టాటా సంస్థ కీల‌క ప్ర‌క‌ట‌న‌.. ఊపిరి పీల్చుకున్న 4.5 ల‌క్ష‌ల మంది

Update: 2020-04-18 04:15 GMT
కరోనా వైర‌స్ ధాటికి కుదేల‌వ‌ని రంగం లేదు. ఇప్ప‌టికే నెల రోజులుగా అన్ని రంగాల్లోనూ ప‌నులు ఆగిపోయాయి. మ‌ళ్లీ ఎప్ప‌టికి సాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొంటాయో తెలియ‌ట్లేదు. క‌రోనా వ్యాప్తి త‌గ్గినా.. లాక్ డౌన్ ఎత్తేసినా.. అన్ని రంగాల‌పైనా దీని ప్ర‌భావం అయితే మ‌రికొన్ని నెల‌లు ఉండేలా క‌నిపిస్తోంది. వివిధ రంగాలు ఆర్థికంగా కుదేల‌య్యేలా క‌నిపిస్తున్నాయి. మ‌న దేశంలో ల‌క్ష‌ల సంఖ్య‌లో ఉద్యోగాలు ఊడిపోయే ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

సాఫ్ట్ వేర్ రంగంలో భారీగా ఉద్యోగాల కోత ఉంటుంద‌న్న సంకేతాలు కనిపిస్తున్నాయి. నిర్దాక్షిణ్యంగా ఉద్యోగాలు పీకి ప‌డేయ‌డానికి సంస్థ‌లు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. ఇలాంటి స‌మయంలో టాటా క‌న్స‌ల్టంట్ స‌ర్వీసెస్ (టీసీఎస్‌) త‌మ ఉద్యోగుల‌కు గొప్ప ఊర‌ట‌నిచ్చే ప్ర‌క‌ట‌న చేసింది.

ప‌రిస్థితులు ఎలా ఉన్న‌ప్ప‌టికీ ఈ ఏడాది సంస్థ‌లోంచి ఒక్క ఉద్యోగిని కూడా తొల‌గించ‌బోమ‌ని టీసీఎస్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. అయితే ప్ర‌తి ఏడాదిలా ఈసారి జీతాల్లో పెంపు మాత్రం ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేసింది. ఐతే ఇంక్రిమెంట్ లేక‌పోయినా ప‌ర్వాలేదు ఉద్యోగం నిలిస్తే చాలనుకుంటున్న 4.5 ల‌క్ష‌ల మంది టీసీఎస్ ఉద్యోగులకు ఇది గొప్ప ఊర‌టే. ఇక కొత్త‌గా తీసుకునే ఉద్యోగాల‌కు అనుభ‌వ‌జ్ఞులెవ‌రినీ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోమ‌ని టీసీఎస్ స్ప‌ష్టం చేసింది. 40 వేల కొత్త ఉద్యోగాలు ఫ్రెష‌ర్ల‌కే ఇస్తామ‌ని స్ప‌ష్టం చేసింది. దీన్ని బ‌ట్టి వేరే సంస్థ‌లు ఉగ్యోగులపై వేటు వేస్తే వాళ్లెవ‌రినీ త‌మ సంస్థ‌లో చేర్చుకునే అవ‌కాశం లేద‌ని చెప్ప‌క‌నే చెప్పేసింది టీసీఎస్. గ‌త వార్షిక సంవ‌త్స‌రం చివ‌రి క్వార్ట‌ర్ (జ‌న‌వ‌రి-మార్చి)లో టీసీఎస్ 8049 కోట్ల లాభం న‌మోదు చేసింది. ఐతే క‌రోనా ప్ర‌భావం వ‌ల్ల ఈ వార్షిక సంవ‌త్స‌రం తొలి రెండు క్వార్ట‌ర్ల‌లో ఒడుదొడుకులు త‌ప్ప‌క‌ పోవ‌చ్చ‌ని సంస్థ పేర్కొంది.
Tags:    

Similar News