ఇటీవలి కాలంలో కొద్దికొద్దిగా కుదుటపడుతున్న అమెరికాలో హఠాత్తుగా కాల్పుల కలకలం రేగిన సంగతి తెలిసిందే. అమెరికాలోని టెక్సాస్ చర్చిలో మారణహోమం జరిగింది. సదర్లాండ్ స్ప్రింగ్స్ చర్చిలో జరిగిన కాల్పుల ఘటనలో 26 మంది మృతిచెందగా, మరో 20 మంది గాయపడ్డారు. ఈ కాల్పుల కిరాతకుడిని 26 ఏళ్ల డెవిన్ కెల్లీగా గుర్తించారు. ఆయన గురించి అమెరికా అధికారులు ఆరాతీయగా...ఆసక్తికరమైన వివరాలు వెలుగులోకి వచ్చాయి.
అమెరికా అధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం డెవిన్ కెల్లీ అమెరికా సైన్యంలో పనిచేశాడు. 2010 నుంచి 2014 మధ్య కెల్లీ ఎయిర్ ఫోర్స్‌లో విధులు నిర్వర్తించాడు. 2012లో అతనిపై డొమెస్టిక్ వాయిలెన్స్ కేసు నమోదు అయ్యింది. భార్యను - కొడుకును కొట్టాడన్న కేసులో మిలిటరీ కోర్టు అతనికి శిక్ష వేసింది. అతని ప్రవర్తన చెడుగా ఉందని కోర్టు దృవీకరించింది. 12 నెలల జైలు శిక్ష విధించింది. మిలిటరీ ర్యాంక్ స్టేటస్ ను కూడా తగ్గించింది. అప్పటి నుంచి తీవ్ర మానసిక వత్తిడిలో ఉన్న కెల్లీ.. అజాల్ట్ రైఫిల్ ను ఎలా కొన్నాడన్నదే మిస్టరీగా మారింది.
గృహ హింస చట్టం కింద కేసు నమోదు అయిన వారికి అమెరికా చట్టాల ప్రకారం ఆయుధాలు అమ్మరాదు. కానీ రూజర్ మోడల్ ఏఆర్-556 రైఫిల్ తో కెల్లీ విచక్షణారహితంగా చర్చిలో కాల్పులు జరిపాడు. అయితే కెల్లీ ఏ విధంగా రైఫిల్ ను కొన్నాడన్నదే ప్రశ్నార్థకంగా మారింది. 2016లో సాన్ ఆంటోనియో స్పోర్టింగ్ గూడ్స్ స్టోర్ లో కెల్లీ గన్ కొన్నట్లు తెలుస్తోంది. అయితే బ్యాక్ గ్రౌండ్ చెక్ జరుతున్న సమయంలో తనపై ఎటువంటి క్రిమినల్ హిస్టరీ లేదని చెప్పాడట. వ్యక్తిగత జీవితం దెబ్బతినడం, ఉద్యోగంలో సమస్యల కారణంగానే ఈ చర్యకు పాల్పడి ఉంటారని విశ్లేషిస్తున్నారు.