వరుస విషాదాలు:రెండు వారాలు..ఇద్దరు మాజీ సీఎంలు

Update: 2019-08-07 04:22 GMT
రెండు వారాల వ్యవధిలో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు ఒకరి తర్వాత ఒకరుగా తుదిశ్వాస విడిచిన తీరు కలిచివేస్తోంది. దేశ వ్యాప్తంగా సుపరిచితులు.. అత్యున్నత స్థానాల్ని అధిష్ఠించిన మహిళా నేతలు పక్షం వ్యవధిలో దేశ ప్రజల్ని విడిచిపెట్టి వెళ్లటం జీర్ణించుకోలేని పరిస్థితి. ఒకరు అమ్మగా.. మరొకరు చిన్నమ్మగా సుపరిచితులైన ఈ ఇద్దరు మహిళా నేతల నిష్క్రమణం తాలుకూ లోటును ఎప్పటికి తీర్చలేం.

దేశ రాజకీయాల్లోనూ.. ముఖ్యంగా ఢిల్లీ రాష్ట్ర రాజకీయాల మీద తమదైన ముద్రను వేసిన షీలా దీక్షిత్.. సుష్మా స్వరాజ్ లు ఇద్దరూ పక్షం వ్యవధిలో కన్నుమూశారు. షీలాదీక్షిత్ పేరు విన్నంతనే ఢిల్లీ రాష్ట్రానికి తిరుగులేని నేతగా గుర్తుకు వస్తారు. హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా ఆమె గుర్తుండిపోతారు. అదే సమయంలో సుష్మా స్వరాజ్ పేరు విన్నంతనే చాలామంది మాజీ కేంద్ర మంత్రిగా.. విదేశీ వ్యవహారాల మంత్రి పదవికి సరికొత్త ఇమేజ్ తెచ్చిన మహిళా నేతగా గుర్తుండిపోతారు.

చాలామందికి గుర్తుండని విషయం ఏమంటే.. సుష్మా స్వరాజ్.. షీలా దీక్షిత్ కంటే ముందే ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. వాజ్ పేయ్ హయాంలో ఉల్లిగడ్డల ధరలు మండిపోవటం.. ఉల్లి ధరల కారణంగా వాజ్ పేయ్ సర్కారు మీద తీవ్రమైన ప్రభావమే కాదు.. వ్యతిరేకత దేశ ప్రజల్లో వ్యక్తమైంది. కేజీ ఉల్లిపాయలు వందకు పైగా పలికిన రోజులవి. ఆ కారణంగా తీవ్రమైన ప్రజావ్యతిరేకత కారణంగా ఢిల్లీ రాష్ట్రంలో సుష్మా స్వరాజ్ అధికారం చేజారింది. ఉల్లి ధరలు మంట పుట్టించే వేళలో.. చౌక ధరల దుకాణాలు ఏర్పాటు చేసి.. ప్రజలకు ఉల్లిని అందుబాటులోకి తెచ్చినా.. వారి ఆగ్రహం కారణంగా పవర్ చేజారింది. 1998లో ఢిల్లీ ఎన్నికలకు 40 రోజుల ముందు ముఖ్యమంత్రిగా బాధ్యతల్ని స్వీకరించినప్పటికీ.. ఉల్లి ధరల కారణంగా వ్యతిరేకతను ఎదుర్కొన్నారు.

ఢిల్లీ రాష్ట్రానికి నాలుగో ముఖ్యమంత్రిగా సుష్మా స్వరాజ్ సేవలందిస్తే.. ఐదో ముఖ్యమంత్రిగా షీలా దీక్షిత్  బాధ్యతలు స్వీకరించారు. వరుస పెట్టి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా షీలా కొనసాగారు. తర్వాతి కాలంలో సుష్మా జాతీయ రాజకీయాల మీదనే ఫోకస్ చేశారు. 2014లో మోడీ సర్కారులో కీలకమైన విదేశాంగ శాఖా మంత్రిగా తనదైన ముద్ర వేసిన సుష్మా.. పాక్ లో ఉండిపోయిన భారత మూగబాలిక గీతను భారత్ కు రప్పించటంలో కీలకభూమిక పోషించటమే కాదు.. దేశం ఏదైనా కానీ భారతీయులు కష్టంలో ఉన్నారన్నంతనే ఆపన్న హస్తం అందించిన ఆమె.. అందరికి చిన్నమ్మగా మారారని చెప్పాలి. తెలంగాణ చిన్నమ్మగా సుపరిచితురాలైన సుష్మా.. తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్ లో మంగళవారం రాత్రి హటాత్తుగా కన్నుమూయటం తెలిసిందే.
Tags:    

Similar News