దళిత మహిళకు సీటు కేటాయించారని అంతపని చేశారట!

Update: 2019-12-28 04:54 GMT
కాలం ఎంతగా మారినా.. సాంకేతికత ఎంత అందుబాటులోకి వచ్చినా మనుషుల్లో ఉండే కొన్ని మాత్రం మారని దుస్థితి. తాజా ఉదంతం దీనికి నిలువెత్తు నిదర్శనమని చెప్పాలి. ఈ రోజుల్లోనూ కుల వివక్ష అని తీసిపారేస్తారు కానీ.. తరచి చూస్తే చాలా చోట్ల ఇదెంత ఎక్కువగా ఉందో తెలీటమే కాదు.. ముక్కున వేలేసుకునేలా చేస్తుంది. తాజాగా తమిళనాడులో చోటు చేసుకున్న ఉదంతంపై విస్మయం వ్యక్తమవుతోంది.

కులవివక్ష విషయంలో వారెంత దుర్మార్గంగా వ్యవహరించారన్న విషయంలోకి వెలితే.. తూత్తుకుడి గ్రామ పంచాయితీ ఎన్నికల్లో ప్రెసిడెంట్ పదవి కోసం దళిత మహిళకు సీటును కేటాయించారు. దీంతో.. తీవ్రఆగ్రహానికి గురైన నాడార్ కులస్తులు ఏకంగా ఆ ఎన్నికను బహిష్కరించిన వైనం సంచలనంగా మారింది.

పిచ్చావిళై గ్రామంలో 785 ఓటర్లు ఉన్నారు.  వీరిలో నాడార్ కులస్తులు 779 మంది అయితే.. దళితులు ఆరుగురు మాత్రమే. తమ వర్గానికి చెందిన వారు అత్యధికులు ఉన్నా.. దళిత మహిళకు పదవిని ఎలా కేటాయిస్తారు? అన్నది అక్కడి వారి అభ్యంతరం. అందుకే.. తాజా ఎన్నికల్లో ఆరుగురు దళితులు మాత్రమే ఓట్లు వేయగా.. నాడార్ కులానికి చెందిన 779 మంది ఎన్నికల్ని బహిష్కరించిన వైనం హాట్ టాపిక్ మారింది.

పోలింగ్ సందర్భంగా ఓట్లు వేయని వారు.. తమ ఇంటి ముందు నల్లటి జెండాల్ని ఉంచి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఎన్నికల అధికారి వారిని ఓట్లు వేయమని కోరినా వారు మాత్రం ససేమిరా అన్నారు. తాము ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ తమకునచ్చిని అభ్యర్థిని ఉంచటానికి ఒప్పుకోకపోవటంతోనే తామీ నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. తాము కుల వివక్షతో వ్యవహరించటం లేదని.. తమకు అన్యాయం జరిగింది కాబట్టే ఎన్నికల్ని బహిష్కరించినట్లుగా స్థానికులు చెబుతున్నారు. వినేందుకు లాజిక్ బాగానే ఉన్నా..దాని వెనకున్నది కుల వివక్షే అన్న విషయాన్ని మర్చిపోకూడదు.
Tags:    

Similar News