నాగం ఎంట్రీకి ముందే..కాంగ్రెస్ మార్కు షాకులు

Update: 2018-01-25 08:11 GMT

టీడీపీలో ఉన్న స‌మ‌యంలో తెలంగాణ టీడీపీ నాయ‌కుడిగా ఓ వెలుగు వెలిగి...అనంత‌రం బీజేపీలో చేరినప్పటికీ త‌ర్వాత ఆ ప్రాధాన్యం ద‌క్క‌లేదనే అందుకే పార్టీ మారాల‌ని సీనియ‌ర్ నేత నాగం జ‌నార్ద‌న్ రెడ్డి డిసైడ్ అయిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. త్వ‌ర‌లోనే ఆయ‌న గోడ దూక‌డం ఖాయ‌మ‌ని కాంగ్రెస్ గూటికి చేరుతారని పుకార్లు ప్ర‌చారంలో ఉన్న నేప‌థ్యంలో.. తాజాగా మ‌రో సంచ‌ల‌న వార్త తెర‌మీద‌కు వ‌చ్చింది. ఏకంగా ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేసిన‌ట్లు స‌మాచారం.

నాగం జనార్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొనేందుకు ఢిల్లీ స్థాయి నేత ఒకరు చక్రం తిప్పుతున్నారని నాగర్ కర్నూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీలో మకాం వేసిన నేతలకు కూడ ఈ విషయమై కొంత స్పష్టత వచ్చిందంటున్నారు. ఈ నేప‌థ్యంలో నాగం జనార్ధన్‌ రెడ్డి ప్రత్యర్థి ఎమ్యెల్సీ కూచకుళ్ళ దామోదర్ రెడ్డి ఆయ‌న ఎంట్రీని అడ్డుకునేందుకు చక్రం తిప్పుతున్నారు. నాగర్‌ కర్నూల్ ఎంపీ నంది ఎల్లయ్యతో కలిసి దామోదర్ రెడ్డి ఢిల్లీలో మకాం వేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ - ఎఐసిసి ఎస్సీ సెల్ ఛైర్మెన్ కొప్పుల రాజును కలిసి తమ అభ్యంతరాలను వ్యక్తం చేసినట్టు సమాచారం. నాగం జనార్ధన్ రెడ్డి టీడీపీలో ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ నేతలను ఏ రకంగా ఇబ్బందులకు గురిచేసిన విషయాలను కాంగ్రెస్ పార్టీ నేతలు పార్టీ అధిష్టానానికి విన్నవించే ప్రయత్నాలు చేస్తున్నారని స‌మాచారం.

టీడీపీ అభ్యర్థిగా నాగ‌ర్‌ క‌ర్నూల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నాగం జనార్ధన్ రెడ్డి గతంలో పలుమార్లు దామోదర్ రెడ్డిపై విజయం సాధించారు. 2012లో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో నాగం జనార్ధన్‌ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే రాజకీయంగా తనకు ఇబ్బందులు తప్పవని దామోదర్ రెడ్డి భావిస్తున్నారు. ఈ తరుణంలో నాగం జనార్ధన్‌ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి రాకుండా అడ్డుకొనే ప్రయత్నాలను ప్రారంభించారు. ఈ క్ర‌మంలోనే టీడీపీ అధికారంలో ఉన్న స‌మ‌యంలో నాగం జనార్ధన్ రెడ్డి చ‌ర్య‌ల‌ కారణంగానే కాంగ్రెస్ పార్టీ నేతలు మహబూబ్ నగర్ జిల్లాలో ముఖ్యంగా నాగర్ కర్నూల్ ప్రాంతంలో ఇబ్బందులు పడిన విషయాన్ని కాంగ్రెస్ నేతలు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారని స‌మాచారం. . కానీ, తమను సంప్రదించకుండానే చేరికలతో రాజకీయంగా తాము నష్టపోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని కాంగ్రెస్ నేతలు వాపోతున్నారు.

ఇదిలాఉండ‌గా..నాగం కాంగ్రెస్‌లో చేర‌కుండా బీజేపీ ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టిన సంగ‌తి తెలిసిందే. బీజేపీ సీనియ‌ర్ నేత హ‌న్స‌రాజ్ గంగరాం గ‌త వారం నాగంతో స‌మావేశం అయ్యారు. పార్టీలో ప్రాధాన్యం త‌మ బాధ్య‌త అని హామీ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News