ఆ ప్రాజెక్టులు ఆపేయాలంటూ జ‌గ‌న్‌కు స్టాలిన్ లేఖ‌!

Update: 2022-08-14 04:52 GMT
జ‌ల వివాదాలు అంత‌కంత‌కూ తీవ్ర‌మ‌వుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న త‌ర్వాత ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ రాష్ట్రాల ప‌లు ప్రాజెక్టుల‌కు సంబంధించి జ‌ల వివాదాలు తీవ్ర‌మ‌య్యాయి. ఇప్ప‌టికే వీటిలో కొన్ని సుప్రీంకోర్టు ప‌రిధిలో, మ‌రికొన్ని గోదావ‌రి బోర్డు, కృష్ణాన‌దీ యాజ‌మాన్య బోర్డు, తుంగ‌భ‌ద్ర న‌దీ యాజ‌మాన్య బోర్డు ప‌రిధిలో ఉన్నాయి. ఏపీ, తెలంగాణ త‌ర‌ఫున చీఫ్ ఇంజ‌నీర్లు, అధికారులు వారిది త‌ప్పంటే వారిది త‌ప్ప‌ని వాదిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో తాజాగా త‌మిళనాడుతో ఏపీకి నీటి పంచాయ‌తీ మొద‌లైంది. ఈ మేర‌కు త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స్టాలిన్.. ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కు తాజాగా లేఖ రాశారు. రెండు రాష్ట్రాల‌ సరిహద్దుల్లో ఉన్న‌ కుశస్థలి నదిపై ఏపీ నిర్మిస్తున్న రెండు ప్రాజెక్టుల్ని తక్షణం నిలిపివేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఏపీ సీఎం జగన్‌కు లేఖ రాశారు.

కుశస్థలి నది పరివాహక ప్రాంతం త‌మిళ‌నాడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో విస్త‌రించి ఉంది. చెన్నై నగరానికి తాగునీటి సరఫరా కోసం తమిళనాడు ప్రభుత్వం ఈ నదిపై పూండీ రిజర్వాయర్‌ను నిర్మించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో దీనికి ఎగువన ఎలాంటి ఆనకట్టలు నిర్మించినా పూండీ జలాశయానికి నీటి కొరత ఏర్పడుతుంద‌ని త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం వాదిస్తోంది. అంతేకాకుండా ఆ ప్రభావం చెన్నై నగరంపై తీవ్రంగా ఉంటుందని, తాగునీటి ఇబ్బందులు త‌లెత్తుతాయ‌ని స్టాలిన్ అంటున్నారు. అందుకే తమకు తెలియకుండా .. తమతో చర్చించకుండా కుశ‌స్థ‌లి న‌దిపై ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని త‌న లేఖ‌లో జగన్ ను కోరారు.

చిత్తూరు జిల్లాలోని కతరపల్లి, ముక్కలకండిగై గ్రామాల్లో కుశస్థలి నదిపై రెండు రిజర్వాయర్ల నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని స్టాలిన్ త‌న లేఖ‌లో అభ్యంత‌రం తెలిపారు. ఈ రెండు ఆనకట్టల వల్ల భవిష్యత్తులో చెన్నై నగరానికి పూర్తిగా తాగునీటి సమస్య ఏర్పడే ప్రమాదం ఉందని ఆందోళ‌న వెలిబుచ్చారు.

కాగా తమిళనాడు సరిహద్దులో చిత్తూరు జిల్లా నగరి వద్ద కుశస్థలి నదికి వరదలొస్తే నీరు వృథాగా సముద్రం పాలు కాకుండా ఒడిసిపట్టేందుకు జ‌గ‌న్ ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌ట్టింది. గొలుసుకట్టు విధానంలో అనుసంధానమైన 20 చెరువులకు ఆ నీటిని మళ్లించేలా రెండు ప్రాజెక్టుల్ని ఏపీ ప్రభుత్వం చేపట్టింది. ఇందుకు అవ‌స‌ర‌మైన నిధులను టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలోనే మంజూరు చేశారు. అదేవిధంగా పాలార్‌ నదిపై ఆంధ్రప్రదేశ్‌ నిర్మిస్తున్న కుప్పం ప్రాజెక్టుపై చాలా కాలంగా త‌మిళ‌నాడు-ఆంధ్ర‌ప్ర‌దేశ్ మధ్య వివాదం ఉంది.
Tags:    

Similar News