గెస్ట్ హౌస్ లో 11 మందిని చంపేయ‌మ‌న్న కిష‌న్ రెడ్డి?

Update: 2019-01-24 04:30 GMT
అదిరిపోయే స్క్రిప్ట్ అయిన‌ప్ప‌టికీ వాస్త‌వానికి ఏ మాత్రం పొస‌గ‌ని రీతిలో ఉంటే ప్రేక్ష‌కుడు ఏ మాత్రం భ‌రించ‌లేడు. మూడు గంట‌లు చూసే సినిమాకే ఇలా ఉంటే.. నిజ జీవితంలో నోటి నుంచి వ‌చ్చే మాట అచ్చు సినిమా స్క్రిప్ట్ మాదిరి ఉంటే ఏం వ‌ర్క్ వుట్ అవుతుంది చెప్పండి. ఈవీఎంల్ని హ్యాక్ చేయించి బీజేపీ అధికారాన్ని హ‌స్త‌గ‌తం చేసుకుందంటూ లండ‌న్‌లో వీడియో కాల్ ప్రెస్ మీట్ పెట్టి సంచ‌ల‌నం సృష్టించిన స‌య్య‌డ్ సుజా.. తాజాగా మ‌రో బాంబ్ పేల్చారు.
ఈవీఎంల‌ను హ్యాక్ చేయొచ్చంటూ.. అందులోని బ‌గ్ ను గుర్తించిన త‌న తోటి వారిని దారుణంగా హ‌త్య చేశార‌ని.. ఒక గెస్ట్ హౌస్ లో బీజేపీ నేత కిష‌న్ రెడ్డి ఆదేశాల‌తో 11 మందిని హ‌త్య చేసిన‌ట్లుగా ఆరోపించి సంచ‌ల‌నం సృష్టించారు. దీనికి సంబంధించి ఒక ఈ మొయిల్ ను కాంగ్రెస్ నేత‌.. మాజీ కేంద్ర‌మంత్రి క‌పిల్ సిబ‌ల్ కు సుజా పంపిన‌ట్లుగా తెలుస్తోంది. ఈ  స‌మాచారాన్ని క‌పిల్ సిబ‌ల్ మీడియాకు విడుద‌ల చేశారు.

ఒక బీజేపీ ఎమ్మెల్యే (ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లుగా చెబుతున్న స‌మ‌యంలో) త‌న బావ‌మ‌రిది గెస్ట్ హౌస్ లో 11 మందిని హ‌త్య చేయ‌గా.. తాను మాత్రం త‌ప్పించుకొని అమెరికాకు వెళ్లిపోయిన‌ట్లుగా సుజా పేర్కొన్నారు. ఆయ‌న ఆరోప‌ణ‌లు అతికిన‌ట్లుగా లేక‌పోవ‌టం.. ఆయ‌న చెప్పే మాట‌ల‌కు సంబంధించిన ఆధారాలు ఏ ఒక్క‌టి మ్యాచ్ కాక‌పోవ‌టం హాట్ టాపిక్ గా మారింది.

బుధ‌వారం ఉద‌యం టీవీ ఛాన‌ళ్ల‌లో కాసేపు బ్రేకింగ్ న్యూస్ లంటూ ఉద‌ర‌గొట్టిన‌ప్ప‌టికీ.. సుజా ఆరోప‌ణ‌ల్లో వీస‌మొత్తు వాస్త‌వం కూడా లేద‌న్న మాట‌ల‌తో ఛాన‌ళ్లు కామ్ అయిపోయాయి. ఈవీఎంల‌ను హ్యాక్ చేయొచ్చ‌న్న దానిని.. ఎలా అన్న‌ది చేత‌ల్లో చేసి చూపించ‌కుండా మాట‌ల‌తో హ‌డావుడి చేసిన సుజా.. ఈ ధ‌ఫా మ‌రిన్ని కాక‌మ్మ క‌బుర్ల‌ను.. వండి వార్చిన స్క్రిప్ట్ ను బ‌య‌ట‌కు వ‌దిలి కాసేపు అల‌జ‌డి సృష్టించారు. అయితే.. ఇదంతా ఏప్రిల్ 1న చేసి ఉంటే.. కాస్త సంద‌ర్భోచితంగా ఉండేది. ఇంత‌కీ సుజా చేసిన ఆరోప‌ణ‌లు ఏమిటి?  అందులో వాస్త‌వం ఎంత‌న్న‌ది త‌ర‌చి చూస్తే..

