సన్ గ్లాసులు, స్నీకర్స్...స్టైల్ మార్చిన తాలిబన్లు !

Update: 2021-08-21 23:30 GMT
ఆఫ్ఘన్ ను ఆక్రమించి ప్రజా ప్రభుత్వాన్ని తరిమేసిన తాలిబన్లు ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షించేందుకు విభిన్న ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా గతంలో నిధుల లేమితో, కొండలు గుట్టల వెంట తిరిగిన తాలిబన్లు ఇఫ్పుడు అధికార పగ్గాలు అందుకునే స్ధాయికి చేరడంతో కార్పోరేట్ లుక్ తో కనిపిస్తున్నారు. డబ్బుకు కొదవ లేకపోవడం, మారిన పరిస్ధితుల్లో పూర్తిగా వేషధారణను మార్చేస్తున్నారు.  గతంలో తాలిబన్లంటే ఆప్గనిస్తాన్ లో మాదక ద్రవ్యాల వ్యాపారం చేసుకుంటూ ఇస్లామిక్ చట్టాలు అనుసరించని అమాయకుల్ని, మహిళల్ని పొట్టనపెట్టుకునే తీవ్రవాదులు. పాశ్చాత్య పోకడలు గిట్టని సంప్రదాయవాదులు.

ఆప్ఘన్ గడ్డ దాటి బయటికి వెళ్లి ప్రపంచాన్ని తెలుసుకోవడం కానీ, దాన్ని అనుసరించేందుకు కానీ ప్రయత్నించని వారు. హింసాత్మక మార్గాల్లోనే అధికారం సంపాదించాలని కలలు కనే వారు. ముఖ్యంగా అల్ ఖైదా వంటి తీవ్రవాద సంస్ధలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ అతంర్జాతీయంగా తీవ్రవాదులుగా ముద్ర పడ్డవారు. కానీ అదంతా గతం. ఇప్పుడు వారిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. గతంలో తీవ్రవాదులుగా పేరు తెచ్చుకున్న తాలిబన్లు అయితే ఇప్పుడు ఆప్ఘన్ గడ్డను పాలించేందుకు సిద్ధమైన తాలిబన్లను కొత్తగా ప్రపంచం అభివర్ణిస్తోంది. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. వేషధారణతో మార్పులతో పాటు పాశ్చాత్య శైలిని అనుకరించేందుకు సైతం వారు వెనుకాడటం లేదు.

గతంలో మీడియాతో అంటీముట్టనట్టుగా ఉంటూ పలువురు జర్నలిస్టుల్ని పొట్టనపెట్టున్న వారు ఇప్పుడు మీడియా సంబంధాల కోసం తహతహలాడుతున్నారు. అన్నింటి కంటే మించి మహిళల్ని పూర్తిగా అణచివేస్తారని తమకున్న పేరును తుడిచేస్తూ కొత్త ప్రభుత్వంలోకి వారిని ఆహ్వానిస్తున్నారు. దీంతో ఈ మార్పుల్ని ప్రపంచదేశాలు నిశితంగా గమనిస్తున్నాయి. తాలిబన్లు గతంలో సంప్రదాయ వస్తధారణలో కుర్తా పైజామాలో కనిపించేవారు. ఇప్పటికీ దాన్నే అనుసరిస్తున్నారు. అయితే దీనికి అదనంగా కళ్లకు సన్ గ్లాసులు, స్నీకర్స్ వచ్చి చేరాయి. దీంతో వీరు కొత్త లుక్ లో కనిపిస్తున్నారు.

తాజాగా పార్లమెంట్ భవనంలో కూర్చుని సంబరాలు చేసుకున్న సందర్భంతో పాటు పలుచోట్ల ఇప్పుడు తాలిబన్లు ఈ కొత్త లుక్ లో దర్శనమిస్తున్నారు. దీంతో వీరి వేషధారణ ఆప్ఘనిస్తాన్ లో చర్చనీయాంశంగా మారింది. ఈ కొత్త లుక్ ఎంతకాలం ఉంటుందో తెలియక అక్కడి జనం కూడా గందరగోళానికి గురవుతున్నారు. గతంలో సోషల్ మీడియా వాడేందుకు తాలిబన్లు అస్సలు ఆసక్తి చూపే వారు కాదు. అల్ ఖైదా వంటి ఉగ్రవాద సంస్ధలతో ఉన్న సంబంధాలు, తమపై ఉన్న రివార్డులు, మరికొన్ని కారణాలతో వారు సోషల్ మీడియాలో కనిపించేవారు కాదు. తాలిబన్ కీలక నేతల ఫొటోలు కూడా ఎవరో కానీ తీసి సోషల్ మీడియాలో పెట్టేవారు కాదు. ఇప్పుడు ట్విట్టర్ లో చూస్తే వారే నేరుగా ఎన్నో ఫొటోలు పోస్టు చేస్తున్నారు.

అంతే కాదు తమ కొత్త ప్రభుత్వ ఏర్పాటు, దేశంలో తాజా పరిణామాలపైనా పోస్టులు కనిపిస్తున్నాయి. దీంతో ట్విట్టర్ లో తాలిబన్ల యాక్టివ్ నెస్ పై చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారడమే కాదు ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలోనూ కనిపించేందుకు, తమ వాయిస్ వినిపించేందుకు తాలిబన్లు తహతహలాడుతున్నారు. అంతర్జాతీయ టీవీ ఛానళ్లలో ఇప్పుడు తాలిబన్లకు సంబంధించి పలు దృశ్యాలు లైవ్ లో ప్రసారం అవుతున్నాయి. అలాగే మీడియా కోసం ప్రెస్ మీట్లు కూడా నిర్వహిస్తున్నారు. ఆప్ఘనిస్తాన్ లో ఉన్న జర్నలిస్టులకు ఎలాంటి హానీ తలపెట్టబోమని హామీలు కూడా ఇస్తున్నారు. దీంతో మీడియా విషయంలో తాలిబన్ల వైఖరిలోనూ స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతానికి కొత్త ప్రభుత్వం ఏర్పాటై వారు కుదురుకునే వరకైనా మీడియా సంబంధాల విషయంలో తాలిబన్లు సానుకూలంగా ఉండే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News