టీఎస్సార్ మాట‌!... కాంగ్రెస్‌ ను వీడేది లేదు!

Update: 2017-09-10 09:16 GMT
కళాబంధు టి.సుబ్బిరామిరెడ్డి తెలుసు కదా! గతంలో అంటే 1996-98 - 1998-99లో రెండుసార్లు విశాఖపట్నం నుంచి ఆయన లోక్ సభకు ఎన్నికైన సంగతి తెలిసిందే. మొదటి నుంచి ఆయనకు విశాఖపట్నం మీద తగని మక్కువ. రకరకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలు  - అవార్డుల ఫంక్షన్లు ఆయన అక్కడే నిర్వహించేవారు. 2009 ఎన్నికల్లో అక్కడి నుంచే పోటీ చేస్తానని చెప్పుకునేవారు. అయితే అనూహ్యంగా 2009 సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం వ్యవస్థాపకుడు - ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి రాకతో విశాఖపట్నం నుంచి పోటీ చేసే అవకాశాన్నికోల్పోయిన విషయం తెలిసిందే. 2009లో ఆమె విశాఖపట్నం నుంచి కాంగ్రెస్ తరపున లోక్ సభకు ఎంపికై మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

టి.సుబ్బిరామిరెడ్డి మాత్రం సాధారణ ఎన్నికల్లో పోటీ చేయకుండా 2008 లోనే కాంగ్రెస్ తరపున రాజ్యసభకు ఎంపికయ్యారు. మళ్లీ తిరిగి అంటే ఆరేళ్లకు 2014లో మరోమారు రాజ్యసభకు ఎంపికయ్యారు. 2020 వరకు ఆయన పదవీకాలం ఉంది. అయితే ఇప్పుడిదింతా ఎందుకంటారా! 2014లో రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ రెండు తెలుగు రాష్ర్టాల్లోనూ తన ప్రాభవాన్ని కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లో అయితే ఆ పార్టీ తరపున పోటీ చేసిన చాలామందికి డిపాజిట్లు కూడా దక్కలేదు. దీంతో టి.సుబ్బిరామిరెడ్డి కూడా తన రాజకీయ భవిష్యత్ కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు గత సాధారణ ఎన్నికల సమయంలోనే వార్తలు వినిపించాయి.

విశాఖపట్నం నుంచి సీటు కూడా ఖరారు అయిందని దీని కోసం.. పార్టీ మార‌డ‌మే త‌రువాయి అన్న కోణంలో గాసిప్స్ గుప్పుమన్నాయి. అయితే ఏమైందో ఏమో కానీ ఆయన కాంగ్రెస్ లోనే ఉండిపోయారు. తన సీటును కొట్టేసిన దగ్గుబాటి పురందేశ్వరి మాత్రం ఎంచక్కా బీజేపీలో చేరిపోయారు. తాజాగా నిన్నమీడియాతో మాట్లాడిన ఆయన తాను పార్టీ మారనని, కాంగ్రెస్ లోనే ఉంటానని ముక్తాయించడం గమనార్హం.
Tags:    

Similar News