మీడియా చానెళ్ల‌పై మండిప‌డ్డ త‌మ్మారెడ్డి!

Update: 2018-01-18 10:45 GMT
టాలీవుడ్ లోని ద‌ర్శక‌నిర్మాత‌ల‌తో త‌మ్మారెడ్డి ప్ర‌త్యేక‌త వేరు. ఇండ‌స్ట్రీతో పాటు సామాజిక అంశాల‌పై కూడా త‌న‌దైన శైలిలో స‌హేతుక‌మైన విమ‌ర్శలు చేయ‌డం త‌మ్మారెడ్డి నైజం. అనుకున్న విష‌యాన్ని సుత్తి లేకుండా....సూటిగా ...కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు చెప్ప‌గ‌లిగిన అతికొద్దిమంది టాలీవుడ్ ప్ర‌ముఖుల‌లో త‌మ్మారెడ్డి ఒక‌రు. కొద్ది రోజుల క్రితం క‌త్తి మ‌హేశ్ - ప‌వ‌న్ పై త‌మ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా, మ‌రోసారి ఆ వివాదంపై, టీవీ చానెళ్ల తీరుపై త‌మ్మారెడ్డి తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. టీఆర్పీల కోసం కత్తి మహేష్ – పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వివాదాన్ని టీవీ చానెళ్లు పెంచి పోషిస్తున్నాయ‌ని దుయ్య‌బ‌ట్టారు. ప్ర‌త్యేకించి 2-3 తెలుగు న్యూస్ చానెళ్లు ఈ వివాదం స‌మ‌సిపోయేందుకు కృషి చేస్తున్న‌ట్లు క‌న‌బ‌డుతూనే....అగ్గికి  ఆజ్యం పోస్తున్నాయ‌ని మండిప‌డ్డారు. ఏపీ - తెలంగాణ‌తో పాటు జాతీయ‌ - అంత‌ర్జాతీయ స్థాయిలో ఈ వివాదం క‌న్నా ప్రాముఖ్య‌త గ‌ల అంశాలు అనేకం ఉన్నాయ‌ని, వార్తా చానెళ్లు వాటిపై ఫోక‌స్ చేయాల‌ని హిత‌వు ప‌లికారు. ఈ ర‌కంగా ఆవేద‌న వ్య‌క్తం చేస్తూ త‌న‌ యూట్యూబ్ చానెల్ లో  ఓ వీడియోను తమ్మారెడ్డి పోస్ట్ చేశారు.

కొన్ని తెలుగు న్యూస్ చానెళ్ల తీరుపై త‌మ్మారెడ్డి ధ్వ‌జ‌మెత్తారు. ప్ర‌పంచంలో మ‌రే వార్త‌లు - స‌మ‌స్య‌లు లేవ‌న్న‌ట్లుగా ఆ టీవీ చానెళ్లు.... కేవ‌లం క‌త్తి మ‌హేశ్ పై ఫోక‌స్ చేయ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. ఆ చానెళ్ల‌కు మ‌రే అంశాలు క‌న‌బ‌డ‌డం లేదా అని ప్ర‌శ్నించారు. “నిర్భయ” ను మించిన రేప్ ఘ‌టన హర్యానాలో జరిగిందని - న్యాయ వ్యవస్థ లో సంక్షోభం...సుప్రీం చీప్ జ‌స్టిస్ పై అవినీతి ఆరోప‌ణ‌లు - చాలా కాలం త‌ర్వాత చంద్ర‌బాబు-మోదీ స‌మావేశం....ఇలా ప్ర‌జ‌ల‌కు అవ‌స‌ర‌మైన - తెలుసుకోద‌గిన అనేక వార్తలున్నాయ‌ని....వాటి గురించి మ‌రింత లోతైన‌ స‌మాచారం  తెలుసుకోవాల‌ని - నిపుణుల విశ్లేషణ‌లు వినాల‌ని ఆస‌క్తి అంద‌రికీ ఉంటుంద‌న్నారు. కానీ, అవ‌న్నీ వ‌దిలేసి క‌త్తి మ‌హేశ్  మీద పోక‌స్ చేసి - అత‌డితో గంటల తరబడి చర్చలు పెట్టేసి టీఆర్పీలు పెంచుకుంటున్నాయ‌ని ఆరోపించారు. అప్ర‌ధాన‌మైన ఈ సమస్యపై ఇంత ఫోక‌స్ అవ‌స‌రం లేద‌ని, ఇన్ని నెలలపాటు ఆ వివాదాన్ని మీడియాలో చూపించ‌డం వ‌ల్ల సమాజానికి చెడు జ‌రుగుతోందన్నారు. మ‌హేశ్ త‌ప్ప మ‌రే స‌మ‌స్య‌లు లేవ‌ని మీడియా మభ్యపెడుతోందా అని ప్ర‌శ్నించారు.

