అప్పట్లో కుముద్ బెన్ జోషి.. ఇప్పుడు తమిళసై

Update: 2019-11-08 16:30 GMT
ఇప్పటి తరానికి కుముద్ బెన్ జోషి బొత్తిగా పరిచయం ఉండదు. రాజకీయాల మీద కాస్త ఆసక్తి ఉన్న వారైతే ఆమె పేరును విని ఉంటారు. ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని ముప్పతిప్పలు పెట్టేందుకు నాటి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కుముద్ బెన్ జోషిని గవర్నర్ గా పంపటం.. ఆమె తన తీరుతో వార్తల్లో వ్యక్తిగా మారటమే కాదు.. ఆమె వ్యవహారశైలి అప్పట్లో సంచలనంగా ఉండేది.

1985లో ఉమ్మడి ఏపీకి సీఎంగా వ్యవహరించిన ఎన్టీఆర్ ను ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ సర్కారు సంధించిన అస్త్రంగా కుమద్ బెన్ జోషిని అభివర్ణించేవారు. దీనికి తగ్గట్లే ఆమె అప్పట్లో సొంత కార్యక్రమాల్ని ఏర్పాటు చేసుకునేవారు. ప్రజల్లో తరచూ తిరిగేవారు. అవకాశం చిక్కినప్పుడల్లా ప్రభుత్వంపై విమర్శనాస్త్రాల్ని సంధించేవారు. అంతేనా.. గణతంత్ర దినోత్సవం వేళ ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని తూర్పార పడుతూ గవర్నర్ హోదాలో ఉన్న జోషి చేసిన ప్రసంగం అప్పట్లో పెను సంచలనంగా మారటమే కాదు.. వివాదానికి తెర తీసింది.

ఇక.. ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తానే స్వయంగా జిల్లాల్లో పర్యటించటం కూడా వివాదానికి కారణంగా మారాయి. దీంతో.. ఆమె అంటేనే ఎన్టీఆర్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యేవారు. చివరకు సహనం కోల్పోయిన ఆయన.. గవర్నర్ జిల్లాల్లో పర్యటించే వేళలో.. అధికారపక్ష నేతలు.. కార్యకర్తలు హాజరు కావాల్సిన అవసరం లేదని బాహాటంగానే చెప్పేశారు. ఆమె తీరు ఎలా ఉండేదన్న దానికి ఒక ఉదాహరణ చెప్పొచ్చు. ఆమె గవర్నర్ గా ఉన్న నాలుగున్నరేళ్ల కాలంలో  23 జిల్లాల్లో 108 సార్లు పర్యటించారు. ఇదొక్కటి చాలు నాటి సీఎంను ఆమె ఎంతలా ఇబ్బంది పెట్టారో చెప్పటానికి.  ఎన్టీఆర్ కంట్లో నలుకలా వ్యవహరించిన కుముద్ బెన్ జోషిని గుర్తు చేసేలా తమిళ సై తీరు ఉంటుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది.

తమిళసై కు ముందు గవర్నర్ గా సుదీర్ఘకాలం వ్యవహరించిన నరసింహన్ కు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు మధ్య ఎంతటి సన్నిహిత సంబంధాలు ఉంటాయన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.అయితే.. కేసీఆర్ సర్కారును ఇరుకున పెట్టేందుకే మోడీ సర్కారు తమిళసైను వెతికి వెతికి మరీ ఎంపిక చేసి పంపారని చెబుతారు.

తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న పట్టుదలతో ఉన్న మోడీ పరివారం సీఎం కేసీఆర్ మీద ప్రయోగించిన అస్త్రంగా తమిళసైను అభివర్ణిస్తారు. దీనికి తగ్గట్లే ఆమె తీరు ఉందన్న మాట వినిపిస్తోంది. ఇటీవల రాజ్ భవన్ లో ప్రజాదర్బార్ నిర్వహిస్తానని చెప్పటం.. ప్రధాని మోడీకి ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వ తీరును తప్పు పట్టేలా రిపోర్టు ఇవ్వటం లాంటివి తెలంగాణ అధికారపక్షానికి ఆమెపై గుర్రును మరింత పెంచేలా చేస్తున్నాయి.

ఆర్టీసీ సమ్మె వేళ.. ముఖ్యమంత్రికి ఫోన్ చేయకుండా ఆ శాఖ మంత్రికి ఫోన్ చేసి వివరాలు తనకు పంపాలని కోరటం కూడా కేసీఆర్ ను కష్టపెట్టిన అంశంగా చెబుతున్నారు. అప్పట్లో కాంగ్రెస్ నేతలకు రాజ్ భవన్ స్థావరంగా మారితే.. ఇప్పుడు బీజేపీ నేతలకు పెద్ద అండ దొరికినట్లుగా చెబుతున్నారు. ఇటీవల కాలంలో రాజ్ భవన్ లో తమిళ సై వరుస సమీక్షలు నిర్వహిస్తున్న తీరు కూడా కేసీఆర్ కు కాలిపోయేలా చేస్తున్నట్లు చెబుతున్నారు.మొత్తంగా చూస్తే గవర్నర్ తమిళసై అడుగులు కేసీఆర్ ప్రభుత్వానికి మింగుడుపడటం లేదన్న మాట వినిపిస్తోంది. దేనికైనా సొల్యూషన్ తన వద్ద ఉందని చెప్పే కేసీఆర్.. తమిళసై సమస్యను ఎలా పరిష్కరిస్తారో చూడాలి.

Tags:    

Similar News