గ్రౌండ్ రిపోర్ట్: తాడిపత్రిలో రణరంగమే..

Update: 2019-03-23 12:44 GMT
అసెంబ్లీ నియోజకవర్గం : తాడిపత్రి

టీడీపీ : జేసీ అస్మిత్ రెడ్డి
వైసీపీ : కేతిరెడ్డి పెద్దారెడ్డి

రెండూ రెడ్డి సామాజికవర్గ కుటుంబాలే.. 40 ఏళ్ల శత్రుత్వం వారిది.. పైగా రాయలసీమ ఫ్యాక్షన్ పడగ.. అనంతపురం జిల్లా తాడిపత్రి ఎన్నికలంటేనే రణరంగాన్ని తలపిస్తాయి. రెండు బలమైన కుటుంబాలే రాష్ట్రంలో ఏ పార్టీలు ఉన్నా ఆ పార్టీల తరుఫున విడివిడిగా పోటీపడుతూ అగ్గి రాజేస్తాయి. తాడిపత్రిలో జేసీ కుటుంబం వర్సెస్ కేతిరెడ్డి కుటుంబాలు 40 ఏళ్లుగా కొట్లాడుకుంటున్నాయి. ఈ ఎన్నికల వేళ సైతం ఢీ అంటే ఢీ అంటున్నాయి.

*తాడిపత్రి చరిత్ర

2004లో తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్  రెడ్డి కాంగ్రెస్ తరుఫున బరిలోకి దిగగా.. టీడీపీ తరుఫున కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి పోటీచేశారు. ఉత్కంఠగా సాగిన ఈ ఎన్నికల్లో జేసీ 7వేల ఓట్లతో  మాత్రమే గెలిచారు. ఆ తర్వాత సూర్యప్రతాప్ రెడ్డి హత్యకు గురయ్యారు. ప్రస్తుతం 2019 అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యప్రతాప్ రెడ్డి సోదరుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి వైసీపీకి మారి  బరిలోకి దిగుతుండగా.. టీడీపీ నుంచి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు జేసీ అస్మిత్ రెడ్డి పోటీపడుతున్నారు.

*జేసీ వర్సెస్ పెద్దారెడ్డి

తాడిపత్రిలో మొత్తం 220818 ఓట్లు ఉన్నాయి. ఇందులో 40వేల రెడ్డి ఓట్లు కీలకంగా ఉన్నాయి. టీడీపీ, వైసీపీ అభ్యర్థులిద్దరూ రెడ్లు కావడంతో మిగతా కులాల ఓట్లే ఇక్కడ కీలకం.. మైనార్టీలు జేసీ ఫ్యామిలీకి.. బీసీలు కూడా జేసీకే అండగా ఉన్నారు. వైసీపీకి జేసీపై ఉన్న వ్యతిరేక ఓటే ప్రధానంగా కనిపిస్తోంది. వైసీపీ అభ్యర్థికి టీడీపీ నుంచి వలసవచ్చిన నేతల సపోర్ట్ లభించింది. ఇక ప్రభోదానంద శిష్యులు, ఆధ్యాత్మిక వాదుల సాన్నిహిత్యంతో ఈయన బలంగానే ఉన్నారు. ముఖ్యంగా  రెడ్డీల తర్వాత అత్యధికంగా ఉన్న 25500 ఎస్సీల ఓట్లు వైసీపీ పెద్దారెడ్డికి మద్దతుగా ఉండడం కలిసివచ్చే అంశంగా చెప్పవచ్చు.

* టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి

+అనుకూలత :

తరచూ సేవా కార్యక్రమాలు చేయడం
ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అండదండలు
తండ్రి, ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నీ తానై వ్యవహరించడం..
ఉన్నత విద్యావంతుడు కావడం ప్లస్

+మైనస్ ఇవే

-తండ్రి చాటు బిడ్డగా అస్మిత్ రెడ్డి పని చేస్తున్నాడన్న విమర్శలు
-అస్మిత్ రెడ్డి అభ్యర్థిత్వం నచ్చక టీడీపీని వీడిన నేతలు

* వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి

+అనుకూలతలు

జేసీ ఫ్యామిలీకి వ్యతిరేకమైన ప్రబోధనందా శిష్యుల మద్దతు
టీడీపీ నుంచి పలువురు నేతలు అస్మిత్ రెడ్డి నచ్చక వైసీపీలో చేరడం

+ప్రతికూలతలు

ఫ్యాక్షనిస్టు, రౌడీషీటర్ అనే గుర్తింపు.. పోలీస్ కేసుల్లో ఉండడం మైనస్
ఇక స్థానికేతరుడు అన్న సెంటిమెంట్ బాగా పనిచేస్తోంది.

*ఎవరు గెలుస్తారో చెప్పడం కష్టం

తాడిపత్రిలో 2014 ఎన్నికల్లో జేసీ ఫ్యామిలీ హవా నడిచింది. టీడీపీ గాలి తోడైంది. ఈసారి మాత్రం టీడీపీకి అంతగా పరిస్థితులు లేవు. తాడిపత్రిపై వైసీపీ జెండా ఎగురవచ్చు అంటున్నారు. కానీ టీడీపీని తక్కువ అంచనా వేయడానికి లేదు. జేసీ ఫ్యామిలీకి కొండంత అండ ఉంది. దీంతో ఎవరూ గెలిచినా రెండు మూడు వేల ఓట్ల తేడాతోనే గెలవచ్చు అన్న చర్చ సాగుతోంది.


Tags:    

Similar News