టార్గెట్ హైదరాబాద్ : అదిరిపోయే ప్లాన్ లో బాబు!

Update: 2022-12-20 14:30 GMT
హైదరాబాద్ రెండు తెలుగు రాష్ట్రాలకు ఈ రోజుకీ రాజధాని నగరం. ఎనిమిదిన్నరేళ్ళుగా హైదరాబాద్ లో ఆంధ్రా పార్టీల రాజకీయాలు లేవు.  ఒకనాడు రాజకీయం చేయాలంటే హైదరాబాద్ నే సెంటర్ పాయింట్ గా చేసుకునేవారు. 1994 ఎన్నికలకు ముందు ఎన్టీయార్ హైదరాబాద్ లో సింహగర్జన పేరిట అద్భుతమైన సభను నిర్వహించి మొత్తం  జనాల మూడ్ ని తన వైపు తిప్పుకున్నారు.

ఆ తరువాత చంద్రబాబు సీఎం గా ఉండగా అనేక సభలు సమావేశాలు నిర్వహించారు. కానీ ఒక్కసారి ఉమ్మడి ఏపీ రెండుగా విడిపోయాక తెలుగుదేశం  పొలిటికల్ యాక్టివిటీని తగ్గించేసుకుంది. ఇపుడు టీయారెస్ కాస్తా బీయారెస్ అయింది. కేసీయార్ ఏపీ రాజకీయ రాజధాని విజయవాడ నడిబొడ్డున సౌండ్ చేయాలని చూస్తూంటే చంద్రబాబు తెలంగాణాలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావడానికి చూస్తున్నారు.

కేసీయార్ జాతీయ రాజకీయాల కోరిక బాబుకు తెలంగాణాలో రూట్ క్లియర్ చేసింది. దాంతో అసలే వ్యూహాల పుట్ట అయిన బాబు చూస్తూ ఊరుకుంటారా. ఆయన తెలంగాణాలో టీడీపీ సైకిల్ జోరు పెంచేస్తున్నారు. ఈ నెల 21న ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభకు చంద్రబాబు రెడీ అవుతున్నారు. ఇప్పటికే సభ ఏర్పాట్లతో సహా అన్నీ పార్టీ నాయకులు చూస్తున్నారు. తెలంగాణా టీడీపీ కొత్త ప్రెసిడెంట్ కాసాని జ్ఞానేశ్వర్ అద్వర్యంలో జరిగే తొలి భారీ సభ కావడంతో సూపర్ హిట్ చేయాలని అనుకుంటునారు.

మరో వైపు చూస్తే తెలంగాణా నడిబొడ్డిన అంటే హైదరాబాద్ లో అదిరిపోయే సభను నిర్వనించాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారుట. ఈ మేరకు ఆయన జ్ఞానేశ్వర్ కి సూచనలు ఇచ్చారని తెలుస్తోంది. తెలంగాణా ఎన్నికలు వచ్చే ఏడాది ఉన్నాయి. ఆ ఎన్నికల్లో తనదైన మార్క్ ని చూపించాలని తెలుగుదేశం ఆలోచిస్తోంది. హైదరాబాద్ లో పదుల సంఖ్యలో సీట్లు ఉన్నాయి. పైగా సెటిలర్స్ ఎక్కువగా ఉన్నారు. ఇక వివిధ రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారు.

హైదరాబాద్ ని కనుక తన వైపునకు తిప్పుకుంటే రేపటి తెలంగాణా రాజకీయాల్లో తెలుగుదేశానికి కీలక భూమిక ఉంటుంది అని బాబు భావిస్తున్నారు. అందుకోసం ఆయన జ్ఞానేశ్వర్ మీద పెద్ద బాధ్యత పెట్టారని అంటున్నారు. ఈ సభ నభూతో నభవిష్యత్ అన్నట్లుగా నిర్వహించాలని బాబు ఆదేశించినట్లుగా చెబుతున్నారు. తెలుగుదేశం హిస్టరీలో సింహ గర్జన సభ ఒక ల్యాండ్ మార్క్ గా ఉంది. అలాంటి సభనే మళ్ళీ నిర్వహించాలని బాబు భావిస్తున్నారుట.

ఇక సభకు డేట్ టైం ఫిక్స్ చేశాక ప్రతీ రోజూ సభ తీరుతెన్నులను తాను మానిటరింగ్ చేస్తాను అని బాబు పార్టీ వర్గాలకు చెప్పినట్లుగా తెలుస్తోంది. దాంతో చంద్రబాబు తెలంగాణా టీడీపీ విషయంలో చూపుతున్న శ్రద్ధకు తమ్ముళ్ళు ఫుల్ జోష్ మీద ఉన్నారుట. ఈ సభ సూపర్ హిట్ చేయడం ద్వారా తెలుగుదేశం రీ ఎంట్రీ రీ సౌండ్ చేయాలన్నది బాబు ఆలోచనగా చెబుతున్నారు.

మరో వైపు చూస్తే ఖమ్మం సభ తరువాత వరంగల్, నిజామాబాద్, మహబూబ్ నగర్ వంటి నగరాలలో సభలను నిర్వహించాలని చంద్రబాబు చూస్తున్నారు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే తెలంగాణాలో టీడీపీని పటిష్టం చేసే యోచనలో చంద్రబాబు ఉన్నారు. దాంతో పాటు ఈసారి హైదరాబాద్ లో ఎక్కువ సీట్లు గెలుచుకునే వ్యూహానికి ఆయన తెర తీశారు అని అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News