వాళ్ళకు టికెట్లు ఇవ్వొద్దు... అయ్యన్న టార్గెట్ గంటాయేనా...?

Update: 2022-11-21 02:30 GMT
సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మాటకు అధినేత చంద్రబాబు ఎంతో విలువ ఇస్తూంటారు. ఆయన మాట పదునుగా ఉంటుంది కానీ విషయం అందులో ఉంటుందని చంద్రబాబు నమ్ముతారు. ఒక్కోసారి అయ్యన్న మాటల వెనక వీరావేశానికి బాబు కూడా ఇబ్బంది పడినా సర్దుకుపోతారు. ఎందుకంటే ఆయన టీడీపీకి వీర విధేయుడు.

పైగా చంద్రబాబు నమ్మే అతి కొద్ది మంది నాయకులలో ఆయన ముందుంటారు. అలాంటి అయ్యన్న చంద్రబాబుకు టికెట్లను ఇచ్చే విషయంలో తాజాగా పార్టీ సమావేశంలో కొన్ని కీలక సూచనలు చేశారు. వచ్చే ఎన్నికలు టీడీపీకి చావో రేవో లాంటివి కాబట్టి చంద్రబాబు ఎలాంటి మొహమాటాలకు, రాజీలకు అసలు   పోవద్దు అని గట్టిగానే చెప్పేశారు అయ్యన్న.

అంతే కాదు పనిమంతులకే టికెట్లు ఇవ్వాలి తప్ప వేరే విధంగా లాబీయింగ్ చేసేవారికి అసలు వద్దు అని కూడా అయ్యన్న పేర్కొన్నారు. అయిదేళ్ళ పాటు పార్టీ కోసం భుజాలు కాసి మోసి పనిచేసిన వారికే టికెట్లు ఇవ్వాలని కోరారు. అలాగే గెలుపు గుర్రాలను ఎంచి వారినే అభ్యర్ధులుగా ప్రకటించాలని అన్నారు.

పనిచేయకపోతే తనకు కూడా టికెట్ ఇవ్వవద్దు అంటూ చెప్పడం ద్వారా అయ్యన్న తన పాయింటులో ఎంత స్ట్రాంగ్ కంటెంట్ ఉందో తెలియచేశారు. దీతో ఇపుడు విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో చర్చ సాగుతోంది. గత మూడున్నరేళ్ళుగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పెద్దగా కనిపించింది లేదు.

తెలుగుదేశం పార్టీ మీటింగులలోనూ ఆయన ఉండడంలేదు. పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను ఆయన పట్టించుకోవడం లేదు అన్న అరోపణలు ఉన్నాయి. దాంతో సొంత పార్టీలో ప్రత్యర్ధిగా ఉన్న గంటా లాంటి వారికి స్ట్రోక్ ఇచ్చేందుకేనా పనిమంతులకే టికెట్లు అన్న ప్రతిపాదనను అయ్యన్న బాబు ముందు పెట్టారు అన్న చర్చ వస్తోంది.

నిజానికి గంటా పార్టీతో అధినాయకత్వంతో కొంత గ్యాప్ మెయింటెయిన్ చేస్తున్నారు అన్న ప్రచారం ఉంది. ఆయన మనసులో ఏముందో తెలియదు కానీ ఆయన మాత్రం చడీ చప్పుడు లేకుండానే ఉన్నారని అంటున్నారు. అయితే గెలుపు గుర్రాలకు టికెట్లు ఇవ్వాలను బాబు అనుకుంటే తప్పనిసరిగా గంటాకే టికెట్ వస్తుంది. ఆయన ఏనాడూ ఎన్నికల రాజకీయాల్లో ఓడింది లేదు.

పైగా అర్ధబలం అంగబలం పూర్తిగా ఉన్న గంటా తనతో పాటు మరి కొందరిని కూడా గెలిపించుకుని రాగల సమర్ధుడు. మరి ఆయన పార్టీ తరఫున ఆందోళలను చేయడంలేదో జనాల్లోకి రావడంలేదనో టికెట్ నిరాకరిస్తే నష్టం ఎవరికి అన్న ప్రశ్న కూడా ముందుకు వస్తోంది. అయ్యన్నపాత్రుడు 2014 లో గంటా టీడీపీలోకి రీ ఎంట్రీ ఇచ్చే వేళ కూడా వ్యతిరేకించారు.  కానీ బాబు చేర్చుకున్నారు. దాని ఫలితాన్ని కూడా ఆయన ఉత్తరాంధ్రా జిల్లాలలో పొందారు.

ఇపుడు కూడా సరిగ్గా ఎన్నికల వేళకు సరైన టైమింగ్ చూసుకుని గంటా తన రాజకీయ ఆట మొదలెడతారు అని అంటున్నారు. అయితే గంటా కనుక టీడీపీ రాజకీయాలలో ఉంటే అయ్యన్న వర్గానికి అది పోటీగానే ఉంటుందని అంటున్నారు.

మరి అయ్యన్న ఏ వుద్దేశ్యంతో ఈ ప్రతిపాదనలు చేశారో కానీ విశాఖ జిల్లా రాజకీయాల్లో మాత్రం అందరి చూపూ గంటా మీదనే ఉంది. గంటాకు బాబు నిజంగా టికెట్ నో అని చెప్పగలరా. చెబితే అది టీడీపీకి  బిగ్ రిస్క్ అవుతుందా కాదా అన్నది కూడా చర్చకు వచ్చే మాట. చూడాలి మరి బాబు గంటాల మధ్య ఏముందో. అయ్యన్న మాటల వెనక మర్మం ఏమిటి అన్నది తొందరలోనే తేలుతుంది అని అంటున్నారు.
Tags:    

Similar News