మహిళల కళ్లు తప్ప ఇంకేం కనిపించినా వారింట్లోని పురుషులకు కఠఇన శిక్షలు..!

Update: 2022-05-10 02:30 GMT
అందరూ అనుకున్నట్లుగా ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ల పాలన సాగుతోంది. వారు బలవంతంగా అధికారంలోకి వచ్చాక.. పౌర హక్కులు పూర్తిగా హరించి వేశారు. మహిళలపై ఆంక్షలు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. అడుగడుగునా ఆంక్షలతో తాలిబన్లు దేశంలో అరాచకం సృష్టిస్తున్నారు. అడుగు తీసి అడుగు బయట పెట్టలేని దుస్థితి తలెత్తింది. అందులో భాగంగా తాజాగా జారీ చేసిన డిక్రీ.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అఫ్గానిస్థాన్ లో మహిళల దుస్థితిని కళ్లకు కడుతోంది. బుర్ఖా ధరించకుండా మహిళలు ఇంటి నుండి బయట అడుగు పెడితే ఆ ఇంట్లోని పురుషులు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తాలిబన్లు హెచ్చరించారు.

అఫ్గానిస్థాన్ లో పరిస్థితులు నానాటికీ మరింత దిగజారుతూనే ఉన్నాయి. తాలిబన్ల పాలన అరాచకానికి పరాకాష్ఠగా మారింది. గత ఏడాది తాలిబన్లు కాబూల్ ను  ఆక్రమించుకున్నప్పుడు ప్రజలు ప్రాణాలకు తెగించి మరీ అమెరికా విమానాలు ఎందుకు ఎక్కారో ఇప్పుడు ప్రపంచానికి  అర్థం అవుతోంది. అప్ఘానిస్తాన్ లో ఇప్పుడు తిండి లేక అక్కడి ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు. పని చేద్దామంటే పని దొరకడం లేదు. పూట గడవడానికి నరకం అనుభవించాల్సి వస్తోంది.

కడుపు నింపుకునేందుకు చేతిలో చిల్లి గవ్వ లేక పోవడంతో అప్ఘాన్ పౌరులు అవయవాలు అమ్ముకుంటున్న వార్తలు అందరినీ కలిచి వేస్తున్నాయి. 10 నెలలుగా పరిస్థితి బాగుపడుతుందేమోనని ఎదురు చూస్తున్న వారికి నిరాశే ఎదురవుతోంది. ప్రజలు ఉపాధి లేక, చేతిలో చిల్లిగవ్వ లేక కనీసం తినేందుకు తిండి దొరక్క అవస్థలు పడుతుంటే వాటిపై దృష్టి పెట్టాల్సిన తాలిబన్లు... అర్థం పర్థం లేని ఆంక్షలు అమలు చేస్తున్నారు.

1990ల నాటికీ, ఇప్పటికీ వారి లో ఏ మార్పు కనిపించకపోవడం అప్ఘాన్ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అప్ఘాన్ ను హస్తగతం చేసుకున్నప్పుడు తాలిబన్లు చెప్పిన మాట ఏమిటంటే... ప్రజల అభిప్రాయలకు, అవసరాలకు అనుగుణంగా పాలన సాగిస్తామని హామీ ఇచ్చారు. వారికి నచ్చినట్లుగా పాలన ఉంటుందని చెప్పారు. అలాగే మహిళలు స్వేచ్ఛగా సంచరించేలా పాలన ఉంటుందని అన్నారు. అమ్మాయిలు చదువుకోవచ్చని, ఉద్యోగాలు చేసుకోవచ్చని, ఆంక్షల చట్రంలో బంధించబోమని కల్లబొల్లి మాటలన్నీ చెప్పారు.

కానీ ప్రభుత్వ ఏర్పాటు తర్వాత తాలిబన్లు ఈ హామీలకు ఎప్పుడో తిలోదకాలు ఇచ్చారు. ప్రజల అవసరాలను ఏమాత్రం లెక్క చేయకుండా ఇష్టారీతిగా పాలన సాగిస్తున్నారు. అమెరికా సేనలు అఫ్ఘాన్ లో అడుగు పెట్టక ముందు దేశం ఎలా ఉందో. మళ్లీ అలాంటి స్థితి లోకి తీసుకెళ్తున్నారు. మహిళల హక్కుల సంగతి పక్కన పెడితే.. కనీస అవసరాలను సైతం గుర్తించడానికి నిరాకరిస్తున్నారు.

మహిళలపై ఎక్కడ లేని ఆంక్షలు విధిస్తున్నారు. బుర్ఖా తప్పనిసరి చేశారు. తల నుండి అరికాలి వరకు బుర్ఖా కప్పుకోవాల్సిందే. కళ్లు మాత్రమే కనిపించాలి. తాలిబన్లు ఆదేశాలను కాదని ఎవరైనా బుర్ఖా వేసుకోకుండా బయట తిరిగితే వారిపై కఠిన శిక్షలు అమలు చేస్తున్నారు. వారి కుటుంబంలోని పురులకు శిక్షలు విధిస్తున్నారు తాలిబన్లు. మహిళలు ఇల్లు దాటి రావొద్దని హెచ్చరిస్తున్నారు. ఇలా ఒకటీ రెండూ కాదు తాలిబన్ల అరాచకాలకు అంతు లేకుండా పోతోంది. మహిళల కోసం  తాలిబన్లు కొత్తగా జారీ చేసిన ఆదేశాలను... వారి ఆలోచనలు ఎంత క్రూరంగా ఉన్నాయో తెలియజేస్తోంది.
Tags:    

Similar News