ఆయా తెలుగు న్యూస్ చానెళ్ళలో మొత్తం సిబ్బంది జీతాలు రూ.2 నుంచి 3 కోట్ల వ‌ర‌కు ఉంటాయ‌ని, మ‌హేశ్ క‌త్తి అనే ఒక వ్య‌క్తిని బేస్ చేసుకొని ఆ చానెళ్లు కోట్ల రూపాయలు క్యాష్ చేసుకుంటున్నాయ‌న్నారు. ఆ డ‌బ్బులో చిల్లిగ‌వ్వ కూడా కత్తి మహేష్ కు రావ‌డం లేద‌ని - అందువ‌ల్ల‌ కత్తి మహేష్ ఉదయం 6 గంటల నుంచీ రాత్రి 11 దాకా ఆ చానెళ్ల‌లో ప్ర‌త్య‌క్ష‌మ‌వ‌డం మానేయాల‌ని సూచించారు. ఓ మాట‌లో చెప్పాలంటే....క‌త్తి మ‌హేశ్ వ్యాల్యూ....ఓ 100 కోట్ల వ‌ర‌కూ ఉంటుంద‌ని...అత‌డికి వంద కోట్లిచ్చినా చానెళ్ల‌కు న‌ష్టం లేద‌ని ఎద్దేవా చేశారు.  ప‌వ‌న్ క‌ల్యాణ్ కు విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంద‌ని - ఆయ‌న జ‌న‌సేన పార్టీకి కూడా కార్య‌క‌ర్తలు విప‌రీతంగా ఉన్నార‌ని చెప్పారు. ప‌వ‌న్ కూడా ఉద్దానం - ప్ర‌త్యేక హోదా వంటి వాటిపై స్పందించ‌డం అభినంద‌నీయ‌మ‌ని - అయితే, ఈ వివాదంపై కూడా ప‌వ‌న్ త‌ర‌పున ఎవ‌రో ఒక‌రు స్పందించి దానికి పుల్ స్టాప్ పెడితే బాగుంటుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. జ‌న‌సేన నుంచి కొన్ని ప్ర‌క‌ట‌న‌లు - ప‌వ‌న్ ఫ్యాన్స్ నుంచి కొన్ని ప్ర‌క‌ట‌న‌లు వ‌చ్చాయ‌ని....అయితే, ప‌వ‌న్ త‌ర‌పున ఎవ‌రో ఒక‌రు చొర‌వ తీసుకుంటే బాగుంటుంద‌న్నారు.

మ‌రోవైపు, క‌త్తి మ‌హేశ్ కూడా సామాజిక స్పృహ ఉన్న వ్య‌క్త‌ని - ప్ర‌త్యేక హోదా కోసం వైజాగ్ కూడా వెళ్లార‌ని - ద‌ళితుల స‌మ‌స్య‌ల కోసం పోరాడుతుంటారని చెప్పారు. ఏదో ఒక విధంగా మ‌హేశ్ ఈ వివాదానికి పుల్ స్టాప్ పెట్టేందుకు ముందుకురావాల‌ని - అత‌డిని చానెళ్లు త‌మ స్వార్థ‌ప్ర‌యోజ‌నాల‌కు వాడుకుంటున్నాయ‌ని గ‌మ‌నించాల‌న్నారు. మీడియా - సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ కోస‌మే మ‌హేశ్ వివాదాన్ని స‌ద్దుమ‌ణ‌గ‌నివ్వ‌డం లేద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. మ‌హేశ్ - ప‌వ‌న్ లు స‌మాజానికి అవ‌స‌ర‌మైన వ్య‌క్తుల‌ని...వారు ఈ వివాదంలో స‌మ‌యాన్ని వేస్ట్ చేయ‌డం స‌రికాద‌న్నారు. ప‌వ‌న్ కు ఈ వివాదంతో ప్ర‌త్య‌క్షంగా సంబంధం లేక‌పోయిన‌ప్ప‌టికీ...ఆయ‌న త‌ర‌పున ఎవ‌రో ఒక‌రు వ‌చ్చి ఈ వివాదానికి చ‌ర‌మ‌గీతం పాడాల‌న్నారు. అదేర‌కంగా, మ‌హేశ్ కు ఈ వివాదం వ‌ల్ల చిల్లి గ‌వ్వ ఉప‌యోగం లేద‌ని, ఆయ‌న కూడా ఈ వివాదానికి తెర దించాల్సిన అవ‌స‌ర‌ముంద‌న్నారు. ఇవి కేవ‌లం త‌న అభిప్రాయాలు మాత్ర‌మేన‌ని, వాటిని అర్థం చేసుకోవాల‌ని త‌మ్మారెడ్డి కోరారు. ఏది ఏమైనా ఈ వివాదానికి తెరదించేందుకు కోన వెంక‌ట్ - త‌మ్మారెడ్డి వంటి వారు చేస్తున్న ప్ర‌య‌త్నాల‌పై ప‌లువురు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రి, త‌మ్మారెడ్డి మాట‌ల‌ను ఇరువర్గాల వారు ఆల‌కించి ఈ వివాదానికి మంగ‌ళం పాడితారో లేదో వేచి చూడాలి.

Tags:    

Similar News