ఆరోప‌ణ 1

గత సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈవీఎంలను హ్యాక్‌ చేయవచ్చా..? అనే విషయమై సాంకేతిక అధ్యయనం చేయాలని ఓ ప్రాజెక్టు అప్పగించారు. దాని పేరు ‘‘ప్రాజెక్ట్‌ ఎంఎస్‌7బీ’’. మా టీమ్‌ లో మొత్తం 13 మంది సభ్యులు. చేయవచ్చని నిరూపిస్తూ మేం మాకు అప్పగించిన పనిని పూర్తి చేశాం.. ఆ మరుసటి రోజే... మమ్మల్నందరినీ హైదరాబాద్‌ లోని ఓ నాయకుడు పిలిపించాడు. వెళ్లిన వెంటనే మా అందరిపై గన్‌ మెన్‌ తో కాల్పులు జరిపించాడు. 11 మంది అక్కడికక్కడే చనిపోయారు. నేను తప్పించుకున్నాను.

ఆరోప‌ణ 2

ఆ కాల్పులు జరపమని ఆదేశించిన వ్యక్తి... బీజేపీ నాయకుడు జీ కిషన్‌ రెడ్డి.  స్పాట్ ఎక్క‌డంటే.. ఉప్పల్‌ సమీపంలో ఉన్న అతని బావమరిది కాకిరెడ్డి గెస్ట్‌ హౌస్‌. మ‌మ్మ‌ల్ని అక్క‌డ‌కు రావాల‌ని పిలిచింది విన్‌ సొల్యూషన్స్‌. ఆహ్వానించిన వ్య‌క్తి ఆ సంస్థ అధినేత కమల్‌ రావు.

లాజిక్ మిస్ అయిన పాయింట్ నెంబ‌ర్ 1

సయ్యద్‌ సుజా వయసు 37 సంవత్సరాలు. తలిదండ్రుల పేర్లు : యూసఫ్‌ అహ్మద్‌ సయ్యద్‌ - ఖుదీసా సయీదా. తండ్రి భెల్‌ లో ఉద్యోగి. సుజా హైదరాబాద్‌ జేఎన్‌ టీయూలో ఆర్ ఎఫ్‌ (రేడియో ఫ్రీక్వెన్సీ) కమ్యూనికేషన్స్‌ లో మాస్టర్స్‌ చేశారు. మ్యాథ్స్‌ లో మైనర్‌ పీహెచ్‌ డీ పూర్తయింది. 2009లో విన్‌ సొల్యూషన్స్‌ లో చేరారు. తదుపరి జనరేషన్ ఎల‌క్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల త‌యారీకి సంబంధించిన ప్రాజెక్టును ఈసీఐఎల్‌... విన్‌ సొల్యూషన్‌ అనే కంపెనీకి అప్పగించింది. ఇది కమల్‌ రావు అనే వ్యక్తికి సంబంధించిన సంస్థ. ఈ ప్రాజెక్టు పేరు ఎంఎస్ 7బీ. ఇందులో పని చేసిన 13 మందిలో సయ్యద్‌ సుజా

వాస్త‌వం నెంబ‌ర్ 1

సుజా చేసిన ఆరోప‌ణ‌ల‌కు సంబంధించి జేఎన్ టీయూ రికార్డుల్లో ఎక్క‌డా సుజా స‌మాచారంతో స‌రిపోవ‌టం లేద‌న్న‌ది స‌మాచారం.

లాజిక్ మిస్ అయిన పాయింట్ నెంబ‌ర్ 2

ఈసీఐఎల్‌ ప్రధాన కార్యాలయం ఉన్న సనత్‌ నగర్‌ ప్రాంతంలోనే వేర్వేరు చోట్ల మేం పని చేశాం.
 
