ట్రంప్ ఒత్తిడి..హెచ్‌1బీల‌పై టీసీఎస్ షాక్‌

Update: 2017-06-05 05:49 GMT
హెచ్1బీ వీసా నిబంధనలను కఠినతరం చేయడంతోపాటు ఉద్యోగ నియామకాల్లో స్థానికులకే ప్రాధాన్యం ఇవ్వాలన్న‌ అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం త‌ప్ప‌నిస‌రి నిర్ణ‌యం మ‌న దేశీయ కంపెనీలపై ఒత్తిడి పెంచింది. ఈ నేపథ్యంలో అమెరికాలో కార్యకలాపాలు సాగిస్తున్న దేశీయ ఐటీ కంపెనీలన్నీ అక్కడివారికే అవకాశాలు కల్పించడంపై ప్రధానంగా దృష్టిసారించాయి. ఎందుకంటే, దేశీయ ఐటీ ఎగుమతుల్లో 60 శాతం వాటా అమెరికా మార్కెట్‌ దే. వచ్చే రెండేళ్ల‌లో అమెరికాలో 10 వేల మంది స్థానికులను నియమించుకోనున్నట్లు ఈమధ్యే ఇన్ఫోసిస్ ప్రకటించింది. ఇదే రీతిలో మ‌న‌దేశంలో అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్).. ఈ ఏడాది హెచ్1బీ వర్క్ వీసా దరఖాస్తులను భారీగా తగ్గించుకుంది.

టీసీఎస్‌ లో మానవ వనరుల విభాగ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అజోయ్ ముఖర్జీ కంపెనీ వార్షిక నివేదికలో ప‌లు వివ‌రాల‌ను వెల్ల‌డించారు.``గడిచిన కొన్నేళ్ల‌ నుంచి అమెరికాలో స్థానికుల నియామకాలను గణనీయంగా పెంచాం. ఇండియా మార్కెట్లో మాదిరిగానే అమెరికాలోని పలు విద్యా సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాం`` అని వార్షిక నివేదిక‌లో వివ‌రించారు. అమెరికాలోని వందకు పైగా ఇంజినీరింగ్ క్యాంపస్‌ లు, బిజినెస్ స్కూళ్ల నుంచి సంస్థ ఉద్యోగులను నియమించుకుంటున్నదని ఆయన తెలిపారు. వర్క్ వీసాలపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు అమెరికాలో స్థానికుల నియామకాలు దోహదపడుతున్నాయి. 2015తో పోలిస్తే 2016లో, ఈ ఏడాదిలో మూడింట ఒకవంతు దరఖాస్తులనే దాఖలు చేయడం జరిగింది అని ముఖర్జీ వెల్లడించారు.

2015 సంవత్సరంతో పోలిస్తే సంస్థ దరఖాస్తులు మూడో వంతుకు తగ్గాయి. అమెరికాలో ఆన్‌ సైట్ కార్యకలాపాల కోసం సంస్థ ఆ దేశ ఇంజినీరింగ్ కాలేజీలు, బిజినెస్ స్కూళ్ల నుంచి నియామకాలను పెంచింది. తద్వారా టీసీఎస్.. హెచ్1బీ వీసాలపై ఆధార పడటాన్ని గణనీయంగా తగ్గించుకోగలిగింది. కాగా, హెచ్1బీ వీసాల్లో అధిక శాతం టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్‌ లే దక్కించుకుంటున్నాయని అమెరికా ప్రభుత్వం గతనెలలో ఆరోపించింది. ఈ వీసాలను లాటరీ పద్ధతిన జారీ చేస్తుండ‌గా పెద్ద సంఖ్యలో దరఖాస్తులు దాఖలు చేయడం ద్వారా సంస్థలు అధిక వీసాలను దక్కించుకోగలుగుతున్నాయని విమర్శించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News