త‌మిళ‌నాట పొలిటిక‌ల్ ఎత్తులు చూశారా!

Update: 2017-09-01 11:50 GMT
త‌న ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు దిన‌క‌ర‌న్ ప‌న్నిన ప‌న్నాగాన్ని ఇప్ప‌టి వ‌ర‌కు చూస్తూ వ‌చ్చిన త‌మిళ‌నాడు సీఎం ఎడ‌ప్పాడి ప‌ళ‌ని స్వామి.. ఇప్పుడు త‌న ప్ర‌భుత్వాన్ని కాపాడుకునేందుకు త‌న వంతుగా పైఎత్తులు ప్రారంభించారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న త‌న‌పై అవిశ్వాసం ప్ర‌క‌టించి, దిన‌క‌ర‌న్‌ కు జైకొట్టిన  ఎమ్మెల్యేలు 19 మందిపై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలోనే వారికి నోటీసులు కూడా జారీ అయ్యాయ‌ని స‌మాచారం. దీనివ‌ల్ల ఈ ఎమ్మెల్యేల‌తో పాటు వీరి వెనుక ఉండి సీఎం సీటు కోసం నాట‌కాలాడుతున్న శ‌శిక‌ళ వ‌ర్గానికి చెందిన దిన‌క‌ర‌న్ దూకుడుకూ క‌ళ్లెం వేయాల‌ని నిర్ణ‌యించారు.

ఈ నేప‌థ్యంలో అధికార అన్నాడీఎంకే పార్టీ రెబల్ ఎమ్మెల్యేలకు ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ధనపాల్ శుక్రవారం మరోసారి నోటీసులు జారీ చేశారు. రెబల్ ఎమ్మెల్యేలు సమాధానం ఇవ్వకుంటే అనర్హత వేటు పడే అవకాశం ఉందని తెలిసింది. దినకరన్ వర్గంలోని ఎమ్మెల్యేల మీద కఠిన చర్యలు తీసుకోవాలని అన్నాడీఎంకే పార్టీ చీఫ్ విప్ రాజేంద్రన్ స్పీకర్ ధనపాల్ కు ఫిర్యాదు చేసిన నేప‌థ్యంలోనే ఈ చ‌ర్య‌లు ముమ్మ‌రం అయిన‌ట్టు తెలుస్తోంది. దీంతో ఎలా చూసినా.. ప‌ళ‌ని స్వామిపై ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల మెడ‌పై క‌త్తి వేలాడుతూ ఉంద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది.

ఇక‌, ప‌ళ‌ని స్వామికి ఇటు రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర్‌ రావు స‌హా కేంద్ర హోం శాఖ నుంచి కూడా పూర్తి మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. గ‌వ‌ర్న‌ర్ పూర్తి గా స్వామి ప్ర‌భుత్వాన్ని వెనుకేసువ‌చ్చారు.  ప‌ళ‌నిపై అవిశ్వాసం పెట్టిన వారు కూడా అన్నాడీఎంకేలోనే ఉన్నార‌ని, కాబ‌ట్టి ఈ ర‌గ‌డ‌ను అన్నాడీఎంకే అంత‌ర్గ‌త కార‌ణాలుగానే ప‌రిగ‌ణిస్తామ‌ని ఆయ‌న స్ఫ‌ష్టం చేశారు. దీంతో ఇప్పుడు ప‌ళ‌ని ప్ర‌భుత్వం క్షేత్ర‌స్థాయిలో చ‌ర్య‌లు ముమ్మ‌రం చేసిన‌ట్టు  తెలుస్తోంది. మ‌రి భ‌విష్య‌త్తులో ఏం జ‌రుగుతుందో చూడాలి.
Tags:    

Similar News