వాస్త‌వం నెంబ‌ర్ 2

ఈసీఐఎల్‌ సనత్‌ నగర్‌ లో లేదు.. కాప్రాలో ఉంది

లాజిక్ మిస్ అయిన పాయింట్ నెంబ‌ర్ 3

2014 సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ మే 12న ముగిసింది. ఆ త‌ర్వాతి  రోజే...మే 13 ఉదయం ప్రాజెక్ట్‌ ఎంఎస్ 7బీ సభ్యులు హైదరాబాద్‌ ఉప్పల్‌ లోని లిటిల్‌ ఫ్లవర్‌ జూనియర్‌ కాలేజీ సమీపంలో ఉన్న కాకిరెడ్డి అనే వ్యక్తి గెస్ట్‌ హౌస్ కు  వెళ్లారు. అది... బీజేపీ నేత కిషన్‌ రెడ్డి బావమ‌రిదిది. వారున్న గదిలోకి కమల్‌ రావు - కిషన్‌ రెడ్డి - మరొకరు వచ్చారు. వచ్చీ రాగానే... ‘చంపేయ్‌ అందరినీ’ అని కిషన్‌ రెడ్డి ఆదేశించారు. అంతే... బుల్లెట్ల వర్షం కురిసింది. 11 మంది చనిపోయారు.

వాస్త‌వం నెంబ‌ర్ 3

ఒక‌వేళ నిజంగానే ఆ ఘ‌ట‌న జ‌రిగింద‌నుకుందాం. మ‌రి.. మ‌ర‌ణించిన 11 మందికి సంబంధించిన ఏ ఒక్క మిస్సింగ్ కేసు న‌మోదు కాక‌పోవ‌టం ఏమిటి?  కిష‌న్ రెడ్డి మీద ఇప్ప‌టి వ‌ర‌కూ క్రిమిన‌ల్ రికార్డ్ అన్న‌ది లేద‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌ని అంశం.

లాజిక్ మిస్ అయిన పాయింట్ నెంబ‌ర్ 4

కాల్పుల‌ ఘటనలో సయ్యద్‌ సుజాకు కూడా బుల్లెట్‌ గాయాలయ్యాయి. అందరినీ వ్యాన్‌లో తరలించారు. వ్యాన్‌ ఒకచోట ఆగినప్పుడు నేను తప్పించుకున్నాను. రాత్రంతా ఒక ట్రక్‌ లో ఉన్నాను. మిగిలిన వారితో పోల్చితే నా రక్తం త్వరగా గడ్డకడుతుంది. దీనిని గోల్డెన్‌ టైప్‌ బ్లడ్‌ అంటారు. అందుకే, ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం రాలేదు. మే 15వ తేదీన ఢిల్లీ నుంచి ఎయిర్‌ ఇండియా విమానం ద్వారా షికాగోకు వెళ్లాను.  అక్కడ సుజా 18 రోజులు ఆస్పత్రిలో - 16 రోజులు పోలీసుల అదుపులో (డిటెన్షన్‌) ఉన్నారు. 2014 జూన్‌ 17న విడుదలయ్యారు.

వాస్త‌వం నెంబ‌ర్ 4

కాల్పుల్లో గాయ‌మైతే.. ఎంత ర‌క్తం త్వ‌ర‌గా గ‌డ్డ క‌ట్టే గుణం ఉన్నా.. శ‌రీరం లోప‌లి బుల్లెట్లు అయితే బ‌య‌ట‌కు తీయాలిగా. మ‌రి.. ఆ ప‌ని ఎక్క‌డ జ‌రిగింది?  ఒక‌వేళ సుజా చెప్పింది నిజ‌మే అనుకుందాం. మ‌రి.. ఈ ఆరోప‌ణ‌ల‌కు సంబంధించి తాను ప‌ని చేసిన కంపెనీల ప‌త్రాలు.. అవి లేవ‌న‌నుకుందాం.. క‌నీసం షికాగో వెళ్ల‌టానికి ట్రావెల్ చేసిన ఎయిర్ టికెట్ అయినా బ‌య‌ట పెట్టాలిగా. అలా కాకుండా.. కేవ‌లం మాట‌లు త‌ప్పించి.. స‌రైన ఆధారాలు ఏ ఒక్క‌టి విడుద‌ల చేయ‌క‌పోవ‌టం.


Full View

Tags:    

Similar News