తాలిబన్లు అమలు చేసే షరియా చట్టంలో శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయంటే

Update: 2021-08-20 05:46 GMT
ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ల రాజ్యం కొనసాగుతుంది. అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రస్తుతం ప్రపంచం మొత్తం చూస్తుంది. తాలిబన్ల రాజ్యంలో ఉండే కంటే చనిపోవడమే మంచిది అనుకుంటూ ఆఫ్ఘన్ ప్రజలు విమానాల్లో ఇతర దేశాలకి తరలివెళ్తున్నారు. తాలిబన్ల రాజ్యంలో ప్రజాస్వామ్యానికి తావు ఉండదు. అక్కడ షరియా చట్టం ప్రకారం మాత్రమే పాలన సాగుతుంది. ఇరవై ఏళ్ల పాటు ఆధునిక ప్రజాస్వామ్య పాలనలో స్వేచ్ఛగా బతికిన అఫ్గానిస్థాన్‌ ప్రజలపై మళ్లీ షరియా చట్టాన్ని అమలు చేసేందుకు సిద్ధమయ్యారు తాలిబన్లు. ఈ ఇస్లామిక్ చట్టం అమలు కాబోతోందని తెలియగానే అక్కడి మహిళలు ప్రాణభయంతో భీతిల్లిపోతున్నారు.

ఈ నేపథ్యంలో అసలు షరియా చట్టం అంటే ఏంటి, తాలిబన్ల చట్టాలంటేనే ప్రజలు ఎందుకు వణికిపోతున్నారు, వంటి విషయాలు గురించి ఒకసారి మనం తెలుసుకుందాం ...

ఇస్లాంలో మూడు ముఖ్యమైన భాగాలున్నాయి
1. భగవంతుడు, మానవుల సృష్టి, మరణానంతరం జరిగే పరిణామాలు
2. ప్రార్థన, ఉపవాసాలు, దానాలు, యాత్రలు మొదలైనవి
3. మూడవది చట్టం (షరియా)
షరియా అంటే మార్గం అని అర్ధం. ఇది అరబ్బీ పదం నుంచి ఉద్భవించింది.

షరియా చట్టం అంటే ఏంటి :
షరియా చట్టం అనేది ఇస్లామిక్ చట్టానికి మరో పేరు అని భావిస్తుంటారు. కానీ ఇది రాతపూర్వక నియమావళి కాదు. షరియా అనేది పలు మూలాల నుంచి రూపొందించిన ఒక సూత్రాల సమూహం. ముఖ్యంగా ముస్లింల పవిత్ర గ్రంథమైన ఖురాన్‌ లోని అంశాలు, సున్నాహ్ లోని మహ్మద్ ప్రవక్త జీవితం, బోధనలు, అభ్యాసాల ఆధారంగా షరియా చట్టాన్ని రూపొందించారు. సున్నాహ్ లోని మహ్మద్ ప్రవక్త జీవితం, బోధనలు, అభ్యాసాల ఆధారంగా షరియా చట్టాన్ని రూపొందించారు. మతాన్ని ఎలా ఆచరించాలి, ప్రవర్తనా నియమాలు ఏంటి, చట్టపరమైన విషయాలను ఎలా ఆచరించాలి, వంటి విషయాలు ఇందులో ఉంటాయి. అలాగే దొంగతనం, అత్యాచారం, హత్యల్లాంటి నేరాలకు విధించే శిక్షలు, వివాహం, విడాకులు, వారసత్వ హక్కులను నిర్దేశించే కుటుంబ చట్టాలకు సంబంధించిన అంశాలూ షరియా చట్టంలో ఉంటాయి. ఇస్లాంలో ఉన్న ఈ చట్టాలన్నింటినీ కలిపే షరియా అని అంటారు.

అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను కొరడా దెబ్బలు కొట్టడం.. చేతులు, కాళ్లు నరికేయడం.. బహిరంగంగా ఉరి తీయడం వంటి క్రూరమైన శిక్షలు విధించారు. షరియా చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించినందుకు ఇలాంటి శిక్షలు విధించారు. షరియా చట్టం ప్రకారం మగవారు గడ్డం పొడవుగా పెంచకపోయినా నేరమే. మహిళల వస్త్రధారణపై చాలా కఠినమైన నిబంధనలు ఉంటాయి. ఈ నిబంధనలు అతిక్రమిస్తే.. బహిరంగంగా అవమానించడం నుంచి కొట్టడం వరకు శిక్షలు విధిస్తారు.

ఈ చట్టం ప్రకారం.. ఫొటోగ్రఫీ, మహిళల చిత్రాల ప్రదర్శనతో పాటు కళలు, వినోదాలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను నిషేధిస్తారు. చిన్న వయసు నుంచే బాలికలను పాఠశాలలకు వెళ్ళనివ్వరు. మహిళలు ఉద్యమాలు చేయరాదు. ఉద్యమాలు చేసేవారిని హౌస్ అరెస్ట్ చేస్తారు. ఆడవారు బహిరంగంగా ఒంటరిగా బయటకు వెళ్లకూడదు. ఒకవేళ బయటకు వెళ్తే కుటుంబ సభ్యులలోని మగవారితో కలిసి వెళ్ళాలి. మహిళలు తమ శరీరం కనిపించకుండా తల నుంచి కాళ్ల వరకూ బుర్ఖా నిండుగా ధరించాలి. అక్రమ సంబంధాలకు పాల్పడిన ప్రజలను రాళ్లతో కొట్టి చంపుతారు. దోపిడీలకు పాల్పడితే చేతులు నరికివేస్తారు.

కాబూల్‌ ను తాజాగా వశపరచుకున్న తాలిబన్లు 1996- 2001 మధ్య కాలంలో అమలు చేసిన పరిపాలనను తిరిగి అమలు చేస్తారని ప్రజలు భయపడిపోతున్నారు. గత పాలనకు ఇప్పుడు అమలు చేయబోయే పాలనకు సంబంధం లేదని చెబుతున్నప్పటికీ, ఇప్పటికే ప్రజలను ఉక్కుపాదంతో అణిచి వేస్తున్నారు. దేశాన్ని తమ కబంధ హస్తాల్లోకి తీసుకున్న కొద్ది గంటల వ్యవధిలోనే ప్రజలపై కర్కశత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. అందుకే వారి తాజా దురాక్రమణ ప్రజలందరినీ భయపెట్టిస్తోంది.

వ్యభిచారం లేదా వ్యభిచారంలో పాల్గొన్న వ్యక్తులకి తప్పనిసరిగా 100 కోరాడ దెబ్బలు ఉంటాయి. ఇక అవివాహితులైతే వారిని ఏడాది పాటు బహిష్కరణ లేదా వివాహం చేసుకుంటే రాళ్లతో కొట్టి చంపుతారు. అందుకే ఆఫ్గనిస్థాన్ ప్రజలు అక్కడ కొత్తగా కొలువుదీరుతున్న తాలిబన్లను చూసి పారిపోవడం లేదు..వారు అమలు చేయనున్న అత్యంత కఠినమైన షరియా చట్టాలను చూసి పారిపోతున్నారని అంతర్జాతీయ మీడియా సంస్థలు విశ్లేషిస్తున్నాయి.




Tags:    

Similar News