తారక్ ఎపిసోడ్ : అంతా ఎవ‌రు చేస్తున్నారు ?

Update: 2022-08-22 06:30 GMT
రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏమ‌యినా జ‌ర‌గ‌వ‌చ్చు అని అంటారు క‌దా ! ఆ విధంగా నిన్న‌టి వేళ ఆంధ్రాలో, తెలంగాణ‌లో ఏక కాలంలో పెను మార్పులే జ‌రిగేయి. అనూహ్య ప‌రిణామాలే చోటుచేసుకున్నాయి. నిన్న‌టి వేళ అంతా ఊహించ‌ని విధంగా ఓ అప్డేట్ రావ‌డంతో రాజ‌కీయ వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా మారిపోయింది. తెలుగు రాష్ట్రాల‌లో సుప‌ర‌చితులు అయిన న‌టుడు తార‌క్  ని అమిత్ షా (కేంద్రం హోం మంత్రి) త‌న వ‌ద్ద‌కు పిలిపించుకున్నారు. న‌ల‌భై ఐదు నిమిషాల పాటు మాట్లాడి పంపారు. త‌రువాత ఆయ‌నొక గొప్ప ప్ర‌తిభావంతుడు అయిన న‌టుడు అని అమిత్ షా ట్వీట్ కూడా చేశారు. ఇదొక ఆస‌క్తిక‌ర ప‌రిణామం.

ఎప్ప‌టి నుంచో తార‌క్ పై కొన్ని అనుమానాలున్నాయి. ఎందుకంటే ఆయ‌న స్నేహితులు అయిన నిర్మాత‌లు కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీ (దిగ్గ‌జ సీమ నేత ప‌రిటాల ర‌వి ముఖ్య అనుచ‌రులు) ఇద్ద‌రూ కూడా జ‌గ‌న్-తోనే ఉన్నారు.

క‌నుక తారక్ స‌పోర్ట్ కూడా జ‌గ‌న్ కే ఉంటుందన్న‌ది కొందరు టీడీపీ అభిమానుల ఆవేదన, విమర్శ. అందుకే భువ‌న‌మ్మ‌ను వైసీపీ తిట్టిపోసినప్పుడు కూడా తార‌క్ పెద్ద‌గా రియాక్ట్ అయిన తీరు టీడీపీ వారికి నచ్చలేదు.  అప్ప‌ట్లో తారక్ విడుద‌ల చేసిన వీడియోలో ప‌స‌లేదు అని తేలిపోయింది.  

ఏదేమైనా ట్రిపుల్  ఆర్ సినిమాకు కూడా తెలుగుదేశం కార్య‌క‌ర్త‌లూ, నాయ‌కులూ మ‌ద్ద‌తుగానే ఉన్నారు. ఇక తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో ఒకే దెబ్బ‌కు రెండు పిట్ట‌లు అన్న విధంగా గ‌న్ షాట్  పాలిటిక్స్ చేస్తున్నారు అమిత్ షా అని తేలిపోయింది. ఇక్క‌డ కేసీఆర్ కు, అక్కడ చంద్ర‌బాబుకు ఏక కాలంలో ఝ‌ల‌క్ త‌గిలించారు నిన్న‌టి వేళ. దీంతో ఆ రెండు పార్టీలూ అప్ర‌మ‌త్తం అయిపోయాయి. టీడీపీ నుంచి పెద్ద‌గా ఈ ప‌రిణామం పై పోస్టులు రాక‌పోయినా, కేసీఆర్ శ్రేణులు మాత్రం అల‌ర్ట్ అయి ఉన్నాయి.

ఒక‌వేళ తార‌క్ ను పొర‌పాటున టార్గెట్ చేస్తే బీజేపీతో కోరి క‌య్యం తెచ్చుకున్నవార‌మ‌వుతామ‌ని భావిస్తూ నిన్న‌టి వేళ చంద్ర‌బాబు వ‌ర్గాలు సైలెంట్ అయిపోయార‌ని ఒక చర్చ నడుస్తోంది. మ‌రోవైపు తార‌క్, అమిత్ షా మ‌ధ్య సాగిన భేటీ వెనుక మీడియా   రామోజీ ఉన్నార‌న్న వార్త‌లూ ఉన్నాయి.

ఆయ‌న సూచ‌న‌ల మేర‌కే బీజేపీ హై కమాండ్ ఈ విధంగా చేసి ఉండ‌వ‌చ్చ‌న్న అభిప్రాయాలూ ఉన్నాయి. ఎలా చూసుకున్నా జూనియ‌ర్ త్వ‌ర‌లో ఓ రాజ‌కీయ ప్ర‌త్యామ్నాయ శ‌క్తి కాబోతున్నాడు అన్న చర్చ అయితే మొదలైపోయింది.
Tags:    

Similar News