మీడియానూ వదలని తాలిబన్లు

Update: 2021-08-31 06:30 GMT
ఆఫ్ఘనిస్ధాన్లో తాలిబన్లు చివరకు మీడియాను కూడా వదలట్లేదు. ‘తాలిబన్ల ఇస్లామిక్ ఎమిరేట్స్ ప్రభుత్వాన్ని చూసి ఆప్ఘనిస్థాన్ ప్రజలు భయపడాల్సిన అవసరంలేదు’ అంటూ ఓ న్యూస్ ఛానల్ ఓ వార్తను ప్రసారం చేసింది. తాలిబన్ల ఇస్లామిక్ ప్రభుత్వాన్ని చూసి జనాలు భయపడాల్సిన అవసరం లేదని న్యూస్ చదివేటపుడు సదరు యాంకర్ వణికిపోయారు. న్యూస్ చదవడానికి యాంకర్ వణికిపోవాల్సి అవసరం ఏమిటి ? ఏమిటంటే వీపు వెనుక రెండు తుపాకులను పెట్టి తాలిబన్లు యాంకర్ తో వార్త చెప్పించారు కాబట్టి.

తాలిబన్లను చూసి జనాలు భయపడద్దని చెప్పటాన్ని కూడా తీవ్రవాదులు తుపాకులు గురిపెట్టి మరీ యాంకర్ తో చెప్పించటమే అరాచకానికి పరాకాష్ట. యాంకర్ న్యూస్ చదువుతున్నపుడు ఇద్దరు తీవ్రవాదులు యాంకర్ వెనుక తుపాకులు పట్టుకుని ఉన్న ఓ వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో స్పష్టంగా కనిపిస్తోంది. తుపాకుల దెబ్బకు సదరు యాంకర్ భయపడవద్దని వణికిపోతూ చదవటమే ఆశ్చర్యం.

న్యూస్ చదివేటపుడు తాము తుపాకులు పట్టుకుని టీవీ స్క్రీన్ పై కనబడకూడదన్న కనీస ఇంగితం కూడా తీవ్రవాదులకు లేకపోవడం విడ్డూరమే. తాజాగా బయటపడిన వీడియో క్లిప్పుంగు ప్రకారం తాలిబన్లు మీడియా మీద కూడా ఉక్కు పాదాన్ని పెట్టినట్లు అర్థమైపోతోంది. ఇప్పటికే మహిళా జర్నలిస్టులను ఉద్యోగాలు మానేయాలంటు పది రోజుల క్రితమే ఫత్వా జారీ చేశారు. ఈ విషయంలో నిరసనలు తెలిపినా తాలిబన్లు పట్టించుకోవటంలేదు.

తాము మారిపోయామని, తమను చూసి ఎవరు భయపడాల్సిన పనిలేదంటు తాలిబన్లు మొదట్లో చెప్పిందంతా అబద్ధాలే అని తేలిపోయింది. దేశంలోని ఒక్కో ప్రావిన్సును స్వాధీనం చేసుకునే క్రమంలో తాలిబన్లు మొదట్లో ప్రశాంతంగానే కనిపించారు. ఎప్పుడైతే కాబూల్ ను స్వాధీనం చేసుకుని దేశం మొత్తాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చేసుకున్నారో అప్పటినుండి అరాచకాలు మొదలైపోయాయి. ఆడ, మగ, పిల్లా, పెద్దా తేడా లేకుండా ఎవరు ఎదురుతిరిగినా వారిని కాల్చి చంపేయటమో లేకపోతే రోడ్లపైనే ఉరేసి చంపేయటమో చేస్తున్నారు.

దేశంలో కొన్ని విచిత్రమైన పరిస్ధితులు కనబడుతున్నాయి. జనాల్లో తాలిబన్లంటే జనాలు ఒకవైపు వణికిపోతుంటె మరోవైపు ఎక్కడికక్కడ తిరగబడుతున్నారు. దీంతో యావత్ దేశంలో పరిస్థితులు గందరగోళంగా మారిపోయింది. ఇదే సమయంలో ఐసిస్ మానవ బాంబులు తమను తాము పేల్చేసుకుంటున్నారు. దీనికి కౌంటర్ గా అమెరికా ఐసిస్ తీవ్రవాదులను టార్గెట్ చేసుకుని బాంబు దాడులు చేస్తోంది. మొత్తం మీద దేశంలో పరిస్థితులు రోజురోజుకు క్షీణించిపోతోంది.


Tags:    

Similar News