లలో వాజపేయి మంత్రివర్గంలలో కూడా ఈమెకు చోటు లభించింది. 1998లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2014 మే 26 నాడు నరేంద్రమోడి కేబినెట్‌లో కేంద్రమంత్రిగా నియమితుల‌య్యారు. సుష్మాస్వరాజ్ మోడీ ప్రభుత్వంలో విదేశీ వ్యవహారాల మంత్రిగా పని చేశారు.

మధ్యప్రదేశ్‌లోని విదిశా లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా కొనసాగిన సుష్మా స్వరాజ్‌ ఆరోగ్య కారణాలతో ఇటీవ‌ల జ‌రిగిన‌ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. సుష్మా స్వరాజ్‌కు రెండేళ్ల కిందట ఢిల్లీలోని ఎయిమ్స్‌ వైద్యులు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ చికిత్స నిర్వహించారు. ఆమె చివరిసారిగా కశ్మీర్ విభజన పై స్పందిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. తన జీవితకాలంలో ఇటువంటి రోజు కోసమే ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. ప‌లువురు పాక్ పౌరుల‌కు సైతం వైద్యం కోసం ఆమె వీసా స‌హాయం చేశారు. సుష్మా మృతిప‌ట్ల ప‌లువురు పాక్ పౌరులు సైతం నివాళులు అర్పించారు.
Tags:    

Similar News